Home జాతీయ వార్తలు ఉగ్రవాదంపై ఉత్తుత్తి మాటలొద్దు

ఉగ్రవాదంపై ఉత్తుత్తి మాటలొద్దు

Dawood-Ibrahim

న్యూఢిల్లీ : ఉగ్రవాదం కట్టడిలో పాకిస్థాన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవల్సి ఉందని భారతదేశం స్పష్టం చేసింది. పాకిస్థాన్‌లో ఉంటున్న భారతీయ పౌరులు దావూద్ ఇబ్రహీం, సయీద్ సలాహుద్దిన్ ఇతర ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని పేర్కొంది. పుల్వామాలో భీకర ఉగ్రవాద దాడుల తరువాత కూడా పాకిస్థాన్ ఉగ్రవాద శక్తులపై నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని భారత ప్రభుత్వ వర్గాలు నిరసన వ్యక్తం చేశాయి. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న వారు పలువురు పాకిస్థాన్‌లోనే తిష్టవేసుకుని ఉన్నారు. వీరి అప్పగింత పాకిస్థాన్ కనీస ధర్మం అని తెలిపారు. పాకిస్థాన్ భూభాగాన్ని తమ కార్యకలాపాలకు అడ్డాగా మలుచుకున్నారు. భారతీయ పౌరులైన దావూద్ ఇబ్రహీం, హిజ్బుల్ ముజాహిద్దిన్ అధినేత సలాహుద్దిన్‌లను న్యాయ విచారణలకు భారత్‌కు అప్పగించాల్సి ఉందని స్పష్టం చేశారు.ఈ బాధ్యత పాకిస్థాన్ ప్రభుత్వంపై ఉందని ప్రభుత్వ వర్గాలు శనివారం పేర్కొన్నాయి. జైష్ ఎ మహమ్మద్ ఇతర ఉగ్రవాద సంస్థలపై పాకిస్థాన్ ఇప్పటికీ నిర్థిష్ట చర్యలకు దిగకపోవడం శోచనీయం అని భారతదేశం పేర్కొంది.

ఉగ్రవాదానికి ఆలవాలంగా మారిన పాకిస్థాన్‌ను అన్ని విధాలుగా ఏకాకిని చేసేందుకు భారతదేశం వాణిజ్య, దౌత్యపరంగా చర్యలు తీసుకొంటోంది. కంటితుడుపు చర్యలతో అసలు సమస్య తీరిపోదని , కొందరు ఉగ్రవాదులను ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకున్నంతనే వేళ్లూనుకున్న ఉగ్రవాదం సమసిపోతుందా? ఇది మొక్కుబడిగా చేతులు దులుపేసుకునే తత్వం అవుతుందని భారతదేశం ఘాటుగా విమర్శించింది. పుల్వామాలో అత్యంత భీకర దాడులు జరిగాయి. మరి ఇప్పటికీ పాకిస్థాన్ సదరు ఉగ్రవాద సంస్థపై ఏదైనా కఠిన చర్య తీసుకుందా? అని భారత ప్రభుత్వ వర్గాలు ప్రశ్నించాయి. ఉగ్రవాదంపై భారతదేశం వ్యక్తం చేస్తూ వస్తోన్న ఆందోళనను పాకిస్థాన్ అర్థం చేసుకుందా? చేసుకుని ఉంటే ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే వారి భూభాగంలో ఉంటున్న దావూద్ ఇతరులను వెంటనే భారత్‌కు అప్పగించి నిజాయితీ నిరూపించుకోవల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భారత్‌లో పలు ఉగ్రవాద దాడులతో దావూద్, సలాహుద్దిన్ ఇతర ఉగ్రవాదులకు సంబంధం ఉందని కీలక ఆధారాలు చూపడం జరిగింది. మరి ఇప్పటికీ వీరిపై పాకిస్థాన్ అధికార యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని భారతదేశం నిలదీసింది.
మా ఆధారాలను నిర్థారించుకోవచ్చు
పాకిస్థాన్ భూభాగం నుంచి సమన్వయితంగా ఉగ్రవాద దాడులకు పదునైన రీతిలో వ్యూహరచన సాగుతూ వస్తోంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పాకిస్థాన్‌కు తమ వైపు నుంచి సరైన సాక్షాధారాలను పంపించడం జరిగింది. వివిధ కీలక వివరాలను అందించామని , వీటిని అవసరం అయితే పాకిస్థాన్ మూడో దేశం నుంచి కూడా సరైనవా? కావా? అనేది నిర్థారించుకోవచ్చునని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పుల్వామాలో ఉగ్ర దాడిని భారతదేశం తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిని పూర్తి స్థాయిలో అంతర్జాతీయ అంశంగా తీసుకువెళ్లి, పాకిస్థాన్‌పై తగు విధంగా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అదే విధంగా మసూద్ ఇతర ఉగ్రవాదులను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్పించేందుకు, ఉగ్రవాద నిధుల స్తంభనకు అన్ని చర్యలూ చేపట్టింది.

దావూద్ అప్పగింతతోనే పలు ఉగ్రదాడుల లోగుట్లు వెలుగులోకి వస్తాయని, వీటిని ఆధారంగా చేసుకుని ఉగ్రవాదుల ఆటకట్టుకు సరైన చర్యలు తీసుకోవచ్చునని చాలా కాలంగా భారతదేశం ఎదురుచూస్తోంది. పుల్వామా దాడి, ఆ తరువాత ఫిబ్రవరి 26వ తేదీన బాలాకోట్‌లో భారతీయ వైమానిక దళం జరిపిన ప్రతీకార చర్యతో అణ్వాయుధ ఇరుగుపొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. పుల్వామా దాడికి దిగింది తామేనని జైషే సంస్థ ప్రకటించుకుంది. బాలాకోట్ దాడులకు బదులుగా సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ యుద్ధ విమానాలు దాడులకు యత్నించాయి. కీలక భారతీయ సైనిక స్థావరాలను దెబ్బతీసేందుకు విఫలయత్నం చేశాయి. వీటిని ఐఎఎఫ్ తిప్పికొట్టింది.

India demands Pakistan to hand over Dawood Ibrahim