Thursday, April 25, 2024

తొలి టెస్టులో భారత్ చిత్తు

- Advertisement -
- Advertisement -

India team

 

పది వికెట్లతో కివీస్ జయభేరి

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు పది వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. ఇక, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వరుస విజయాలతో అజేయంగా కొనసాగుతున్న భారత్ జోరుకు కివీస్ బ్రేక్ వేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ ఘన విజయం సొంతం చేసుకుంది. ఇక, పేలవమైన ఆటతో నిరాశ పరిచిన విరాట్ కోహ్లి సేన తన ఖాతాలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఇరు జట్ల మధ్య రెండో, ఆఖరి టెస్టు శనివారం నుంచి జరుగనుంది. ఇక, ఈ మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన టిమ్ సౌథికి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైంది. ఇక, 9 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ఛేదించింది. దీంతో ఈ మ్యాచ్ నాలుగో రోజే ముగిసింది.

ఆరంభంలోనే
144/4 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియాకు ఆరంభంలోనే కోలుకోలేని షాక్ తగిలింది. జట్టును ఆదుకుంటాడని భావించిన వైస్ కెప్టెన్ అజింక్య రహానె ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. 75 బంతుల్లో ఐదు ఫోర్లతో 29 పరుగులు మాత్రమే చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే మరో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి కూడా ఔటయ్యాడు. విహారి కూడా జట్టును ఆదుకోవడంలో విఫలమయ్యాడు. 79 బంతుల్లో 15 పరుగులు చేసిన విహారిను టిమ్ సౌథి అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఓటమి దాదాపు ఖరారై పోయింది. ఈ దశలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కొద్ది సేపు పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. మిగతావారు కివీస్ బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక పోయారు.

రవిచంద్రన్ అశ్విన్ (4), ఇషాంత్ శర్మ (12)లు వెంటవెంటనే పెవిలియన్ చేరారు. కుదురుగా ఆడుతున్న రిషబ్ పంత్ (25)తో పాటు బుమ్రా (౦)లను టిమ్ సౌథి ఔట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్ 81 ఓవర్లలో 191 పరుగుల వద్ద ముగిసింది. కివీస్ బౌలర్లలో సౌథి ఐదు, బౌల్ట్ నాలుగు వికెట్లు పడగొట్టారు. గ్రాండోమ్‌కు ఒక వికెట్ లభించింది. ఇక, 9 పరుగుల స్వల్వ లక్ష్యాన్ని న్యూజిలాండ్ 1.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఓపెనర్లు లాథమ్ ఏడు, బ్లండెల్ రెండు పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇదిలావుండగా ఈ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 348 పరుగులు సాధించింది. దీంతో కివీస్‌కు 183 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

India defeated first Test match
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News