Friday, March 29, 2024

సంపాదకీయం: భారీ ప్యాకేజీ బండారం!

- Advertisement -
- Advertisement -

India economy increased after lockdown

 

దేశాన్ని కరోనా మరింతగా భయపెడుతున్నది. రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్నది. మరొక వైపు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తెరుచుకుంటున్నది. కరోనాకు పూర్వమున్న స్థితికి చేరుకోడానికి ఆరాటపడుతున్నది. అయితే అందుకు చాలా కాలం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలోగాని వృద్ధి రేటు పుంజుకునే అవకాశాల్లేవు. లాక్‌డౌన్ కాలంలో అనేక బాధలు అనుభవించి అతి కష్టం మీద సొంత ఊళ్లకు చేరుకున్న వలస కార్మికులు తిరిగి పని స్థలాలకు పూర్తి స్థాయిలో రావలసి ఉంది. అందుకు తగిన వాతావరణం కల్పించాలి. లాక్‌డౌన్ వల్ల నష్టపోయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తొందరలో కోలుకునేలా చేయడానికి, తిన తిండిలేని దుస్థితికి చేరుకున్న పేదలను ఆదుకోడానికని చెప్పి కేంద్ర ప్రభుత్వం గత నెల ప్రథమార్థం ముగుస్తున్న సమయంలో ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎంత వరకు ఆ లక్ష సాధనలో సఫలమైందో ఖచ్చితంగా తెలియదు.

తరచి చూస్తే దాని వల్ల ఆచరణలో కలిగిన మేలు బహు స్వల్పమేనని బోధపడుతున్నది. తెరుచుకొన్న వ్యాపారాలు, పరిశ్రమలు, కొనేవారు లేక ఇంకా డీలాపడే ఉన్నాయి. కోట్లాది మంది ఉద్యోగాలు, ఉపాధులు కోల్పోయిన చేదు వాస్తవమే ఇందుకు చాలా వరకు కారణం. సంపన్నులు కొనుగోలు చేసే బంగారం దుకాణాల వంటి వాటికి నగరాల్లో కొంత గిరాకీ కనిపిస్తున్నప్పటికీ అన్ని విక్రయ శాలల పరిస్థితి అది కాదని వెల్లడవుతున్నది. కేంద్రం ప్రకటించిన భారీ ప్యాకేజీ కిమ్మత్తు స్థూల దేశీయోత్పత్తిలో 10 శాతం. అంటే సంపన్న దేశాలతో పోటీ పడిన ప్యాకేజీ అది. 20 లక్షల కోట్ల రూపాయలంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కరోనా సంక్షోభం బొత్తిగా లేకపోతే కేంద్రానికి రాగల మొత్తం పన్ను ఆదాయంతో సమానమని పరిశీలకులు అంచనా వేశారు. నిజంగా అందులో కొంత భాగమైనా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, వ్యాపారాలకు అందితే వాటి పంట పండిపోతుంది. ఉద్యోగాలు కల్పిస్తాయనే ఉద్దేశంతో వీటికి ఈ ప్యాకేజీని ప్రకటించారు.

అయితే అదంతా అప్పే కాబట్టి ఇప్పటికే రుణాల ఊబిలో కూరుకుపోయిన ఈ పరిశ్రమలు, వ్యాపారాలు దానిని తీసుకొని ఉద్యోగులను పోషించడానికి తొందరగా సిద్ధపడవు. ప్యాకేజీలో విధించిన షరతులను సంతృప్తి పరచి రుణాలు తీసుకోడానికి అవి ముందుకు రాకపోవచ్చు. ఈ భారీ ప్యాకేజీలో 50 లేదా 60 వేల కోట్ల రూపాయలకు మించి ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం విదిలించకపోవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. మిగతా దేశాల ప్యాకేజీలలో అన్నార్తులైన పేదలకు ఆహార భద్రత కల్పించడానికి ప్రాధాన్యం ఇచ్చాయి. అమెరికా వంటి సంపన్న దేశాలలో సామాజిక భద్రత పథకాలు అమలులో ఉన్నాయి. వాటి ద్వారా ఆయా ప్యాకేజీలలో కొంత సొమ్ము అక్కడి పేదలకు అందే అవకాశముంది. మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ప్యాకేజీలో అది నేరుగా ఖర్చు చేసే విత్తం 2 లక్షల కోట్ల రూపాయలకు మించదని, ఆ సొమ్ము దేశ జిడిపిలో 1 శాతమేనని ఆర్థిక వేత్తలు నిగ్గు తేల్చారు. చిన్న పరిశ్రమలకు ఇవ్వదలచిన రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పించాలని ప్యాకేజీ ఉద్దేశించింది. పెద్ద వారిని చూస్తే మోయాలనిపించి, కింది వారిని చూస్తే మొత్తాలనిపించే బ్యాంకుల వైఖరి వల్ల ఈ రుణాలు ఉద్దేశించిన వారికి చేరడం కష్టమేనని చెప్పవచ్చు.

ఈ ప్యాకేజీతో దేశ వ్యాప్తంగా 45 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, వ్యాపారాలకు లబ్ధి కలుగుతుందని ఆర్థిక మంత్రి ఘనంగా ప్రకటించారు. అసలే కుంభకోణాలతో దోపిడీకి గురైన బ్యాంకింగ్ రంగం చేతులు ఈ రుణాలిచ్చే విషయంలో తీవ్రంగా వణుకుతాయన్న సంగతి తెలిసిందే. అందుచేత చిన్న పరిశ్రమలకు రుణ వితరణ ద్వారా అందజేయాలనుకున్న 3 లక్షల కోట్ల రూపాయాలలో చాలా వరకు మిగిలిపోయే అవకాశాలే ఎక్కువ. కేంద్ర ప్యాకేజీలో వలస కార్మికులకు, పేదలకు నేరుగా అందజేయడానికి ఉద్దేశించింది బహు స్వల్పం. అది కూడా మూడు మాసాల పాటు ఐదేసి కిలోల బియ్యం, ఆ కాలంలో నెలకు 500 రూపాయలను జన్‌ధన్ ఖాతాలలో వేయడం వరకే పరిమితం.

ఈ సొమ్మును కూడా పేదలకు అందజేయకుండా నానా సాకులతో తప్పించుకుంటున్న బ్యాంకు మేనేజర్ల ఉదంతాలు వార్తలకెక్కాయి. కేంద్రప్రభుత్వం ప్రజలకు నేరుగా ఒక్కొక్క కుటుంబానికి కనీసం ఐదారు వేల రూపాయలను జన్‌ధన్ ఖాతాలలో వేసి ఉంటే కొంతైనా వారికి ఉపశమనం కలిగి ఉండేది. చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు తిరిగి షట్టర్లు తెరిచినప్పటికీ వాటి వద్ద కొనుగోలుచేసే స్తోమత ప్రజలకు లేదు. అందుచేత వారి కొనుగోలు శక్తిని బాగా పెంచితేగాని పరిశ్రమలు, వ్యాపారాలు కోలుకొని ఉద్యోగాలు కల్పించే వాతావరణం ఏర్పడదు. ఇందుకు ప్రభుత్వ వ్యయాన్ని పెంచి తీరాలి. ఇప్పటికే 8 శాతంగా ఉన్న ద్రవ్యలోటును మరింతగా పెరగనీయరాదనే ఉద్దేశంతో ఉన్న కేంద్రం ఇచ్చినట్టే కనిపిస్తూ ఇవ్వకుండా చేతులు ముడుచుకొని ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News