Home ఆసియా కప్ 2018 ఏడోసారి ఆసియా కప్ గెలిచిన భారత్

ఏడోసారి ఆసియా కప్ గెలిచిన భారత్

India beat Bangladesh in Final to clinch Asia Cup 2018 title

దుబాయి: చివరి వరకు దోబూచులాడిన విజయాన్ని భారత జట్టు ఒడిసిపట్టుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో టీమిండియా ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంతో విజేతగా నిలిచింది. నువ్వానేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ప్రత్యర్థి బంగ్లాదేశ్ పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఏడోసారి ఆసియా కప్ ను కైవసం చేసుకుంది. మొదట టాస్ గెలిచిన టీమిండియా ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాట్స్ మెన్లలో లిటన్‌ దాస్‌ (117 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 121) సెంచరీతో అదరగొట్టాడు. సౌమ్య సర్కార్‌ (33), మెహదీ హసన్‌ (32) ఫర్వాలేదనిపించారు. మొదట వికెట్‌ నష్టపోకుండా 120 పరుగులు చేసిన బంగ్లా ఆ తరువాత 222 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో కుల్‌దీప్‌ యదవ్‌ (3/45), కేదార్‌ జాదవ్‌ (2/41), చాహల్‌ (1/31) వికెట్లు తీశారు.

అనంతరం 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ ను ధాటిగానే ప్రారంభించింది. అయితే 11 పరుగుల వ్యవధిలోనే టోర్నీ మొత్తంలో అద్భుతమైన ఫామ్ ఆకట్టుకున్న శిఖర్ ధావన్(15)తో పాటు రాయుడు(2) వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్ 46 పరుగులకే 2 వికెట్లు పారేసుకుంది. అనంతరం కెప్టెన్ రోహిత్, దినేష్ కార్తీక్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. భారత ఇన్నింగ్స్ లో రోహిత్ (55 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కార్తీక్ (61 బంతుల్లో 37; 1 ఫోర్, 1 సిక్స్), ధోనీ (67 బంతుల్లో 36; 3 ఫోర్లు), కేదార్ జాదవ్ (23 నాటౌట్) లు రాణించారు. ఇక ఆఖరి మూడు ఓవర్లలో 13 పరుగులు రావాల్సి ఉండగా జడేజా (23), భువనేశ్వర్‌ (21) వరుస ఓవర్లలో పెవిలియన్ చేరడంతో భారత శిబిరంలో కలవరం మొదలైంది. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివరి ఓవర్ లో ఆరు పరుగులు అవసరం కాగా తొలి రెండు బంతులకు సింగిల్స్‌ వచ్చాయి. ఆ తర్వాత మూడో బంతికి కుల్దీప్‌ రెండు పరుగులు సాధించాడు. నాలుగో బంతికి పరుగులేమి రాలేదు. ఐదో బంతికి మరో సింగిల్‌ వచ్చింది. ఇక విజయానికి కావాల్సిన ఒక్క పరుగు ఆఖరి బంతికి బైస్‌ రూపంలో పరుగు రావడంతో టీమిండియా చిరస్మరణీయ విజయంతో ఏడో ఆసియా కప్ ను తన ఖాతాలో వేసుకుంది.

స్కోర్ బోర్డు:-

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్: లిటన్‌ దాస్‌ (స్టంప్డ్‌) ధోనీ (బి) కుల్దీప్‌ యాదవ్‌ 121; మెహదీ హసన్‌ (సి) అంబటి రాయుడు (బి) కేదార్‌ జాదవ్‌ 32; ఇమ్రుల్‌ కయేస్‌ (ఎల్బీ) చాహల్‌ 2; ముష్ఫికర్‌ రహీమ్‌ (సి) బుమ్రా (బి) కేదార్‌ జాదవ్‌ 5; మహ్మద్‌ మిథున్‌ (రనౌట్‌) 2; మహ్ముదుల్లా (సి) బుమ్రా (బి) కుల్దీప్‌ 4; సౌమ్య సర్కార్‌ (రనౌట్‌) 33; మష్రఫే మోర్తజా (స్టంప్డ్‌) ధోనీ (బి) కుల్దీప్‌ యాదవ్‌ 7; నజ్ముల్‌ ఇస్లామ్‌ (రనౌట్‌) 7; ముస్తాఫిజుర్‌ రహమాన్‌ (నాటౌట్‌) 2; రూబెల్‌ హొస్సేన్‌ (బి) బుమ్రా 0;
ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 48.3 ఓవర్లలో 222 ఆలౌట్‌.
వికెట్ల పతనం: 1-120, 2-128, 3-137, 4-139, 5-151, 6-188, 7-196, 8-213, 9-222, 10-222.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 7-0-33-0; బుమ్రా 8.3-0-39-1; చాహల్‌ 8-1-31-1; కుల్దీప్‌ యాదవ్‌ 10-0-45-3; రవీంద్ర జడేజా 6-0-31-0; కేదార్‌ జాదవ్‌ 9-0-41-2.
 భారత్‌ ఇన్నింగ్స్: రోహిత్‌ శర్మ (సి) నజ్ముల్‌ (బి) రూబెల్‌ 48; ధవన్‌ (సి) సౌమ్య సర్కార్‌ (బి) నజ్ముల్‌ 15; అంబటి రాయుడు (సి) ముష్ఫికర్‌ (బి) మష్రఫె 2; దినేష్‌ కార్తీక్‌ (ఎల్బీ) మహ్మదుల్లా 37; ధోనీ (సి) ముష్ఫికర్‌ (బి) ముస్తాఫిజుర్‌ 36; కేదార్‌ జాదవ్‌ (నాటౌట్‌) 23; రవీంద్ర జడేజా (సి) ముష్ఫికర్‌ (బి) రూబెల్‌ 23; భువనేశ్వర్‌ కుమార్‌ (సి) ముష్ఫికర్‌ (బి) ముస్తాఫిజుర్‌ 21; కుల్దీప్‌ యాదవ్‌ (నాటౌట్‌) 5;
ఎక్స్‌ట్రాలు 13; మొత్తం: 50 ఓవర్లలో 223/7.
వికెట్ల పతనం: 1-35, 2-46, 3-83, 4-137, 5-160, 6-212, 7-214.
బౌలింగ్‌: మెహ్దీ హసన్‌ 4-0-27-0; ముస్తాఫిజుర్‌ రహమాన్‌ 10-0-38-2; నజ్ముల్‌ ఇస్లామ్‌ 10-0-56-1; మష్రఫె మోర్తజా 10-0-35-1; రూబెల్‌ హొస్సేన్‌ 10-2-26-2; మహ్మదుల్లా 6-0-33-1.