Thursday, March 28, 2024

జిడిపియే ప్రగతి ప్రతిబింబమా!

- Advertisement -
- Advertisement -

GDP

భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి జిడిపి పాతాళానికి పడిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.3గా నమోదైంది. ఇటీవల జాతీయ గణాంకాల కార్యాలయం ఈ డేటాను విడుదల చేసింది. ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన సరకులు, సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) అంటారు. అయితే జిడిపి పడిపోవడానికి కారణమేమిటి.. కారకులెవరు? బాధితులెవరు.. బాధ్యతలేమిటి అనే చర్చ ఒకవైపు ఉండగా.. జిడిపినే దేశ ప్రగతికి కొలమానమా! సామాన్య ప్రజల జీవితాల్లో వస్తున్న మార్పులను ఇది ప్రతిబింబిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాల్సిన అవసరముంది.

‘మైనస్’ ఐదు సార్లు మాత్రమే..

భారతదేశ చరిత్రలో కేవలం ఐదు సార్లు మాత్రమే జిడిపి మైనస్ గా నమోదైంది. 1958లో మైనస్ 1.2 శాతం, 1966లో మైనస్ 3.66 శాతం, 1973లో మైనస్ 0.32 శాతం, 1980లో మైనస్ 5.2 శాతం నమోదైంది. ఈ సారి ఇది ఎన్నడూ లేనంతగా మైనస్ 7.3 శాతంగా నమోదైంది. అయితే మైనస్‌గా నమోదవడానికి అనేక కారణాలు ఉన్నాయి. 1965-66లో ఇండియా, – పాకిస్తాన్ యుద్ధం జరగడం వల్ల భారతదేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. 1979-80లో జీడీపీ మైనస్‌గా నమోదు కావడానికి దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులు కారణమయ్యాయి. అంతేకాకుండా ఇరాన్‌లో రివల్యూషన్ రావడంతో పెట్రో ఉత్పత్తులు తగ్గడం, వాటి ప్రభావం భారతదేశంపై కూడా పడింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.3కి జిడిపి పడిపోవడానికి కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌తో పాటు ప్రభుత్వ వైఫల్యాలు కూడా కారణమయ్యాయని చెప్పవచ్చు.
నాలుగు సంవత్సరాల కింది నుంచే జిడిపి పతనం కావడం మొదలైంది. 2016-17లో జిడిపి వృద్ధిరేటు 8.3 శాతంగా ఉంటే, 2017-18లో అది 7 శాతానికి తగ్గిపోయింది. 2018-19లో అది మరింతగా దిగజారి 6.1 శాతానికి పడిపోయింది. ఇక 2019-20లో ఏకంగా 4.2 శాతానికి పతనమైంది. అయితే సానుకూల విషయమేమిటంటే గత త్రైమాసానికి సంబంధించి 1.6 వృద్ధి రేటు నమోదు కావడం. అంతేకాకుండా 2020-21 ఆర్థిక సంవత్సరానికి జిడిపి మైనస్ 7.5గా నమోదవుతుందని ఆర్‌బిఐ అంచనా వేయగా, ఇది మైనస్ 7.3గా నమోదు కావడం శుభపరిణామమే. కరోనా థర్డ్ వేవ్ లాంటి సమస్యలు రాకుంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో జిడిపి 7 నుంచి 9.5గా నమోదు అయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం రూ.145 లక్షల కోట్లుగా ఉన్న జిడిపి 2020-21లో రూ.135 లక్షల కోట్లకు పడిపోయింది. భారత జిడిపి మళ్లీ రూ.145 లక్షల కోట్ల స్థాయికి చేరాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో వృద్ధి రేటు 10 నుంచి 11 శాతం మేర నమోదు కావాల్సి ఉంటుంది.

166 దేశాల్లో మైనస్!

కరోనా మహమ్మారి విజృంభణ, లాక్‌డౌన్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 194 దేశాల్లో 166 దేశాల్లో జిడిపి మైనస్‌గా నమోదైంది. అయితే 28 దేశాల్లో జిడిపి వృద్ధిరేటు సానుకూలంగా ఉంది. వీటిలో చైనా, తైవాన్, బంగ్లాదేశ్, వియత్నాం లాంటి దేశాలు సైతం ఉన్నాయి. జిడిపి హెచ్చుతగ్గులకు నాలుగు అంశాలు ప్రధానంగా ప్రభావం చూపుతాయి. సామాన్య ప్రజల వ్యయ వినియోగం, కార్పొరేట్ల పెట్టుబడులు, ప్రభుత్వ వ్యయం, నికర ఎగుమతులు. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగాలు ఊడిపోయాయి. వ్యాపారాలు సాగలేదు. దీంతో ప్రజల దగ్గర డబ్బులు లేకుండాపోయాయి. గతేడాదితో పోల్చుకుంటే 97 శాతం దేశ జనాభా ఆదాయం గణనీయంగా పడిపోయిందని సిఎంఇఐ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) అనే సంస్థ ఓ సర్వేలో తేల్చింది. భారతదేశంలో 7.5 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడ్డారని అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ వివరించింది. దీంతో 90 శాతం ప్రజలు అత్యవసర ఖర్చులకు మాత్రమే పరిమితమయ్యారు.

