Home జాతీయ వార్తలు ఇక పెళ్లి పోరాటం

ఇక పెళ్లి పోరాటం

India court legalises gay sex in landmark ruling

న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరం కాదనే సుప్రీంకోర్టు కీలక తీర్పు పలు కీలక పరిణామాలకు దారితీసింది. ఈ తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, (ఎల్‌జిబిటి) వారు తాము పౌర హక్కుల కోసం చట్టపరంగా పోరాడుతామని తెలిపారు. ఈ తీర్పు తరువాత తమ తదుపరి చర్య ఇదేనని స్పష్టం చేశారు. దేశంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 377లోని నిబంధనలు సమానత్వపు హక్కును హరిస్తున్నాయని రెండు రోజుల క్రితమే అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ సెక్షన్‌ను పాక్షికంగా కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. స్వలింగ సంపర్కం ఇకపై నేరం కాదని, నేరం కానందున తాము స్వలింగ వివాహాలు, ఆస్తుల హక్కులు, వారసత్వపు అనుభవం, బీమాలో వాటాలు వంటి పలు అంశాలపై న్యాయపోరాటానికి దిగుతామని లెస్బియన్లు వెల్లడించారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా నైతిక పరిణామాలు తలెత్తుతున్నాయని, దీనిని పరిష్కరించుకునేందుకు ప్రత్యేకించి స్వలింగ వివాహాల పిటిషన్లను సవాలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. లెస్బియన్ల సమానత ప్రాధమిక హక్కు అయినందున దీని సంబంధిత అన్ని ప్రయోజనాలు తమకు న్యాయబద్ధంగా చెందాల్సి ఉంటుందని సెక్షన్ 377 వ్యతిరేక పిటిషనర్లలో ఒకరైన సునీల్ మెహ్రా తెలిపారు.
స్వలింగ వివాహం, ఆస్తుల హక్కులు వంటివాటితో పాటు తమ హక్కులకు తగు గౌరవం కల్పించాల్సి ఉందని సునీల్ డిమాండ్ చేశారు. తమకు హక్కులలో భాగంగా దక్కాల్సిన ప్రయోజనాలను కాదనడం రాజ్యాం గ వ్యతిరేకం అవుతుందన్నారు. సంబంధిత హక్కులను తమకు కల్పించరాదని కొందరు వాదించడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. అయితే స్వలింగ లైంగిక చర్యలను శిక్షలకు అతీతం చేయడం వరకూ బాగానే ఉంది కానీ, స్వలింగ వ్యక్తుల మధ్య వివాహబంధం వరకూ ఇది దారితీయరాదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకే జెండర్‌కు చెందిన వారి వివాహాలు, వారి దాంపత్య జీవనాన్ని తాము వ్యతిరేకిస్తామని ప్రభుత్వ అధికారి ఒకరు పేరు గోప్యత నడుమ తెలిపారు.
ప్రకృతి విరుద్ధ పరిణయం కుదరదు: ఆర్‌ఎస్‌ఎస్
స్వలింగ సంపర్కుల వివాహాలు ప్రకృతి ధర్మం పరిధిలో అనుచితం అని బిజెపి సిద్ధాంత మూల సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ స్పష్టం చేసింది. ప్రకృతి విరుద్ధమైన వాటిని తాము సమ్మతించేది లేదని, ఇటువంటి వైపరీత్యపు సం బంధాలను భారతీయ సమాజం అంగీకరించబోదని ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధి అరుణ్ కుమార్ తెలిపారు. వివాదాస్పదంగా ఉన్న సెక్షన్ 377పై గురువారం సుప్రీంకోర్టు 493 పేజీల సుదీర్ఘ తీర్పును వెలువరించింది. ఇందులో అనేక అంశాలను ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని ధర్మాసనం ప్రస్తావించింది. సామాజిక కట్టుబాట్ల పేరిట రాజ్యాంగపరమైన స్వేచ్ఛను హరించరాదని పేర్కొంటూ లెస్బియన్ల హక్కులను సమర్థించింది.
స్వలింగ సంపర్కులూ ఒక ఇంటివారయ్యారు
హక్కులు, జీవన శైలిని ఎంచుకునే స్వేచ్ఛ వాతావరణంలో ఇప్పటికే దేశంలో కొన్ని చోట్ల గత దశాబ్ధ కాలంలో కొందరు లెస్బియన్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఏదో ఒక వేడుకను ఎంచుకుని వారు కళ్యాణం చేసుకుని జంటలుగా మారారు. ఇక కొందరు లెస్బియన్ల వివాహాలకు చట్టబద్ధత ఉన్న దేశాలకు తరలివెళ్లి దంపతులుగా మారి తిరిగి వచ్చారు. ఇతర దేశాలలో స్వలింగ సంపర్కరం దానితో పాటు వివాహం నేరం కాదని, అంతేకాకుండా చట్టపరమైన ఇతరత్రా ప్రయోజనాలను కూడా వారు అనుభవిస్తున్నారని, భారతదేశంలో ఈ వివక్ష ఎందుకని స్వలింగ సంపర్కుల కోసం దాఖలు అయిన పిటిషన్లలో ప్రస్తావించారు.

సెక్షన్ 377కు హెన్రీ రాజు కాలపు మూలాలు

గే సెక్స్ నేరంగా నిర్ధేశించే సెక్షన్ 377కు 1553 నాటి కింగ్ హెన్రీ రాజరికపు కాలపు మూలాలు ఉన్నాయి. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తమ సుదీర్ఘ తీర్పులో వెల్లడించింది. స్వలింగ సంపర్కాన్ని నేరం గా పరిగణించే 158 ఏళ్ల నాటి సెక్షన్ పరాయి రాజుల చట్టాల స్ఫూర్తితో రూపుదిద్దుకుందని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగం అందరికీ సమానత్వం, గౌరవప్రద జీవన హక్కును కల్పించింది. అయితే దీనిని ఐపిసిలో సెక్షన్ 377 దెబ్బతీసిందని ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం వెల్లడించింది. బ్రిటన్‌లో వికృత లైంగిక చేష్టల నిరోధానికి 1533లో కింగ్ హెన్రీబగ్గెరీ యాక్ట్ తీసుకువచ్చారు. దీని మేరకు మనుష్యులు లేదా జంతువులతో వికృత లైంగిక చర్యలను నిషేధించారు. దీని పరిధిలో అలాంటి చర్యలకు పాల్పడ్డవారికి మరణశిక్షను ఖరారు చేశారని ధర్మాసనం తెలిపింది. దీనిని ప్రాతిపదికగా చేసుకుని రూపొందించిన సెక్షన్‌తో హక్కు ల హరణం జరిగిందని ధర్మాసనం గుర్తు చేసింది.