Saturday, April 20, 2024

సిరీస్‌పై టీమిండియా కన్ను

- Advertisement -
- Advertisement -

సిరీస్‌పై టీమిండియా కన్ను
ఇంగ్లండ్‌కు చావోరేవో, నేడు రెండో వన్డే

పుణె: ఇప్పటికే రెండు సిరీస్‌లను గెలిచి జోరుమీదున్న టీమిండియా వన్డేల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగే రెండో వన్డేకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. ఇప్పటికే కోహ్లి సేన ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు, టి20 సిరీస్‌లను గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. అయితే కీలక ఆటగాళ్ల గాయాలు టీమిండియాను కాస్త కలవరానికి గురిచేస్తున్నాయి. కానీ, బలమైన రిజర్వ్‌బెంచ్ ఉండడంతో ఈ మ్యాచ్‌లో కూడా భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇక ఇప్పటికే తొలి వన్డేలో ఓటమి పాలైన ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఇప్పటికే రెండు సిరీస్‌లను కోల్పోయిన ఇంగ్లండ్ వన్డే సిరీస్‌నైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడు కోవాలని భావిస్తోంది. కానీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ గాయం బారీన పడడం, మరో ఆటగాడు బిల్లింగ్స్ కూడా అందుబాటులో ఉండే పరిస్థితి లేక పోవడం ఇంగ్లండ్ సమస్యలను మరింత పెంచాయనే చెప్పాలి. దీనికి తోడు టీమిండియా వరుస విజయాలతో జోరుమీదుండడంతో ఈ మ్యాచ్ ఇంగ్లండ్‌కు పరీక్షగా మారిందనే చెప్పాలి. ఇందులో సఫలమైతేనే ఇంగ్లండ్ సిరీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేకుంటే మూడు ఫార్మాట్‌లలోనూ సిరీస్‌ను కోల్పోవడం ఖాయం.
ఓపెనర్లే కీలకం..
ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓపెనర్లు కీలకంగా మారారు. కిందటి మ్యాచ్‌లో రాణించిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లే ఈసారి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి. తొలి వన్డేలో గాయపడిన రోహిత్ ప్రస్తుతం కోలుకున్నాడు. దీంతో అతను బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ రోహిత్ కోలుకోకపోతే మాత్రం యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడు. మరోవైపు తొలి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌పై ఈసారి కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ధావన్ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు పెద్ద ఊరటనిచ్చే అంశం. ఎటువంటి బౌలింగ్‌నైనా దీటుగా ఎదుర్కొనే సత్తా ధావన్‌కు ఉంది. ఇక తొలి మ్యాచ్‌లో కేవలం రెండు పరుగుల తేడాతో శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కానీ ఈ మ్యాచ్‌లో ఆ లోటును తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుత ఫామ్‌లో ఉండడం కూడా టీమిండియాకు అతి పెద్ద ఊరటగా మారింది. టి20లలో వరుస అర్ధ సెంచరీలతో అలరించిన కోహ్లి మొదటి వన్డేలో కూడా సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో కూడా రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. కోహ్లి విజృంభిస్తే ఇంగ్లండ్ బౌలర్ల కష్టాలు రెట్టింపు కావడం ఖాయం.
ఛాన్స్ ఎవరికో?
ఇక గాయంతో సిరీస్‌కు దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో ఎవరికీ తుది జట్టులో స్థానం దొరుకుతుందో ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్‌ల మధ్య ఎవరికీ జట్టులో స్థానం లభిస్తుందో ఆసక్తికరంగా మారింది. ఇద్దరు కూడా ఫామ్‌లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై జట్టు యాజమాన్యం ఎటూ తేల్చేకోలేక పోతోంది. ఒకవేళ రిషబ్ పంత్‌కు తుది జట్టులో స్థానం లభించినా రాహులే వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించడం ఖాయంగా కనిపిస్తోంది.
జోరు సాగించాలి..
అరంగేట్రం మ్యాచ్‌లోనే విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యపై అందరిదృష్టి నెలకొంది. ఈ మ్యాచ్‌లో కూడా రాణించి జట్టు యాజమాన్యం తనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలని తహతహలాడుతున్నాడు. కృనాల్‌కు తోడు సోదరుడు హార్దిక్ కూడా తన బ్యాట్‌కు పనిచెప్పక తప్పదు. మొదటి వన్డేలో హార్దిక్ విఫలమయ్యాడు. ఈసారి మాత్రం మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు కెఎల్.రాహుల్ కూడా మొదటి వన్డేలో ధాటిగా ఆడడం జట్టుకు సానుకూల పరిణామంగా చెప్పాలి. ఫామ్‌లేమితో బాధపడుతున్న రాహుల్ కిందటి మ్యాచ్‌లో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్‌లో మరింత మెరుగ్గా ఆడాలని భావిస్తున్నాడు. రాహుల్ తనదైన శైలీలో విజృంభిస్తే భారత్‌కు ఈసారి కూడా భారీ స్కోరు ఖాయమని చెప్పొచ్చు. బౌలింగ్‌లో కూడా కోహ్లి సేన బలంగా కనిపిస్తోంది. అరంగేట్రం మ్యాచ్‌లోనే ప్రసిద్ధ్ కృష్ణ ఆకట్టుకున్నాడు. బెయిర్‌స్టో ధాటికి ఆరంభ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న ప్రసిద్ధ్ ఆ తర్వాత నిలకడైన ప్రదర్శనతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. ఈసారి కూడా జట్టు అతని నుంచి ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడమే కాకుండా కీలక సమయంలో వికెట్లను పడగొట్టి జట్టుకు అండగా నిలిచాడు. శార్దూల్ కూడా మూడు వికెట్లను పడగొట్టి జట్టు విజయలో తనవంతు పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్‌లో కుల్దీప్ స్థానంలో చాహల్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి.
గెలిచి తీరాల్సిందే..
పర్యాటక ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ చావోరేవోగా తయారైంది. సిరీస్‌లో నిలవాలంటే గెలుపు సాధించడం తప్ప మరో మార్గంలేదు. ఇందులో కూడా ఓడితే సిరీస్ కోల్పోక తప్పదు. ఇలాంటి స్థితిలో ఇంగ్లండ్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీనికి తోడు కెప్టెన్ మోర్గాన్ గాయంతో సతమతమవుతుండడం జట్టును మరింత కలవరానికి గురిచేస్తోంది. ఈ మ్యాచ్‌లో అతని ఆడతాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా, తొలి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన బెయిర్‌స్టోపైనే ఇంగ్లండ్ భారీ ఆశలు పెట్టుకుంది. బెయిర్‌స్టోతో పాటు బట్లర్, జాసన్ రాయ్, మోయిన్ అలీ, శామ్ కరన్ తదితరులు తమ బ్యాట్‌కు పనిచెప్పాలి. అప్పుడే ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. లేకుంటే మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను కోల్పోవడం తథ్యమనే చెప్పాలి.

IND vs ENG 2nd ODI Match Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News