Thursday, April 25, 2024

ఒలింపిక్స్‌పై తొలగని అనిశ్చితి

- Advertisement -
- Advertisement -

Olympics

 

టోక్యో: కరోనా వ్యాధి రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రీడా సంగ్రామంగా పేరున్న ఒలింపిక్ క్రీడలు జరుగుతాయా లేదా అనే దానిపై నెలకొన్న ఉత్కంఠతకు తెరపడడం లేదు. కరోనా భయంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో క్రీడా పోటీలను తాత్కాలికంగా రద్దు చేశారు. పలు చోట్ల కనీసం క్రీడాకారులకు సాధన చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇలాంటి స్థితిలో కనీస సాధన లేకుండా ఒలింపిక్స్ వంటి మెగా క్రీడల బరిలో దిగడానికి క్రీడాకారులు వెనుకంజ వేస్తున్నారు. ఒలింపిక్ క్రీడల ప్రారంభానికి కొన్ని రోజుల గడువు మాత్రమే మిగిలి పోయిన పరిస్థితుల్లో కనీసం సాధన చేసే పరిస్థితులు కూడా లేక పోవడం క్రీడాకారులను కలవరానికి గురి చేస్తోంది. కరోనా నేపథ్యంలో ఒలింపిక్ క్రీడలను వాయిదా వేయాలని ఇప్పటికే డిమాండ్ ఊపందుకుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సయితం క్రీడలను కనీసం ఏడాది పాటు వాయిదా వేయాలని నిర్వాహకులను కోరారు. అయితే జపాన్ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్‌ను నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. ఒలింపిక్స్‌ను వాయిదా వేసే ప్రసక్తే లేదని జపాన్ ప్రధాని ఇప్పటికే స్పష్టం చేశారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా పోటీలను షెడ్యూల్ ప్రకారమే జరిపి తీరుమామని ఆయన పేర్కొనడం గమనార్హం.అంతేగాక క్రీడల్లో అతి ముఖ్యమైన ఒలింపిక్ జ్యోతి స్వాగత కార్యక్రమాన్ని కూడా నిర్ణీత గడువులోనే జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్యలను దృష్టిలో పెట్టుకుంటే ఒలింపిక్స్‌ను కచ్చితంగా నిర్వహించాలనే పట్టుదలతో జపాన్ ఉన్నట్టు స్పష్టమవుతోంది.

ప్రాక్టీసే అసలు సమస్య
కాగా, ఒలింపిక్ క్రీడల ప్రారంభానికి మరో రెండు నెలల సమయం ఉండడం, అప్పటి వరకు కరోనా అదుపులోకి వచ్చే పరిస్థితులు ఉండడంతో జపాన్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే జ్యోతి స్వాగత కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం నిర్వహించింది. అయితే జపాన్ ప్రభుత్వం క్రీడల నిర్వహణకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నా క్రీడాకారుల ఆందోళన మాత్రం తగ్గడం లేదు. ఎంతో తీవ్ర పోటీ ఉండే ఒలింపిక్ క్రీడల్లో రాణించాలంటే సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. పోటీలకు సన్నద్ధం కావాలంటే కఠోర సాధన ఒక్కటే ఏకైక మార్గంగా కనిపిస్తోంది. కానీ, కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే పలు అర్హత పోటీలను రద్దు చేశారు. బ్యాడ్మింటన్, టిటి, షూటింగ్, అథ్లెటిక్స్, హాకీ, ఫుట్‌బాల్, వాలీబాల్, స్విమ్మింగ్ వంటి పోటీలకు సన్నద్ధమయ్యే ఆటగాళ్లపై దీని ప్రభావం పడింది.

కనీస సాధన కూడా లేకుండా ఒలింపిక్ వంటి మెగా టోర్నీకి సిద్ధం కావడం తమకు సాధ్యం కాదని ఇప్పటికే పలు దేశాల క్రీడాకారులు తేల్చి చెప్పారు. తమ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఒలింపిక్ క్రీడల షెడ్యూల్‌ను మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య కానీ, జపాన్ ప్రభుత్వం కానీ ఈ విషయంలో మొండిగా వ్యవహారిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రీడలను వాయిదా వేయమని జపాన్ ప్రధాని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక, అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య కూడా పోటీల నిర్వహణకే మొగ్గు చూపుతోంంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారుల పరిస్థితి దయనీయంగా మారింది.

Indelible uncertainty over Olympics
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News