Home జాతీయ వార్తలు 100 కోట్ల వెలుగులు

100 కోట్ల వెలుగులు

India crossed 100 crore vaccination milestone

 

టీకాల అపురూపఘట్టాన్ని వేడుకగా నిర్వహణ
త్రివర్ణాల్లో మెరిసిపోయిన పురావస్తు కట్టడాలు
ఎర్రకోట వద్ద ప్రత్యేక గీతం విడుదల

న్యూఢిల్లీ: 100 కోట్ల డోసుల రికార్డును భారత్ ఘనంగా జరుపుకొంటోంది. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ అపురూప ఘట్టానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఆడియో విజువల్ పాటను విడుదల చేశారు. ‘ టీకాసే బచే హై దేశ్’ పేరుతో రూపొందించిన ఈ గీతాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత కైలాష్ ఖేర్ ఆలపించారు. కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విట్టర్ వేదికగా ఈ గీతాన్ని పంచుకున్నారు. ఎర్రకోటపై దాదాపు 1400 కిలోల బరువుండే భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. పురావస్తు శాఖ కూడా ఈ ఆనందంలో పాలు పంచుకుటోంది. 100 కోట్ల డోసులకు సూచనగా దేశవ్యాప్తంగా 100 పురావస్తు కట్టడాలను జాతీయ పతాక వర్ణాల వెలుగుల్లో నింపేయాలని నిర్ణయించింది.

జాతీయ జెండా రంగులు విరజిమ్మే కట్టడాల జాబితాలో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించిన 17 కట్టడాలున్నాయి. ఎర్రకోట, కుతుబ్ మీనార్, హుమయూన్ టోంబ్, పురానా ఖిలా, ఫతేపూర్ సిక్రీ, రామప్ప ఆలయం, హంపిలతో పాటుగా హైదరాబాద్‌లోని గోల్కొండ కోటపై కూడా ఈ రంగులు ప్రదర్శించనున్నారు. 100 కోట్ల వ్యాక్సిన్ మైలురాయిని స్మరించుకునేందుకు స్పైస్ జెట్ గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో ఒక ప్రత్యేక లైవరీని ప్రదర్శించింది. తమ సంస్థకు చెందిన మూడు బోయింగ్ 737 విమానాలను ప్రధాని మోడీతో పాటుగా ఆరోగ్య కార్యకర్తల చిత్రాలతో అలంకరించారు. కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, మన్‌సుఖ్ మంఆడవీయలతో పాటుగా స్పైస్‌జెట్ సిఎండి అఃవ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే కాకుండా కొన్ని మొడైల్ సంస్థలు 100 కోట్ల డోసుల మైలురాయిని పూర్తి చేసుకోవడాన్ని ప్రస్తావించే కాలర్ ట్యూన్లను కూడా ప్రవేశపెట్టాయి. వివిధ రాష్ట్రాల్లో ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.

వ్యాక్సినేషన్ ప్రస్థానం ఇలా..
కరోనా మహమ్మారి కోరలు విరిచేందుకు భారత్ చేపట్టిన టీకా మహోద్యమం గురువారం కీలక ఘట్టానికి చేరుకుంది. బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమంలో ‘శతకోటి’ ప్రయాణాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంది. చైనా తర్వాత వందకోట్ల డోసులు అందించిన రెండో దేశంగా భారత్ నిలిచింది. దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఈ ఏడాది జనవరి 16న టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిదశలో భాగంగా కరోనాపై పోరులో ముందున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ కార్మికలుకు టీకా ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్ 1నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి, మే 1నుంచి 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ వ్యాక్సిన్ వేయడం ప్రాంభించారు. టీకా పంపిణీ ప్రాంభమైన తొలి నాళ్లలో ప్రజల్లో నెలకొన్న భయాలు, ఇతరత్రా కారణాల వల్ల టీకా పంపిణీ కార్యక్రమం నెమ్మదిగా సాగింది.

అయితే ఈ ఏడాది మార్చిలో కరోనా రెండో దశ విజృంభణ తర్వాతనుంచి వ్యాక్సినేషన్ ఊపందుకుంది. జూన్ నెలాఖరులో రోజుకు 40లక్షల డోసులు పంపిణీ చేయగా, ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 17న ఒక్క రోజే ఏకంగా 2.5 కోట్ల డోసులను అందించారు. అక్టోబర్ 21 నాటికి 100 కోట్ల డోసుల మార్క్‌ను దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల డోసులను పంపిణీ చేసిన రెండోదేశం భారత్ కావడం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి దేశం చైనా. అక్కడ ఇప్పటికే టీకా డోసుల పంపిణీ 200 కోట్లు దాటినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా దేశాలు భారత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

31 శాతం మందికి రెండు డోసులు పూర్తి
కొవిన్ వెబ్‌సైట్ ప్రకారం గురువారం ఉదయం 9.47 గంటల సమయంలో డోసుల పంపిణీ 100 కోట్లు దాటింది. అయితే ఇందులో ఎక్కువ శాతం మంది తొలి డోసు తీసుకున్న వారే. అధికార వర్గాల గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 75 శాతం అర్హులైన వారికి తోలి డోసు టీకా పూర్తవ్వగా దాదాపు 31 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉండడంతో ఇకపై రెండో డోసుపై దృష్టి పెట్టాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను అదేశించింది.

India crossed 100 crore vaccination milestone