Home జాతీయ వార్తలు భారత్-ఆస్ట్రేలియా రక్షణ బంధం

భారత్-ఆస్ట్రేలియా రక్షణ బంధం

 India-Australia Sign Landmark Agreement

 

సైనికంగా మరింతగా ఇచ్చిపుచ్చుకునేవీలు
మోడీ మోరిసన్ ఆన్‌లైన్ సదస్సు
పరస్పర పర్యవేక్షణలకు వీలు

న్యూఢిల్లీ : భారత్ ఆస్ట్రేలియాల మధ్య గురువారం మైలురాయి వంటి రక్షణ ఒప్పందం కుదిరింది. కరోనా వైరస్ నేపథ్యంలో భారత్ ప్రధాని నరేంద్ర మోడీ , ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మధ్య అసాధారణ రీతిలో ఆన్‌లైన్ సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా ఇరువురు నేతలు రక్షణ ఒప్పందానికి సమ్మతించారు. దీనితో ఇరుదేశాల మధ్య వ్యూహత్మక భద్రతా చర్యలకు వీలేర్పడుతుంది. ఇరుదేశాల మధ్య పరస్పరం సైనిక స్థావరాల అనుసంధానానికి వీలేర్పడుతుంది. ఇరువురు నేతల చర్చల దశలో మరో ఆరు ఒప్పందాలు కూడా కుదిరాయి. ఈ ప్రక్రియతో భారత్, ఆస్ట్రేలియాల మధ్య విస్తృతస్థాయి బంధం మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అత్యంత కీలకమైన భద్రతా, రక్షణ ఒప్పందం పరస్పర వ్యూహాత్మక మద్దతు ఒప్పందం (ఎంఎల్‌ఎస్‌ఎ)గా రూపుదిద్దుకుంది.

ఉగ్రవాదం ఇతరత్రా సవాళ్ల నేపథ్యంలో ఇరుదేశాల సైనిక వర్గాలు పరస్పరం సైనిక స్థావరాలకు వెళ్లేందుకు, అక్కడ మరమ్మత్తులకు, సాధనాసంపపత్తి బలోపేతానికి చర్యలు తీసుకోవచ్చు. అంతేకాకుండా సమగ్రరీతిలో రక్షణ సహకారాన్ని ఇనుమడింపచేసేందుకు వీలు కల్పిస్తుంది. పరస్పర సైనిక సమన్వయం దిశలో ఇటువంటి రీతిలో ఇప్పటికే భారతదేశం అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్‌లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. సైబర్ నేరాలు, సైబర్ సంబంధితప్రాధాన్యతగల టెక్నాలజీ, మైనింగ్, ఖనిజాలు, మిలిటరీ టెక్నాలజీ, వృత్తి విద్యారంగం, జలవనరుల నిర్వహణ వంటి అంశాలపై కూడా ఒప్పందాలు కుదిరాయి.

ఇరువురే నేతల మధ్య చర్చల తరువాత అధికార వర్గాలు సంయుక్త ప్రకటన వెలువరించాయి. కరోనా సంక్షోభం కట్టడి, ఉగ్రవాదం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర మార్గాలలో భద్రతా అంశాల గురించి ఇరువురు నేతలు సమీక్షించారు. ప్రపంచ వాణిజ్య సంస్థలో సంస్కరణల ప్రక్రియపై కూడా సమాలోచనలు జరిపారు. ఇటీవలి కాలంలో వివాదాస్పదం అయిన ద్వంద్వ పన్నుల విధానం కూడా చర్చకు వచ్చింది. దీనికి సత్వర పరిష్కారం దిశలో తీసుకోవల్సిన చర్యల గురించి కూడా నేతలు మాట్లాడుకున్నారని సంయుక్త ప్రకటనలో తెలిపారు.