Friday, April 19, 2024

టాప్ ర్యాంక్ కోల్పోయిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

teamindia

 

ఆస్ట్రేలియాకు అగ్రస్థానం, ఐసిసిటెస్టు ర్యాంకింగ్స్

ముంబై: సుదీర్ఘ కాలం పాటు టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కొనసాగిన టీమిండియా ప్రస్తుతం మూడో ర్యాంక్‌కు పడి పోయింది. 2016 అక్టోబర్‌లో టాప్ ర్యాంక్‌ను అందుకున్న భారత జట్టు 42 నెలల పాటు అగ్రస్థానంలో కొనసాగింది. ఈ క్రమంలో టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక కాలం పాటు నంబర్‌వన్‌గా నిలిచిన మూడో జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. కొంతకాలంగా టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కాగా, టీమిండియా ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయం పాలైంది. దీని ప్రభావం ర్యాంకింగ్స్‌పై పడింది. దీంతో చాలా రోజుల తర్వాత టీమిండియా టాప్ ర్యాంక్‌ను కోల్పోక తప్పలేదు. ప్రస్తుతం భారత్ మూడో ర్యాంక్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2016 నుంచి టెస్టు ఫార్మాట్‌లో టీమిండియా నిలకడైన విజయాలు సాధిస్తూ వస్తోంది.

వరుసగా సిరీస్‌లు సాధిస్తూ ర్యాంకింగ్స్‌లో ప్రత్యర్థి జట్లకు అందనంత ఎత్తులో నిలిచింది. అంతేగా టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కూడా వరుసగా ఏడు విజయాలు సాధించి సత్తా చాటింది. కానీ, న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలు కావడంతో దాని ప్రభావం టెస్టు ర్యాంకింగ్స్‌పై పడింది. మూడున్నర ఏళ్ల పాటు నంబర్‌వన్‌గా కొనసాగిన టీమిండియా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక సమయం టాప్ ర్యాంక్‌లో కొనసాగిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో 95 నెలల పాటు అగ్రస్థానంలో కొనసాగింది. 20012009 కాలంలో ఆస్ట్రేలియా మొత్తం 95 నెలల పాటు టెస్టుల్లో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఇక, వెస్టిండీస్ 1981 నుంచి 1989 వరకు మొత్తం 89 నెలల పాటు టాప్ ర్యాంక్‌లో కొనసాగింది.

ఇక, ఇంగ్లండ్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇదిలావుండగా తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా 116 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. న్యూజిలాండ్ 115 పాయింట్లతో రెండో ర్యాంక్‌ను సాధించింది. భారత్ 114 రేటింగ్ పాయింట్లతో మూడో ర్యాంక్‌ను దక్కించుకుంది. కాగా, కరోనా వల్ల కొంత కాలంగా టెస్టు సిరీస్‌లు ఎక్కడికక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. దీంతో దీని ప్రభావం జట్ల ర్యాంకింగ్స్‌పై కూడా పడింది. సిరీస్‌లు లేక పోవడంతో భారత్ తన టాప్ ర్యాంక్‌ను కోల్పోక తప్పలేదు.

 

India 3rd Place In Test rankings
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News