Home తాజా వార్తలు జోరుగా.. హుషారుగా

జోరుగా.. హుషారుగా

India
కొత్త జోష్‌తో టీమిండియా

ఇండోర్: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా మరో సిరీస్‌పై కన్నేసింది. ఇటీవలే బలమైన దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ సొంత గడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇండోర్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు ఇప్పటికే సాధన ప్రారంభించారు. మంగళవారం టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చారు. ఇటీవల జరిగిన ట్వంటీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లి జట్టులో చేరాడు. ఆటగాళ్లలో కొత్త స్ఫూర్తిని నింపాడు. కోహ్లితో సహా సీనియర్ ఆటగాళ్లందరూ సాధనలో నిమగ్నమయ్యారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన ఐదు మ్యాచుల్లోనూ భారత్ ఘన విజయాలు సాధించింది. 240 పాయింట్లతో ప్రత్యర్థి జట్లకు అందనంత ఎత్తులో నిలిచింది.

తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో కూడా క్లీన్‌స్వీప్‌పై దృష్టి పెట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో టాప్ ఆర్డర్ అసాధారణ రీతిలో చెలరేగి పోయిన విషయం తెలిసిందే. ఓపెనర్‌గా అవతారమెత్తిన రోహిత్ శర్మ ఆ సిరీస్‌లో పరుగుల వరద పారించాడు. వరుస సెంచరీలతో టెస్టుల్లో కూడా తనకు ఎదురులేదని నిరూపించాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా అద్భుతంగా రాణించాడు. ఓ డబుల్ సెంచరీ, మరో శతకంతో సత్తా చాటాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. సీనియర్లు అజింక్య రహానె, చటేశ్వర్ పుజారాలు కూడా సఫారీలపై మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తెలుగుతేజం హనువ విహారి కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బౌలింగ్‌లో కూడా భారత్ నిలకడైన ప్రదర్శనను కనబరిచింది. రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఇటు బంతితో అటు బ్యాట్‌తో ప్రకంపనలు సృష్టించాడు. బంగ్లాదేశ్‌పై కూడా ఇలాంటి ప్రదర్శనే చేయాలని తహతహలాడుతున్నాడు. ఇక, ప్రధాన బౌలర్ అశ్విన్ కూడా చెలరేగి పోయాడు. సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీయడం ద్వారా తనలో జోష్ తగ్గలేదని నిరూపించాడు. స్పీడ్‌స్టర్ మహ్మద్ షమి కూడా అసాధారణ బౌలింగ్‌ను కనబరిచాడు. కీలక సమయంలో వికెట్లు తీస్తూ జట్టుకు అండగా నిలిచాడు.

ఉమేశ్ యాదవ్ కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బంగ్లా పై కూడా ఉమేశ్, ఇషాంత్‌లు చెలరేగేందుకు సిద్ధమయ్యారు. వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా ఇదే లక్షంతో ఉన్నాడు. స్పీడ్‌స్టర్లు కూడా సాధనలో నిమగ్నమయ్యారు. ఇక, కెప్టెన్ కోహ్లి రాకతో జట్టులో ఉత్సాహం తొణికిసలాడుతోంది. తనదైన శైలీలో ఆటగాళ్లను సిరీస్‌కు సిద్ధం చేస్తున్నాడు. తన మార్క్ సరదాతో ఆటగాళ్లలో కొత్త జోష్‌ను నింపుతున్నాడు. కోహ్లి, రోహిత్, మయాంక్, రహానె, విహారి, పుజారా, జడేజా, సాహా, అశ్విన్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇక, బౌలింగ్‌లో కూడా టీమిండియాకు తిరుగేలేదని చెప్పక తప్పదు. దీనికి తోడు సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్ కావడంతో కోహ్లి సేన జైత్ర యాత్రను అడ్డుకోవడం బంగ్లాదేశ్‌కు శక్తికి మించిన పనిగానే కనిపిస్తోంది.

India and Bangladesh cricket teams arrived in Indore