Friday, April 19, 2024

పుంజుకోని ఆర్థికం

- Advertisement -
- Advertisement -

India Economy has not fully recovered

 

లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత గత కొన్ని మాసాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోలేదని ఉపాధులు, ఉద్యోగాలు భారీగా కల్పించడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచితేగాని అది సాధ్యం కాదని తేలిపోయింది. 2020- 21 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు (ఏప్రిల్ జూన్) మాసాల కాలంలో 23.9 శాతం వ్యతిరేక (మైనస్) వృద్ధి నమోదైన తర్వాత రెండవ త్రైమాసికం (జులై సెప్టెంబర్) లో ఆ పతన తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ 7.5 శాతం మైనస్ వృద్ధితో ఇంకా ప్రతికూల దిశలోనే జిడిపి (స్థూల దేశీయ ఉత్పత్తి) కొనసాగుతుండడం ఆందోళనకరం. వృద్ధి రేటు పతనం ఇంతగా తగ్గడం హర్షణీయమేగాని తిరిగి కరోనా క్రితం నాటి స్థితికి పుంజుకోకపోడం అసంతృప్తిని కలిగిస్తున్న అంశం. వ్యతిరేక వృద్ధి ఈ స్థాయిలో తగ్గడానికి తయారీ, గృహ నిర్మాణ రంగాలు తిరిగి చాలా వరకు పుంజుకోడమే కారణమని రుజువవుతున్నది. మొదటి త్రైమాసికంలో 50.3 శాతంగా రికార్డయిన నిర్మాణ రంగం క్షీణత రెండో మూడు మాసాల కాలంలో 8.6 శాతానికి తగ్గింది. తయారీ రంగం మొదటి విడతలో నమోదైన 39.3 శాతం దిగజారుడు నుంచి బయటపడి రెండో త్రైమాసికంలో 0.6 శాతం వృద్ధిని సాధించింది.

గనుల తవ్వకం రంగం ప్రతికూల వృద్ధి 23.3 శాతం నుంచి 9.1 శాతానికి తగ్గింది. వ్యవసాయ రంగం అభివృద్ధిలో కొనసాగి రెండో త్రైమాసికంలోనూ 3.4 శాతం పురోగతిని నమోదు చేసుకున్నది. అయితే ప్రధాన పరిశ్రమల ఉత్పత్తి మాత్రం పుంజుకోకపోగా ఇంకా తరుగులోనే కొనసాగడం దేశ ఆర్థిక వ్యవస్థ గమనం పట్ల నిరాశకు కారణమవుతున్నది. ఇది అక్టోబర్ మాసంలో 2.5 శాతం పతనాన్ని చవిచూసింది. ఇంతేగాక రెండో త్రైమాసికంలో దేశంలో వస్తు వినియోగం భారీ స్థాయిలో 13 శాతం పడిపోడం శోచనీయం. దీనితో మూడో త్రైమాసికంలో వృద్ధి సానుకూల దిశకు మళ్లుతుందన్న ఆశలు కనుమరుగవుతున్నాయి. వినియోగం ఇంతగా పతనం అవడానికి ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా దెబ్బ తినడమే కారణం. దేశాల ఆర్థిక బాగోగులు అక్కడి ప్రజల వినియోగ స్థాయి మీదే ఆధారపడి ఉంటాయి. వారి చేతుల్లో డబ్బు బాగా ఆడేలా చూస్తే అది మార్కెట్‌లోకి వచ్చి వినియోగాన్ని పెంచుతుంది. వ్యాపార పారిశ్రామిక తదితర రంగాల నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది.

ప్రభుత్వం తన మీద ఉన్న రుణ, అభివృద్ధి మున్నగు వ్యయ భారాలను సునాయాసంగా తట్టుకోగలుగుతుంది. ఇందుకోసం వివిధ జనహిత ప్రాజెక్టులపై ప్రభుత్వం పెట్టే ఖర్చు బాగా పెరగవలసి ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ. 35 లక్షల 84 వేల కోట్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం అదే కాలంలో అది రూ. 33 లక్షల 14 వేల కోట్లుగా ఉంది. పర్యవసానంగా గత ఏడాది అదే కాలంలో జిడిపిలో 4.4 శాతం వృద్ధి కనిపించగా ఈ ఏడాది 7.5 శాతం లోటు నమోదయింది. లాక్‌డౌన్‌కు స్వస్తి చెప్పిన తర్వాత ఒకటొకటిగా చాలా రంగాలు తిరిగి తెరుచుకున్నా ఆర్థిక వ్యవస్థ ఆశించినంతగా పుంజుకోలేదు. కరోనాకు ముందున్న ఊర్ధ గతిని అందుకోలేదు. రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీతో మొదలుకొని కేంద్రం ప్రకటించిన మూడు ఉద్దీపన పథకాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదని అందువల్లనే ప్రజల కొనుగోలు శక్తి, దేశ వినియోగ స్థాయి పెరగలేదని స్పష్టపడుతున్నది. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు సులభ రుణ సౌకర్యాలు, వడ్డీ రాయితీలు వంటి వాటికే పరిమితమయ్యాయిగాని ప్రజలకు నేరుగా డబ్బు అందించే చర్యలు అందులో లేవు.

ఆ పథకాల ద్వారా ఉద్దేశించిన రుణ సౌలభ్యాలు కూడా సవ్యంగా ఆయా వర్గాలకు చేరలేదు. ఉచిత తిండి గింజల సరఫరా వంటి చర్యలు ఇటువంటి ఆర్థిక మహా సంక్షోభంలో బొత్తిగా ఉపకరించవు. 2019-20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కేంద్రం ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి వ్యయం అది పెట్టదలచుకున్న ఖర్చులో 60శాతం కాగా ఈ ఏడాది అదే కాలంలో పెట్టింది 47.9 శాతమే అని ఆర్థిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. బడ్జెట్ లోటును పెరగనీయకుండా చూసుకోడానికి ప్రజోపయోగ ప్రాజెక్టుల మీద ఖర్చును తగ్గించుకోడం ప్రభుత్వాలు అనుసరించే పొదుపు చర్య. అయితే కనీవినీ ఎరుగని కరోనా సంక్షోభంలో ప్రజలు ఉద్యోగాలు, ఉపాధులు కోల్పోయి నానాకష్టాలు పడుతున్నప్పుడు కూడా చిల్లి గవ్వ అయినా విదిలించకుండా పాలకులు పొదుపు మంత్రం పాటించడం ఆకలితో నకనకలాడుతున్న బిడ్డలకు పాలివ్వకుండా ఎండగట్టడం వంటిదే. అందుచేత ఇప్పటికైనా కేంద్ర ఆర్థిక వ్యూహకర్తలు ప్రభుత్వ వ్యయాన్ని గణనీయంగా పెంచి ప్రజలకు చేతి నిండా పని కల్పించి దేశ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాల మాంద్యంలో చిక్కుకోకుండా చూడవలసి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News