న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్ డ్రైవ్ చాలా వేగంగా కొనసాగుతోందని, ఇదే వేగం కొనసాగితే డిసెంబర్ నాటికి దేశ జనాభాలో 43 శాతం మందికి టీకాలు అందుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. జనవరిలో ప్రారంభమైన టీకా కార్యక్రమం కింద ఇప్పటివరకు 75 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని మంత్రి తెలిపారు. 75 వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ 75 కోట్ల మైలురాయిని చేరుకోవడంపై మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. మూడో ముప్పు ఆందోళనల నేపథ్యంలో కరోనా ను ఎదుర్కోవాలంటే డిసెంబర్ నాటికి 60 శాతం దేశ జనాభాకు రెండు డోసులు అందాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ లక్షాన్ని చేరాలంటే దేశంలో రోజుకు 1.2 కోట్ల మందికి టీకా వేయాల్సి ఉంది. మరోపక్క ఈ ఏడాది చివరినాటికి 200 కోట్ల డోసులు పంపిణీ చేస్తామని కేంద్రం ప్రకటించింది. వారం రోజులుగా సగటున రోజుకు 70 లక్షలకు పైగా డోసులు పంపిణీ అయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.