Home తాజా వార్తలు తొలి రోజు ఆటముగిసేసరికి భారత్ 203/6

తొలి రోజు ఆటముగిసేసరికి భారత్ 203/6

 

ఆంటిగ్వా: వివియన్ రిచర్డ్ సన్ స్టేడియం వేదికగా విండీస్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియా తొలి రోజు ఆట ముగిసేసమయానికి 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్(20), రవీంద్ర జడేజా(3)లు ఉన్నారు. గురువారం వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన  భారత్ కు ఆదిలనే గట్టి దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్లో కెఎల్ రాహుల్ తో కలిసి ఓపెనింగ్ దిగిన మయాంక్ అగర్వాల్(5) స్వల్ప స్కోరుకే మొదటి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన నయా వాల్ ఛటేశ్వర పుజారా(2), కెప్టెన్ విరాట్ కోహ్లీ(9)లు వెంటవెంటనే ఔటై నిరాశపర్చారు.

దీంతో భారత్ 8 ఓవర్లలో 25 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ అజింక రహానె, రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే భాద్యతను తీసుకున్నాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తా ఆడారు. ఈ క్రమంలో జట్టు స్కోరు 93 పరుగుల వద్ద రాహుల్(44), రోంచ్ బౌలింగ్ లో షై హోప్ చేతికి చిక్కాడు. దీంతో రాహుల్ అర్థ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన హనుమ విహారీతో కలిసి రహానె 82 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. ఈ దశలో రహానె అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అనంతరం రహానె(81), విహారి(32)లు వరుసగా పెవిలియన్ చేరడంతో భారత్ మళ్లీ కష్టాల్లో పడింది. మరో వికెట్ పడకుండా రిషబ్, జడేజా తొలి రోజును ముగించారు.

IND vs WI 1st Test Day: India 206/6 at stumps