Friday, April 26, 2024

సంపాదకీయం: నెమ్మది నెమ్మదిగా…

- Advertisement -
- Advertisement -

India economy collapsed with Lockdown ఇంతకుముందెన్నడూ ఎరుగని ఇంత సుదీర్ఘ ఆరోగ్య సంక్షోభంలో, మూడు మాసాలకు పైగా సాగిన కఠోర లాక్‌డౌన్ అనంతరం దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, సాధారణ జనం స్థితిగతులేమిటి అనే ప్రశ్నలు సహజంగానే వేధిస్తాయి. అయితే అందరూ ఇళ్లకే పరిమితమైపోయిన కాలంలో ఏ సమాచారం తెలుసుకొనే అవకాశం లేకపోడంతో వీటికి సరైన సమాధానాలు ఆశించలేము, రాబట్టలేము. ప్రభుత్వమే గత ఏప్రిల్, మే నెలల వినియోగదారుల ధరల గణాంకాలను విడుదల చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో గూగుల్ సిద్ధం చేసిన అంకెలు ఆర్థిక వ్యవస్థ పూర్వపు స్థితి వైపు అడుగులు వేస్తున్నదని వెల్లడించడం సంతోషదాయకం.

అదే సమయంలో అది పూర్తిగా కోలుకొని కరోనా ముందరి స్థితికి చేరుకోడానికి చాలా కాలం పడుతుందని ఈ గణాంకాలు స్పష్టం చేశాయి. ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి బయటకు రావడం, పూర్వం మాదిరిగా వెంటనే పరుగులు తీయడం సాధ్యమయ్యే పని కాదు. ప్రధాని మోడీ అయితే ‘కరోనా కాలంలో బోలెడన్ని సమూల ఆర్థిక సంస్కరణలు తెచ్చాము, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఏ దేశంలోనూ లేనంత సౌకర్యవంతమైన వాతావరణం కల్పిస్తున్నాం, ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకొని ఉరకలు వేస్తుందంటూ పదేపదే ఆశావహ ప్రకటనలు చేస్తున్నారు.

చైనాను వీడుతున్న విదేశీ పెట్టుబడులు ఇండియాకు భారీగా తరలివస్తాయనే అంచనాలు వెలువడ్డాయి. అయితే కరోనా నేపథ్యంలో చైనా నుంచి కదిలిపోతున్న బహుళ జాతి సంస్థలు భారత్‌కు గణనీయంగా వచ్చే అవకాశాలు తక్కువని భారతీయ సంతతి ఆర్థిక నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో బిజెపి పాలనలోని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు పారిశ్రామిక లైసెన్సుల, తనిఖీల విధానాలు, కార్మిక చట్టాలలో భారీ మార్పులు తెచ్చాయి. కంపెనీలు ఒకసారి నమోదు చేసుకుంటే చాలునని, యాజమాన్యాలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేదని, లేబర్ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు తరచుగా ఉండవని హామీ ఇస్తూ ఆ మేరకు సవరణలు చేశాయి. పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంచేశాయి. విదేశీ పెట్టుబడులు రూ. పాతిక లక్షల కోట్ల మేరకు రాగలవని ప్రభుత్వం చెప్పుకున్నది. అయితే చైనాను వీడుతున్న కంపెనీలు తైవాన్, ఇండోనేషియా వంటి దేశాల వైపు మొగ్గుతున్నాయని తెలుస్తున్నది. అందుచేత ‘మేకిన్ ఇండియా’ పుంజుకోడం, చైనా స్థానంలో ప్రపంచ ఉత్పత్తి కర్మాగారంగా భారత్ అవతరించడం అనుకున్నంత సుళువు కాదని స్పష్టపడుతున్నది.

కేంద్రం ప్రకటించిన మే నెల పారిశ్రామిక ఉత్పత్తి సమాచారం అది నెమ్మది నెమ్మదిగానే పుంజుకుంటున్నట్టు వెల్లడించింది. కరోనాకు ముందున్న స్థితితో పోల్చవద్దని ప్రభుత్వమే హెచ్చరించింది. లాక్‌డౌన్ విధించిన తర్వాత విద్యుత్తు డిమాండ్ దారుణంగా పడిపోయింది. అది కూడా ఇప్పుడు నత్త నడకగానే పెరుగుతున్నది. విద్యుత్ డిమాండ్, వినియోగాలను బట్టి పారిశ్రామిక ఉత్పత్తిని అంచనా వేయవచ్చు. 12 కోట్ల 20 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయని లాక్‌డౌన్ విధించిన వెంటనే సిఎంఐఇ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) అంచనా వేసింది. నిరుద్యోగం రేటు ఉన్నపళంగా 28 శాతానికి చేరుకున్నదని తెలియజేసింది. అది ఈ నెల 5వ తేదీతో అంతమైన వారంలో 8.9 శాతం వద్ద ఉంది. కరోనా సంక్షోభానికి ముందే మన తయారీ పరిశ్రమ ఘోరంగా దెబ్బ తిన్నది. పరిశ్రమలు పుంజుకోడానికి కీలక అవసరం జనం ఒక చోటి నుంచి మరొక చోటికి స్వేచ్ఛగా చేరుకోగలగడం. చాలా ప్రాంతాలు కంటైన్‌మెంట్లలో కొనసాగుతున్నాయి.

రాష్ట్రాల సరిహద్దులు దాటి వెళ్లడం ఇప్పటికీ కష్టతరంగానే ఉంది. జన సంచారం పూర్తి స్థాయిలో పునరుద్ధరణ కాలేదు. లాక్‌డౌన్ కాలంలో నానాకష్టాలు పడి స్వస్థలాలకు చేరుకున్న అసంఖ్యాక వలస కార్మికులు తిరిగి పని స్థలాలకు వెళ్లవలసి ఉంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వాణిజ్య సంస్థలకు కేంద్రం ప్రకటించిన భారీ రుణ ప్యాకేజీ వారికి సవ్యంగా అందుతున్న జాడలు లేవు. ఏప్రిల్, మేనెలల్లో బ్యాంకులిచ్చిన రుణాల కంటే వాటి వద్ద జమ అవుతున్న డిపాజిట్లే ఎక్కువన్న సమాచారం గమనించదగినది. ప్రతి వంద రూపాయల డిపాజిట్లకు బ్యాంకులిచ్చిన రుణాలు 74 రూపాయలే. రుణ గ్రహీతలు తగ్గిపోడం, కరోనా నేపథ్యంలో విరివిగా రుణాలివ్వడానికి బ్యాంకులకు చేతులు రాకపోడం ఇందుకు కారణాలై ఉండాలి. ఈ పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం విదేశీ పెట్టుబడుల కోసం ఎర్ర తివాచీలు పరచి ఎదురు చూడడం కంటే మౌలిక సదుపాయాల కల్పన కింద ప్రభుత్వ వ్యయాన్ని గణనీయంగా పెంచి, ప్రజలకు పనులు కల్పించి తద్వారా వారి కొనుగోలు శక్తిని మెరుగుపరచడం పై దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News