Home తాజా వార్తలు భారత్ ఆర్థిక వ్యవస్థ మెరుగవుతోంది

భారత్ ఆర్థిక వ్యవస్థ మెరుగవుతోంది

India GDP growth rate 9.3% for 2021-22

 

ఈ ఏడాది 9.3 శాతానికి జిడిపి
2022-23 ఆర్థిక సంవత్సరంలో 7.9%: మూడీస్

న్యూఢిల్లీ : భారతదేశం ఆర్థిక వృద్ధి మెరుగవుతోందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తాజా నివేదికలో పేర్కొంది. ఇండియా జిడిపి రేటును 2021-22 ఆర్థిక సంవత్సరానికి 9.3 శాతం, 2022-23కి 7.9 శాతంగా రేటింగ్ సంస్థ అంచనా వేసింది. మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల ఉక్కు, సిమెంట్ డిమాండ్‌కు దోహదం చేస్తుందని మూడీస్ పేర్కొంది. మరోవైపు వినియోగం పెరగడం, దేశీయ తయారీకి భారత్ ముందుకు రావడం తదితర అంశాలు కొత్త పెట్టుబడులకు మద్దతునిస్తాయని ఏజెన్సీ పేర్కొంది. వ్యాక్సీన్ ప్రక్రియ పెరగడంతో పాటు వినియోగదారుల విశ్వాసంలో స్థిరత్వం, తక్కువ వడ్డీ రేట్లు వంటి సానుకూల అంశాలు ఉన్నాయని సంస్థ తెలిపింది.

కాగా 2021-22 సెప్టెంబర్ త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన జిడిపి (స్థూల జాతీయోత్పత్తి) వృద్ధి రేటు 7.8 శాతంగా ఉండనుందని ఇంతకుముందు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నివేదిక అంచనా వేసింది. ఈ నివేదిక ప్రకారం, 2021-22 సంవత్సరంలో వాస్తవ జిడిపి 9.4 శాతం, 2022-23 సంవత్సరంలో ఇది 7.5 శాతానికి తగ్గుతుందని అంచనా బ్యాంక్ అంచనా వేసింది. 2020-21 సంవత్సరంలో కరోనా మహమ్మారి కారణంగా భారత్ జిడిపి 7.3 శాతానికి క్షీణించింది. 2021-22 సంవత్సరానికి ఆర్‌బిఐ 9.5 శాతం వృద్ధిని అంచనా వేసింది. ఇక 2022-23 సంవత్సరంలో ఇది 7.8 శాతానికి తగ్గుతుందని పేర్కొంది.

రిలయన్స్ జోరు.. మార్కెట్లు అప్
దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతం శుక్రవారం మెరుగైన లాభాలను నమోదు చేశాయి. హెవీవెయిట్ స్టాక్ రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ లాభాలు మార్కెట్‌ను ముందుకు నడిపించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 454 పాయింట్లు పెరిగి 58,795 పాయింట్లు వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 17,536 పాయింట్ల వద్ద స్థిరపడింది. రిలయన్స్ షేరు 6 శాతం లాభంతో టాప్ గెయినర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఐటిసి, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టైటాన్, భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్ స్టాక్స్ మంచి లాభాలను నమోదు చేశాయి. మరోవైపు మారుతీ సుజుకీ, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌యుఎల్, ఎల్ అండ్ టి నష్టాలతో ముగిశాయి. మూడీస్ సానుకూల రేటింగ్ ఇవ్వడంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. మార్కెట్లు ఉదయం తీవ్ర ఒడిదుడులతో ప్రారంభమై, ఆ తర్వాత లాభాలతో ముందుకు సాగాయి. ఇక వెనక్కి చూసుకోలేదు. చివరికి 0.80 శాతం లాభంతో ముగిశాయి.

India GDP growth rate 9.3% for 2021-22