Wednesday, April 24, 2024

రెండో రోజూ టీమిండియాదే.. సత్తా చాటిన యువ బౌలర్లు

- Advertisement -
- Advertisement -

రెండో రోజూ మనదే.. సత్తా చాటిన యువ బౌలర్లు
చివరి టెస్టు: ఆస్ట్రేలియా 369 ఆలౌట్, భారత్ 62/2

India 62/2 at Stumps on Day 2 against Australia
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. రెండో రోజు ఆటకు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో చివరి రెండు సెషన్లలో ఆట సాధ్యం కాలేదు. ఆటను నిలిపి వేసే సమయానికి మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా 49 బంతుల్లో 8 (నాటౌట్), కెప్టెన్ అజింక్య రహానె 19 బంతుల్లో 2 (నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. మరోవైపు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే భారత్ మరో 307 పరుగులు చేయాలి. ఇక తొలి ఇన్నింగ్స్‌లో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ విఫలమయ్యాడు. 15 బంతుల్లో ఏడు పరుగులు చేసిన గిల్‌ను కమిన్స్ ఔట్ చేశాడు. దీంతో భారత్ 11 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది.
రోహిత్ దూకుడు

India 62/2 at Stumps on Day 2 against Australia

ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను రోహిత్ శర్మ తనపై వేసుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును ముందుకు నడిపించాడు. అతనికి పుజారా అండగా నిలిచాడు. రోహిత్ దూకుడుగా ఆడగా, పుజారా మాత్రం తన మార్క్ డిఫెన్స్‌తో అలరించాడు. ఇద్దరు సమన్వయంతో ఆడడంతో భారత్ కోలుకుంటున్నట్టే కనిపించింది. కానీ రోహిత్ భారీ షాట్‌ను కొట్టే క్రమంలో వికెట్‌ను పారేసుకున్నాడు. లియాన్ బంతిని బౌండరీకి తరలించాలని భావించిన రోహిత్ అంచన తప్పి స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ 60 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక జట్టు స్కోరు 26 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 62 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం మొదలైంది. ఆ తర్వాత ఆట మళ్లీ సాధ్యం కాలేదు. ఇక నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 11తో సమంగా ఉన్న విషయం తెలిసిందే.
భారత బౌలర్ల జోరు..
అంతకుముందు 274/5 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. కెప్టెన్ టిమ్ పైన్, కామెరూన్ గ్రీన్ ఆరంభంలో కాస్త బాగానే ఆడారు. ఇద్దరు కుదురుగా ఆడడంతో భారత బౌలర్లకు కష్టాలు తప్పవని అందరూ భావించారు. కానీ ప్రమాదకరంగా మారిన పైన్ (50)ను శార్దూల్ ఠాకూర్ పెవిలియన్ పంపాడు. శార్దూల్ వేసిన అద్భుత బంతికి పైన్ స్లిప్‌లో రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 98 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి తెరపడిది. ఆ వెంటనే కామెరూన్ గ్రీన్ కూడా వెనుదిరిగాడు. ఆరు ఫోర్లతో 47 పరుగులు చేసిన గ్రీన్‌ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశాడు. సుందర్ అద్భుత బంతితో గ్రీన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇలా ఇద్దరు వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో భారత్ మళ్లీ పైచేయి సాధించింది. చివరల్లో మిఛెల్ స్టార్క్ 20 (నాటౌట్), నాథన్ లియాన్ (24) కాస్త రాణించడంతో ఆస్ట్రేలియా స్కోరు 369 పరుగులకు చేరింది. ఒక దశలో ఆస్ట్రేలియా 500 పరుగుల మైలురాయిని అందుకోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ భారత బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో కంగారూలను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. భారత బౌలర్లలో నటరాజన్, శార్దూల్, సుందర్‌లు మూడేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్‌కు ఒక వికెట్ లభించింది. మరోవైపు ఆస్ట్రేలియా రెండో రోజు మరో 95 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన వికెట్లను కోల్పోవడం గమనార్హం. బుమ్రా, షమి, ఉమేశ్, అశ్విన్, జడేజా వంటి సీనియర్ బౌలర్లు లేకున్నా యువ బౌలర్లు అసాధారణ బౌలింగ్ నైపుణ్యంతో కంగారూలను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. అరంగేట్రం మ్యాచ్‌లు ఆడిన నటరాజన్, సుందర్‌లు మూడేసి వికెట్లు పడగొట్టి సత్తా చాటారు.
వర్షం అడ్డంకి
ఇక గబ్బా స్టేడియంలో జరుగుతున్న నాలుగో, చివరి టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. శనివారం రెండో రోజు దాదాపు రెండు సెషన్ల పాటు ఆట సాధ్యం కాలేదు. భోజన విరామం తర్వాత భారీ వర్షం రావడంతో ఆటను నిలిపి వేయాల్సి వచ్చింది. ఎడతెరిపి లేని వర్షంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. ఇక సాయంత్రం వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. దీంతో ఆటను తిరిగి ప్రారంభించడం సాధ్యం కాలేదు. ఇక ఆదివారం మూడో రోజు ఎక్కువ సేపు ఆటను కొనసాగించే అవకాశం ఉంది. కానీ, ఆదివారం కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లలోనూ ఆందోళన నెలకొంది.

India 62/2 at Stumps on Day 2 against Australia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News