Saturday, April 20, 2024

సమరోత్సాహంతో భారత్.. క్లీన్‌స్వీప్‌పై కన్ను

- Advertisement -
- Advertisement -

ఢాకా: బంగ్లాదేశ్‌తో గురువారం ప్రారంభమయ్యే రెండో, చివరి టెస్టు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే తొలి టెస్టులో నెగ్గి 1-0 ఆధిక్యంలో నిలిచిన భారత్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. మరోవైపు ఆతిథ్య బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్ చావోరేవోగా తయారైంది. సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో గెలవక తప్పదు. అయితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న భారత్‌ను ఓడించాలంటే బంగ్లాదేశ్ అసాధారణ ఆటను కనబరచక తప్పదు. మరోవైపు తొలి టెస్టులో గెలిచిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ పేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

రాహుల్ డౌటే?
ప్రాక్టీస్ సెషన్‌లో భారత తాత్కాలిక కెప్టెన్ కెఎల్ రాహుల్ గాయం బారిన పడ్డాడు. దీంతో రెండో టెస్టులో అతడు బరిలోకి దిగుతాడా లేదా అనేది సందేహంగా మారింది. అయితే రాహుల్‌కు స్వల్ప గాయమే అయ్యిందని, అతను చివరి టెస్టులో ఆడడం ఖాయమనే నమ్మకంతో జట్టు యాజమాన్యం ఉంది. ఒకవేళ రాహుల్ కూడా దూరమైతే ఈ మ్యాచ్‌లో జట్టు సారథ్య బాధ్యతలను చటేశ్వర్ పుజారా చేపడుతాడు.

అందరికళ్లు పుజారాపైనే
ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు సీనియర్ బ్యాటర్ చటేశ్వర్ పుజారాపైనే నిలిచాయి. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ అసాధారణ బ్యాటింగ్‌తో అలరించిన పుజారా ఈసారి కూడా అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. మొదటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో అజేయ శతకంతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు కెప్టెన్ రాహుల్ గాయంతో సతమతమవుతుండడంతో ఈ మ్యాచ్‌లో ఆడడం అనుమానంగా మారింది. ఇదే జరిగితే రెండో టెస్టులో జట్టు సారథ్య బాధ్యతలను పుజారా చేపట్టడం ఖాయం. కెప్టెన్సీ దక్కితే పుజారా బాధ్యత మరింత పెరుగుతోంది. ఇక తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో అలరించిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా జట్టుకు కీలకంగా మారాడు. అతను ఫామ్‌లోకి రావడం జట్టుకు శుభసూచకంగా చెప్పాలి. అంతేగాక విరాట్ కోహ్లి కూడా రెండో ఇన్నింగ్స్‌లో బాగానే ఆడాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో పాటు ఆల్‌రౌండర్లు అశ్విన్, అక్షర్ పటేల్ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే టీమిండియాకు భారీ స్కోరు ఖాయం.

జోరుమీదున్న బౌలర్లు
తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్, సిరాజ్, అక్షర్, అశ్విన్ తదితరులు అద్భుత బౌలింగ్‌ను కనబరిచారు. కుల్దీప్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ సత్తా చాటాడు. సిరాజ్ కూడా ఆరంభంలోనే కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఉమేశ్ యాదవ్, సిరాజ్, కుల్దీప్, అశ్విన్‌లతో కూడిన బలమైన బౌలింగ్ లైనప్ భారత్‌కు అందుబాటులో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

గెలిచి తీరాల్సిందే..
మరోవైపు ఆతిథ్య టీమ్ బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్ చావోరేవోగా తయారైంది. సిరీస్‌ను సమం చేయాలంటే గెలవడం తప్పించి మరో మార్గం లేకుండా పోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అసాధారణంగా రాణిస్తేనే మెరుగైన ఫలితం లభిస్తోంది. అయితే బలమైన టీమిండియాను ఓడించి సిరీస్‌ను సమం చేయడం బంగ్లాదేశ్‌కు శక్తికి మించిన పనిగానే విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News