Home జాతీయ వార్తలు ఒకే దేశం ఒకే కార్డు

ఒకే దేశం ఒకే కార్డు

Amit Shah

 

వచ్చేది డిజిటల్ సెన్సస్
హోం మంత్రి అమిత్ షా
జనగణనకు భవిష్య కోణం

న్యూఢిల్లీ: దేశంలో ఒక వ్యక్తికి ఒకే బహుళ వినియోగ గుర్తింపు కార్డు ఉండాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదించారు. పౌరులకు మల్టీపర్పస్ కార్డుల జారీకి వీలుందని, వీటిని వెలువరించడం అసాధ్యమేమీ కాదన్నారు. ఆధార్, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు గుర్తింపు కార్డు, పాన్‌కార్డులు బ్యాంకు ఖాతాల వంటి వాటికి బదులుగా ఏకైక గుర్తింపు కార్డు ద్వారా అన్ని అవసరాలు తీరే పద్ధతిని ఎంచుకోవల్సి ఉందన్నారు. దేశంలో ఇప్పటికైతే ఇటువంటి మల్టీపర్పస్ కార్డుల పద్థతి లేదని, వీటిని ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదని స్పష్టం చేశారు. కేంద్ర హోం మంత్రి ఇక్కడ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్‌ఇండియా, సెన్సన్ కమిషనర్ నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమం తరువాత మాట్లాడారు.

పౌరుల గుర్తింపు కార్డుల ప్రక్రియలో మరింత సమగ్రత అవసరం అని అమిత్ షా అభిప్రాయపడ్డారు. అనేక రకాల గుర్తింపు కార్డుల ప్రక్రియకు బదులుగా ఒకే కార్డు ఉంటే అన్నింటికీ మంచిదన్నారు. ఇక దేశంలో 2021లో జరిగే జనాభా లెక్కల ప్రక్రియ సమగ్రంగా ఉంటుందని వివరించారు. ఇందుకోసం తొలిసారిగా ప్రత్యేకంగా మొబైల్ యాప్ వినియోగం జరుగుతుందని , దేశ జనగణన ప్రక్రియలో ఇది ఒక విప్లవాత్మకఘట్టం అవుతుందన్నారు. అత్యంత అధునాతన సాంకేతిక ప్రక్రియను జనాభా లెక్కల సందర్భంగా అనుసంధానం చేసుకుంటారని, దీనితో జనాభా లెక్కలలో సమగ్రత ఏర్పడుతుందని, ఇది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుందని వివరించారు.

ప్రజలు ఇప్పుడు తమ గుర్తింపు ఇతర అవసరాల కోసం అనేక రకాల కార్డులను వినియోగించుకోవల్సి వస్తోందని, వ్యక్తుల సమాచారంతో కూడిన కార్డులు వేర్వేరుగా చూపాల్సి వస్తోంది. బ్యాంకు ఖాతాలు వేరుగా నిర్వహించాల్సి వస్తోంది. వీటన్నింటికి బదులుగా పౌరుల సమాచారాన్ని ఒకే కార్డులో పొందుపర్చి, వివిధ దైనందిన అవసరాలకు దీనిని వినియోగించుకునే పద్ధతి ఎందుకు రాకూడదని అమిత్ షా ప్రశ్నించారు. సింగిల్ కార్డు ప్రక్రియ సౌకర్యంగా ఉంటుంది. అంతకు మించి ప్రజలకు వెసులుబాటుగా మారుతుంది. ప్రభుత్వానికి కూడా పౌరుల గుర్తింపు సంక్లిష్టత తొలిగిపోతుందని హోం మంత్రి తెలిపారు. వచ్చే జనగణన వినూత్న రీతిలో డిజిటల్ సంవిధానంతో జరుగుతుంది. ఈ డిజిటల్ సెన్సస్ మల్టీపర్పస్ కార్డుల జారీకి కీలకం అవుతుందన్నారు.

2021 సెన్సస్‌కు నమోదు గడువు 2021 మార్చి 1
2021లో జరిగే జనాభా లెక్కల ప్రక్రియకు రెఫరెన్స్ తేదీని 2021 మార్చి 1 వ తేదీగా ఖరారు చేశారు. అయితే జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లోని హిమపాత ప్రాంతాలు, ఉత్తరాఖండ్‌లలో ఈ గడువునుఏ 2020 అక్టోబర్ 1వ తేదీగా నిర్ణయించారు. సెన్సస్ ప్రక్రియకు రూ 12,000 కోట్ల వ్యయ అంచనా వేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 16 భాషలలో జనగణన జరుగుతుంది. దేశ భవిష్య ప్రణాళికలు, ప్రగతి చర్యలు, సంక్షేమ పథకాలకు ఈ విస్తృత స్థాయి జనగణన మైలురాయి అవుతుందని హోం మంత్రి తెలిపారు. ప్రజలంతా ఈ కార్యక్రమంలో మనస్ఫూర్తిగా పాల్గొనాలని, అన్ని విధాలుగా సహకరించాలని, స్వచ్ఛందంగా ఎవరికి వారే నమోదు చేసుకుంటే ఉపయుక్తంగా ఉంటుందన్నారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు జన గణన ప్రాధాన్యతను వివరించాల్సి ఉందని, దీని వల్ల కలిగే ప్రయోజనాలను వారికి తెలియచేయాలని హోం మంత్రి తెలిపారు. సెన్సస్ డాటా సక్రమ వినియోగం బహుళార్థకం అవుతుందని, దేశ ప్రగతికి ఎంతగానో దోహదం చేస్తుందని స్పష్టం చేశారు.

పుణ్యంగా భావించండి
జనాభా లెక్కల ప్రక్రియను సంబంధిత అధికారులు అంకితభావంతో చేపట్టాలని హోం మంత్రి సూచించారు. సరైన రీతిలో ఈ ప్రక్రియను చేపట్టడాన్ని వారు పుణ్యం మూటగట్టుకునే అవకాశంగా మలుచుకోవాలని ఉద్భోదించారు. దేశం బాగుకు ఉపయోగపడే ప్రక్రియను మరింత చిత్తశుద్దితో నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను వేర్వేరుగా ప్రచార ఆర్బాటంగా చేపట్టేవని, సమగ్రమైన కార్యాచరణ ఏదీ ఉండేది కాదని, ఇక ముందు ఈ విధంగా జరగబోదని, జనగణనలో తేలిన లెక్కల ప్రకారం ఏఏ వర్గాలకు ఏ స్థాయిలో ప్రయోజనాలు సరైన సంక్షేమాలు చేపట్టాల్సి ఉందనేది ఖరారు చేసుకుంటారని, దీనివల్ల ప్రగతికి సమన్వయం ఏర్పడుతుందన్నారు.

India can have a single multipurpose id card