Friday, April 19, 2024

వన్‌డే సిరీసూ మనదే

- Advertisement -
- Advertisement -

వన్‌డే సిరీసూ మనదే
చివరి వన్డేలోఉత్కంఠ పోరులో 7 పరుగులతో విజయం
బ్యాటింగ్‌లో రాణించిన ధావన్, పంత్, పాండ్య
బౌలింగ్‌లో మెరసిన భువీ, శార్దూల్
కడదాకా పోరాడిన శామ్ కరన్

పుణె: ఇంగ్లండ్‌తో ఆదివారం ఇక్కడ జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఉత్కంఢ విజయ సాధించింది. బంతిబంతికి నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి మూడు ఓవర్లలో అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్‌లో విజయం సాధించింది. 330 పరుగులు లక్షాన్ని కాపాడుకొని ఏడు పరుగుల తేడాతో విజయం సాధించడమే కాకుండా సిరీస్‌ను కూడా 21 తేడాతో సొంతం చేసుకుంది. శామ్ కరన్ 95 నాటౌట్) కాస్సేపు భయపెట్టినా చివరికి విజయం మనదే అయింది.భారీ లక్షంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది. టీమిండియాకు తొలి ఓవర్‌లోనే వికెట్ దక్కింది. భువనేశ్వర్ ప్రసాద్ వేసిన ఆ ఓవర్‌లో వరస బౌండరీలు బాదిన జేసన్ రాయ్ ఓవర్ చివరి బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.ఆ తర్వాత భువీ తన తదుపరి ఓవర్‌లో బెయిర్‌స్టో(4)ను ఎల్‌బిడబ్లు చేశాడు. దీంతో ఆదిలోనే ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. డేంజరస్ బ్యాట్స్‌మన్ స్టోక్స్(35)నటరాజన్ పెవిలియన్‌కు పంపడంతో మ్యాచ్‌పై భారత్ పట్టు బిగించింది. మరి కాసేపటికే జోస్ బట్లర్(15)ను శార్దూల్ ఎల్‌బి చేశాడు. లియామ్ లివింగ్‌స్టన్, అర్ధశతకం చేసిన మలాన్‌నూ అతనే పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఇంగ్లండ్ కథ ముగిసిందనే అందరూ అనుకున్నారు. అయితే ఈ దశలో వచ్చిన, మొయిన్ అలీ, (25 బంతుల్లో 29), శామ్ కరన్‌లు జట్టును ఆదుకునేందుకు విఫల ప్రయత్నం చేశారు. బౌండరీలు బాదుతూ జట్టు ఆశలను జీవంతంగా ఉంచారు. ఏడో వికెట్‌కు 32 పరుగులు జోడించిన తర్వాత అలీని ఔట్ చేయడం ద్వారా భువీ ఈ జోడీని విడదీశాడు. అయితే కరన్ మాత్రం పట్టు వీడలేదు. ఆదిల్ రషీద్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం అందించాడు. జట్టు స్కోరు 257 పరుగుల వద్ద రషీద్‌ను శార్దూల్ పెవిలియన్‌కు పంపినా కరన్ పట్టు వీడలేదు. బౌండరీలు, సికర్లు బాదుతూ జట్టును విజయానికి చేరువ చేశాడు. తొమ్మిదో వికెట్‌కు 60 పరుగుల విలువైన భాగస్వామ్యం జోడించాడు. విజయ సమీకరణాన్ని మూడు ఓవర్లకు 23గా మార్చాడు. అయితే ఈ దశలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్ చేయడంతో ఆఖరి ఓవర్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా నటరాజన్ 6 పరుగులే ఇవ్వడంతో టీమిండియా గెలిచింది. కరోనా విజృంభణ అనంతరం స్వదేశీ గడ్డపై సాగిన తొలి సుదీర్ఘ టూర్‌లో టీమిండియా టెస్టులు, టి 20లతో పాటుగా వన్డే సిరీస్‌ను గెలిచి అన్ని ఫార్మాట్‌లలో తన ఆధిక్యతను చాటుకొంది.

