Home ఎడిటోరియల్ పాకిస్తాన్‌పై దౌత్య యుద్ధం!

పాకిస్తాన్‌పై దౌత్య యుద్ధం!

 

పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారతదేశం దౌత్యపరంగా పాకిస్తాన్‌ను ఒంటరి చేయడానికి నడుం కట్టింది. ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉంది. పాకిస్తాన్‌ను ఖండిస్తూ వివిధ దేశాల నుంచి అధికారిక ప్రకటనలు వచ్చేలా చేయడం, పాకిస్తాన్ దౌత్యవేత్తలను పిలిచి హెచ్చరించేలా చేయడం వంటి అనేక చర్యలు చేపట్టేలా ప్రపంచ దేశాలను ఒప్పిస్తున్నది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సు పరిశీలనలో పాకిస్తాన్ ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టులో చేర్చేలా ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా ఇండియా ప్రారంభించింది. మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించేలా పూర్తి స్థాయి ప్రయత్నాలు జరుగుతున్నాయి,.
పుల్వామా దాడి తర్వాత దౌత్యపరంగా భారతదేశం తీసుకోబోతున్న ఈ చర్యలను విదేశాంగశాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియాకు వివరించారు. భద్రతామండలి శాశ్వత సభ్య దేశాలైన చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికాతో పాటు దక్షిణాసియా దేశాలు, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉంది. జైష్ వంటి ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకునేలా అంతర్జాతీయ ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తున్నది. పాకిస్తాన్ భూభాగం నుంచి పనిచేస్తున్న టెర్రరిస్టు సంస్థలకు ఆ ప్రభుత్వం సహాయం చేయరాదని, వారికి నిధులు అందజేయరాదని డిమాండ్ గట్టిగా వినిపిస్తూ, టెర్రరిజాన్ని ఒక విధానంగా పాకిస్తాన్ అమలు చేస్తున్నదని ప్రపంచ దేశాలకు తెలియజేసే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసింది.
పుల్వామా దాడి జరిగిన రెండవ రోజు ఏసియాన్ దేశాలు, ఇరాన్, గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్, మధ్యాసియా, ఆఫ్రికా దేశాలతో భారతదేశం ఈ విషయమై మాట్లాడింది. పాకిస్తాన్ వివరణలను తిరస్కరిస్తూ అది బాధ్యత వహించాలన్న ఒత్తిడి పెంచడం జరిగింది. ఇప్పటికి దాదాపు 50 దేశాలు భారతదేశం పట్ల సానుభూతి ప్రకటిస్తూ, పుల్వామా దాడిని ఖండిస్తూ ప్రకటనలు చేశాయి. ఒక్క అమెరికా మాత్రమే పాకిస్తాన్ పేరును స్పష్టంగా ప్రస్తావిస్తూ ప్రకటన చేసింది. పాకిస్తాన్ నుంచి పనిచేసే ఉగ్రవాద సంస్థ జైష్ అంటూ అమెరికా ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద సంస్థలకు అవకాశం ఇవ్వరాదని పాకిస్తాన్‌ను డిమాండ్ చేసింది. కాని కేవలం ఈ ప్రకటనల వల్ల పరిస్థితేమీ మారదు.
అందువల్ల భారతదేశం ప్రత్యక్షంగా పాకిస్తాన్‌ను దెబ్బతీసే స్థాయిలో ప్రపంచ దేశాల ప్రతిస్పందన కోరుతోంది. పాకిస్తాన్‌ను సూటిగా విమర్శించే ప్రకటనలు, దాని పాత్రను సూటిగా, ఎలాంటి అస్పష్టతకు అవకాశం లేకుండా ఖండించే ప్రకటనలు వివిధ దేశాలు చేసేలా దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలు దేశాల్లో పాకిస్తాన్ దౌత్య కార్యాలయాలున్నాయి. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే ఈ దేశాలన్నీ పాకిస్తాన్ దౌత్యాధికారులను పిలిచి అధికారికంగా పాకిస్తాన్ వైఖరిని ఖండించాలని భారతదేశం కోరుతోంది.
పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడానికి దౌత్యపరంగా ప్రారంభమైన ఈ ప్రయత్నాలు ఫలిస్తే పాకిస్తాన్ ప్రపంచ దేశాల్లో ఒంటరి దేశంగా మారుతుంది. పాకిస్తాన్‌కు ఆయుధాలు, మిలిటరీ సామాగ్రి అమ్మరాదని కూడా భారతదేశం కోరుతోంది. స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రచురించిన 2018 నాటి నివేదిక ప్రకారం ప్రపంచంలో ఆయుధాలు దిగుమతి చేసుకునే రెండవ అతిపెద్ద దేశం పాకిస్తాన్. 2013 నుంచి 2017 మధ్య కాలంలో పాకిస్తాన్ దిగుమతి చేసుకున్న ఆయుధాలు, సైనిక సామగ్రిలో 70 శాతం చైనా నుంచి, 12 శాతం అమెరికా నుంచి, 5.7 శాతం రష్యా నుంచి దిగుమతి వచ్చినవే. అంతర్జాతీయ ఆర్ధిక టాస్క్ ఫోర్సు ద్వారా పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టు చేయించగలిగితే పెద్ద విజయం సాధించినట్లే అవుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ ఈ టాస్క్ ఫోర్స్ నిఘాలో ఉంది. అలాగే మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించడం ద్వారా ఈ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను కట్టడి చేయవచ్చు.
పుల్వామా దాడి తర్వాత వెంటనే ఇండియా నుంచి వెలువడిన ప్రతిస్పందనలోను మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి గుర్తించాలన్న మాట ఉంది. అలాగే పాకిస్తాన్ భూభాగం నుంచి పనిచేసే ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించాలని కూడా ఉంది. కాని ఈ జాబితాలో పేర్లు చేర్చాలంటే ఏకాభిప్రాయం అవసరం. చైనా భద్రతామండలిలో భారత ప్రయత్నాలను అడ్డుకుంటోంది. చైనా ఈ వైఖరిని మార్చుకునే సూచనలు కూడా కనబడడం లేదు. కాని 2018లో నరేంద్రమోడీ, గ్జి జింగ్ పింగ్ మధ్య వూహాన్‌లో జరిగిన సమావేశం తర్వాతి నుంచి భారత చైనా సంబంధాలు కాస్త మెరుగుపడ్డాయనే చెప్పాలి. అందువల్ల బహుశా ఇప్పుడు చైనా తన ధోరణిని కొంచెమైనా మార్చుకోవచ్చు.
పాకిస్తాన్‌పై అమెరికా ఎంత ఒత్తిడి తీసుకువస్తుందో తెలియదు. అఫ్గనిస్తాన్ నుంచి సాధ్యమైనంత త్వరగా వైదొలగాలని అమెరికా కోరుకుంటోంది. అక్కడి నుంచి అమెరికా సేనల ఉపసంహరణ విషయంలో పాకిస్తాన్ సహాయం అవసరమని అమెరికా భావిస్తోంది. అమెరికా ప్రత్యేక ప్రతినిధి పాకిస్తాన్ పర్యటనలు తరచు చేస్తున్నాడు. తాలిబాన్లతో చర్చల్లో త్వరితగతిన ఫలితాలు సాధించాలని చూస్తున్నాడు. ఏది ఏమైనా భారతదేశం పంపించిన విజ్ఞప్తుల ప్రభావం కనబడడానికి కొంత సమయం పట్టవచ్చు. పారిస్‌లో అంతర్జాతీయ మనీ లాండరింగ్ నిఘా సంస్థ సమావేశాలు త్వరలో జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో బహుశా పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బలు తగలవచ్చు.2017లో పాకిస్తాన్‌ను నిఘా జాబితాలో పెట్టడం జరిగింది.
అంతర్జాతీయ ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ 27 సూత్రాల కార్యాచరణను పాకిస్తాన్‌కు ఇచ్చింది. సెప్టెంబరులోగా పాకిస్తాన్ వీటన్నింటిని పూర్తి చేయవలసి ఉంది. గత సంవత్సరం పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో పెట్టడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్సు ఉపాధ్యక్షుడి పదవిలో చైనా ఉంది. ఇప్పుడు ఈ సంస్థ సమావేశాల్లో భారతదేశం పాకిస్తాన్ దుర్మార్గాలను బయటపెట్టి, దానినిను బ్లాక్ లిస్టులో చేర్చేలా ఒత్తిడి పెంచబోతోంది. ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్‌ను ఒంటరి చేసి, ఒత్తిడి పెంచి, పాకిస్తాన్‌కు గుణపాఠం నేర్పడానికి చేస్తున్న ఈ ప్రయత్నాల్లో చాలా దేశాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి.

* దేవీ రూప మిత్ర (ది వైర్)

India diplomatic war against Pakistan