Home తాజా వార్తలు పంద్రాగస్టుకు గోల్కొండ ముస్తాబు

పంద్రాగస్టుకు గోల్కొండ ముస్తాబు

Golconda

మనతెలంగాణ, సిటిబ్యూరో : గోల్కొండ కోట లో 15న నిర్వహించనున్న ఇండిపెండెన్స్ డే పరేడ్‌కు వచ్చే వారు తమ వెంట ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వీక్షించేందుకు వచ్చే వారు తమతో హ్యాండ్ బ్యాగులు, బ్రీఫ్ కేసులు, కెమెరాలు, టిఫిన్ క్యారియర్లు తదితర వస్తువులు తీసుకురావద్దని కోరారు. ఎవరైనా వస్తువులు తీసుకువస్తే వాటిని తప్పనిసరిగా తనిఖీ చేస్తామని స్పష్టం చేశారు. స్వాతంత్ర దినోత్స వేడుకలు ప్రశాంతం గా జరిగేలా ప్రజలు పోలీసులకు తమవంతు సహకారాన్ని అందిచాలని, భద్రతా చర్యల్లో భాగంగా పలు ఆంక్షలు విధించామని తెలిపా రు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ట్రాఫిక్ ఆంక్ష లు కూడా ఉంటాయని తెలిపారు. వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏరియాలను కేటాయించామని పేర్కొన్నారు. ఎ,బి,సి,డి పాస్‌ల వారీగా కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే తమ వాహనాలను నిలుపుకుని పోలీసులకు సహకరించాలని సిపి తెలిపారు.
ఏర్పాట్లు చకచకా..
పంద్రాగస్టు దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటలో నిర్వహించనున్న జెండావందనం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు విద్యుత్, జిహెచ్‌ఎంసి, అటవీ శాఖ అధికారులు తెలిపారు. గోల్కొండకు వెళ్లే మార్గాల రోడ్లకు మరమ్మతులు, పారిశుద్ధం పనులను జిహెచ్‌ఎంసి అధికారులు చేపట్టారు. ప్రత్యేక ఆకర్షణ కోసం పలు రకాల పూల మొక్కలు, లైట్ల ఏర్పాట్లు, గోల్కొండ కోటను మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించారు. వివిఐపి, విఐపిలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వారి వచ్చే మార్గాల్లో సామాన్యులు రాకుండా ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రానున్న మార్గాల్లో జాగిలాలతో ప్రత్యేక పోలీసుల బృందం తనిఖీలు చేసింది. జెండా ఆవిష్కరణ చేసే ప్రాంతాన్ని, పోలీసుల గౌరవ వందనం చేసే ప్రాంతాన్ని అనువణువునా పోలీసులు తనిఖీ చేశారు.
నిఘా నీడలో…
జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు అనంతరం జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకలు కావడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. విఐపిలు, మంత్రులు, అతిథిలు రానుండడంతో ఆ మార్గాలపై దృష్టి సారించారు. వీరు వచ్చే మార్గాల్లో ఉదయం 8 గంటల నుంచి 12 వరకు ఎవరినీ అనుమతించకుండా ఆంక్షలు విధించారు. వారి కోసం కోటకు సమీపంలోని వాహనాల పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. వాటిని కూడా పరిమిత సంఖ్యలోనే వాహనాలను అనుమతిస్తున్నట్లు తెలిపారు. పోలీసు బలగాలు మఫ్టీలో, మహిళా పోలీసులను కూడా బందోబస్తులో భాగంగా నియమించారు. సిసికెమెరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు, మొబైల్ వాహనాల్లో ఆయా ప్రాంతాల్లో సిసికెమెరాలతో అనువణువు చిత్రీకరించనున్నారు. అనుమానస్పదంగా కన్పించిన వారిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించేందుకు మొబైల్ పార్టీలను ఏర్పాటు చేశారు.

Independence Day celebration arrangements at Golconda