మరోసారి భారీ స్కోరు
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 329 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ శిఖర్ ధావన్ (56బంతుల్లో 10 ఫోర్లతో 67)అర్ధ సెంచరతో రాణించగా, రోహిత్ శర్మ(37 పరుగులు) మరోసారి భారీ స్కోరు చేయడంలో విఫలమైనాడు. అయితే వీరిద్దరూ తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ భారీ స్కోరు చేయడానికి తగిన బలమైన పునాదిపడింది. అయితే వీరిద్దరూ వెంటవెంటనే ఔటవడంతో టీమిండియా పరుగుల వేగానికి బ్రేక్ పడింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 7 పరుగులే చేసి వెనుదిరగ్గా, రెండో వన్‌డేలో సెంచరీతో మెరసిన కెఎల్ రాహుల్ (7)సైతం ఈ మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. అయితే వికెట్ కీపర్ రిషబ్ పంత్ (62 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 78పరుగులు, హార్దిక్ పాండ్య (44 బంతుల్లో 5 ఫోర్లు4 సిక్స్‌లతో 64 పరుగులు) చెలరేగి పోవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ ఆడుతున్నప్పుడు టీమిండియా స్కోరు సునాయాసంగా 350 పరుగులను దాటిపోతుందనిపించింది. అయితే 3 ఓవర్ల తేడాలో వీరిద్దరూ ఔట్ కావడంతో భారత్ పరుగుల వేగానికి మరోసారి బ్రేక్ పడింది. కాగా అరంగేట్రం మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో చెలరేగిన కృనాల్ పాండ్య ఒక్క బౌండరీ కూడా కొట్టకుండా 34 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు. అయితే చివర్లో శార్దూల్ ఠాకూర్ (21 బంతుల్లోనే ఒక ఫోర్ ,3 సిక్స్‌లతో 30 పరుగులు) కొద్ది సేపు మెరుపులు మెరిపించడంతో భారత్ స్కోరు 300 దాటింది. అయితే మార్క్‌వుడ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి శార్దూల్ వికెట్ కీపర్ బట్లర్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా వెంటవెంటనే ఔటవడంతో టీమిండియా 48.2 ఓవర్లలో నే ఆలౌట్ అయింది. పూర్తి ఓవర్లు ఆడి ఉంటే మరిన్ని పరుగులు జట్టు స్కోరులో చేరి ఉండేవి. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్‌వుడ్ 3, రషీద్ 2 వికెట్లు తీశారు. కరన్, టాప్లే, స్టోక్స్, అలీ, లివింగ్‌స్టన్‌లకు తలా ఒక వికెట్ దక్కింది.
సచిన్-‌గంగూలీ తర్వాత రోహిత్ధా-వన్‌లే
కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అరుదైన రికార్డు సాధించారు. వన్డేలలో 5000కు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతర్జాతీయ వన్డేల్లో ఈ ఘనత సాధించిన ఏడో జోడీగా నిలిచారు. వన్డేల్లో అందరికన్నా ఎక్కువ పరుగులు సాధించింది సచిన్ తెండూల్కర్, సౌరబ్ గంగూలీ జోడీనే. వీరిద్దరూ తొలి వికెట్‌కు 8,227 పరుగులు జోడించారు.ఆ తర్వాత మరెవ్వరూ వీరికి దరిదాపుల్లోకి కూడా రాలేదు. సంగక్కరజయవర్దనె, దిల్షాన్ సంగక్కర, జయసూర్యఅటపట్టు, గిల్‌క్రిస్ట్‌హేడెన్, గ్రీనిడ్జ్ హెయిన్స్ జోడీలు కూడా 5 వేలకు పైగా పరుగులు సాధించిన జోడీలుగా ఉండగా ఇప్పుడు రోహిత్ శర్మశిఖర్ ధావన్ కూడా ఈ జాబితాలో చేరారు.
కోహ్లి @200
పుణె: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 200 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు. పుణె వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌తో కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. టీమిండియా తరఫున ఈ ఘనతను అందుకున్న మూడో కెప్టెన్‌గా నిలిచాడు. భారత్‌కు అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన కెప్టెన్‌గా ధోనీ ఉన్నాడు. ధోనీ తన కెరీర్‌లో మొత్తం 322 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. ఆ తర్వాత అజారుద్దీన్ 221మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు కోహ్లీ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. ఇక అంతర్జాతీయంగా కూడా ధోనీ ప్రథమ స్ధానంలో ఉండగా తర్వాత రికీ పాంటింగ్(324), స్టీఫెన్ ఫ్లెమింగ్(303), గ్రేమ్ స్మిత్(286), అలెన్ బోర్డర్(271),అర్జున రణతుంగ(249),అజారుద్దీన్(221) ఉండగా, ఇప్పుడు కోహ్లీ కూడా ఆ జాబితాలో చేరాడు.

IND won by 7 Runs in 3rd ODI Squad against ENG

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News