Thursday, March 28, 2024

సంపాదకీయం: కరకు కరోనా!

- Advertisement -
- Advertisement -

India corona update today కాల చక్రం గిర్రున తిరుగుతున్నా కరోనా పీడ వదలడం లేదు. రోజులు, నెలలు గడచిపోతున్నా వైరస్ వ్యాప్తి విరామమైనా చిత్తగించకుండా విజృంభిస్తున్నది. కోవిడ్ 19 దేశంలోకి ప్రవేశించి ఏడెనిమిది మాసాలవుతున్నది. తొలి కేసు కేరళలో నమోదయి ఐదు మాసాలు కావస్తున్నది. దేశ వ్యాప్త కఠోర లాక్‌డౌన్ నాలుగు మాసాల పాటు అమలులో ఉన్నది. అది మండు వేసవిలో వలస కార్మికుల మూలుగులను పీల్చిపిప్పి చేసిన వైనం కళ్లారా చూసినదే. ఇప్పటికీ థియేటర్ల వంటివి తెరచుకోనేలేదు. మాస్క్‌లు ధరించడం పూర్తి స్థాయిలో అమలవుతున్నది. బాధితుల ఏకాంత వాసాలు, వైరస్ టెస్టులు, అవసరమైన చికిత్సలు వగైరా జరుగుతూనే ఉన్నాయి. అయినా కరోనా కాటేయడం కడతేరలేదు. జోరు పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య శనివారం నాటికి 13 లక్షల 30 వేల దాటింది. ఇందులో వైరస్ తీవ్రంగా ఉన్న కేసులు 4,56,171. మృతుల సంఖ్య 31,358కి చేరుకున్నది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 757 మంది మృతి చెందారు. వైరస్ సోకిన వారిలో 63.54 శాతం మంది కోలుకున్నారు.

ఇంత ప్రళయంలోనూ బతికి బట్ట కడుతున్న వారి శాతం అత్యధికంగా ఉండడం ఆశావహ పరిణామం. కరోనా వచ్చిన వారంతా లేదా వారిలో ఎక్కువ మంది చనిపోవడం ఖాయమనే ప్రమాదకర, ప్రాణాంతక పరిస్థితి లేదు. ఇది నిస్సందేహంగా శుభ సూచకం. అదే సమయంలో వైరస్ సోకిందో లేదో తెలుసుకునే పరీక్షల వేగం, సంఖ్య గణనీయంగా పెరగడం మరో హృద్యమైన మార్పు. ఈ నెల 24 నాటికి దేశమంతటా 1,58,49,068 నమూనాల సేకరణ, పరీక్షలు జరిగాయి. శుక్రవారం ఒక్క రోజునే అతి ఎక్కువగా 4, 20,898 శాంపిళ్ల పరీక్షలయ్యాయి. ప్రతి 10 లక్షల మందిలో 11,485 మందికి టెస్టులు జరుగుతున్నాయి. ఈ రేటు రోజురోజుకీ పెరుగుతోంది. పరీక్షలు ముమ్మరించే కొద్దీ బాధితుల సంఖ్య కూడా ఎగబాకుతోంది. పరీక్షించడం, వైరస్ ఉనికిని నిర్ధారించుకోడం, చికిత్స చేయడం అనే త్రిముఖ వ్యూహం అమలవుతున్నది. గత జనవరిలో దేశంలో కరోనా పరీక్షల లాబొరేటరీ ఒకే ఒకటి ఉండేది.

ఇప్పుడు వాటి సంఖ్య 1301 కి చేరుకున్నది. కరోనా బాధితులపై మితిమించి బిల్లులు వేసి గుంజుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రులను దారికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కరోనా పట్ల నిరంతరం, ప్రతినిత్యం అప్రమత్తంగా ఉండవలసి రావడం, జంకు, బెదురు లేకుండా పూర్వం మాదిరిగా నలుగురు కలిసి బేఫర్వాగా పనిపాట్లు చేసుకునే పరిస్థితి పునరుద్ధరణ కాకపోడం ఆందోళనకరం. ఇలా ఎంత కాలం, దీనికి అంతులేదా అనే ప్రశ్నలకు సమాధానాలు కరవు. కేసులు మళ్లీ పెరిగి పేట్రేగిపోయే ప్రమాదమున్నదనే హెచ్చరికలు మరింత భీతిగొల్పుతున్నాయి. కొన్ని చోట్ల తిరిగి లాక్‌డౌన్ విధించారని, మరి కొన్ని చోట్ల ఆ యోచన సాగుతున్నదని వస్తున్న వార్తలు గుండె బేజారును పెంచుతున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టగలిగిందనుకున్న కేరళలో కూడా మళ్లీ అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా వచ్చిన వారిని అంటరానివారుగా చూడడం, మృతుల మృత దేహాలను వారి ఇళ్లకు సైతం తీసుకురానీయకపోడం, శ్మశానాల్లో తీవ్ర వివక్ష కనపరచడం వంటి పోకడలు దుర్భరమైన సరికొత్త వెలి వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ మొత్తం సంక్షోభం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు తగిలిన దెబ్బ అసాధారణమైనది, అనితరమైనది.

దేశ జనాభాలో మూడొంతులకు పైగా గల పేద, మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలు చెప్పనలవికానవి. ఉద్యోగాలు ఊడిపోయి, ఉపాధి దీపాలారిపోయి, పొదుపు చేసుకున్నదంతా ఊడ్చిపెట్టుకుపోయి అతలాకుతలమైపోతున్నారు. కరోనా కత్తిగట్టి కదం తొక్కుతున్న ఈ కాలంలో ప్రజల పొదుపు సొమ్ములో 80 శాతం మేర వైద్య ఖర్చుల కింద హరించుకుపోయిందని సర్వేలు చెబుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ శాశ్వతంగా 10 శాతం వెనుకపట్టు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత మే 26 నాటి ఎస్‌బిఐ నివేదిక ప్రకారం అప్పటికి అమలయిన రెండు మాసాల లాక్‌డౌన్ వల్ల ఆర్థిక రంగం రూ. 30 లక్షల 3 వేల కోట్ల నష్టాన్ని చవిచూసింది. అది ఇప్పటికి ఇంకెంత పెరిగి ఉంటుందో ఊహకందని విషయం కాదు. అధిక జనసాంద్రత, పరిమిత వైద్య ఆరోగ్య వ్యవస్థ కారణంగా దేశంలో కరోనా బాధితుల సంఖ్య మరింతగా పెరిగే సూచనలున్నాయి. తిరుగులేని టీకా మందు కనుగొని, అది అందరికీ చవకగా అందుబాటులోకి వచ్చేవరకు రెప్పవేయని జాగృతితో, నిత్య జాగ్రత్తతో మాత్రమే ఈ పెను సంక్షోభం నుంచి గట్టెక్కగలం. కేంద్ర, రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల మధ్య మరింత సహకారంతో పోరాట సామర్థాన్ని పెంచుకుంటూ, వైరస్ నిర్మూలనకు నిర్విరామ కృషి సాగించడమే శరణ్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News