జిడిపినే కొలమానమా..

దేశ ప్రగతికి జిడిపినే కొలమానమని, జిడిపి గణాంకాలు ఎంత ఎక్కువగా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ అంత బలంగా ఉన్నట్టు, అన్ని రంగాలు అంతగా ముందుకు వెళ్తున్నట్టు భావిస్తారు. అయితే దేశ ప్రగతికి జిడిపి ఒక్కటే పూర్తి కొలమానంగా భావించలేమని నిపుణులు చెబుతారు. జిడిపి ఇండికేటర్ అనేది సామాన్య ప్రజల జీవితాలను ప్రతిబింబించదు. ఉదాహరణకు మనం ఓ రోడ్డు పనులనే తీసుకుందాం.. పది కిలోమీటర్ల రోడ్డును ప్రభుత్వం వేయిస్తే.. దాంట్లో అవినీతి జరిగి, రోడ్డు నాణ్యత లేకపోవడం వల్ల కొన్నాళ్లకు అది పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో ప్రభుత్వం మళ్లీ అక్కడ రోడ్డు వేయిస్తుంది. ఇలా పదేళ్లలో మూడు నుంచి నాలుగు సార్లు జరుగుతుంది. ఒకే రోడ్డు పదేళ్ల పాటు మన్నికగా ఉండడంతో పోల్చుకుంటే మూడు నాలుగు సార్లు రోడ్డు వేయడం జిడిపి వృద్ధికి ఉపకరిస్తుంది. అయితే అలా చేయలేం కదా. ప్రపంచంలోని వివిధ దేశాలు జిడిపి వృద్ధిని చూపెట్టడానికి ప్రజలకు ఉపయోగంలోకి రాని, లాభంలేని అనేక పనులను చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. జిడిపి వృద్ధి చెందుతుందంటే దాని వల్ల సామాన్య ప్రజలకు అనేక రకాలుగా సౌలభ్యం ఏర్పడుతున్నాయని, వారు ఆనందంగా ఉంటున్నారని చెప్పలేం. ఉదాహరణకు ఒకరు చౌక ధరలో నేరుగా ఆన్‌లైన్ ద్వారా విమాన టికెట్టును కొన్నారనుకుందాం. దీంతో జిడిపికి అంతగా లాభముండదు.

అదే సమయంలో అదే వ్యక్తి ఒక ట్రావెల్ ఏజెంట్ ద్వారా టికెట్టును కొంటే, ఆ ట్రావెల్ ఏజెంట్ ఓ వైబ్‌సైట్‌లో రీసెర్చ్ చేస్తే.. అలా మధ్యవర్తులు పెరిగితే.. వ్యయం పెరుగుతుంది. తద్వారా ఇది జిడిపి వృద్ధికి ఉపకరిస్తుంది. అయితే అలా చేయడానికి ఎవరూ ఇష్టపడరు కదా. జిడిపి అనేది దేశ సగటు ప్రగతిని చూపిస్తుందే తప్ప సంపద పంపిణీ ఎలా జరుగుతుందో చెప్పదు. జిడిపిని లెక్కించాలంటే వినిమయ వ్యయం, ప్రభుత్వ వ్యయం, పెట్టుబడి వ్యయం, నికర ఎగుమతులను లెక్కలోకి తీసుకుంటారు. 94 శాతంగా ఉన్న అసంఘటిత రంగాన్ని జిడిపి గణాంకాలు లెక్కలోకి తీసుకోవు. దీంతో ఆ రంగం పరిస్థితి జిడిపి గణాంకాల్లో ప్రతిఫలించదు. అసంఘటిత రంగాన్ని పరిగణనలోకి తీసుకుంటే జిడిపి అనేది మరింత దారుణంగా ఉంటుంది. దేశ ప్రగతికి జిడిపి ని పూర్తి స్థాయిలో కొలమానంగా భావించకున్నా.. దీన్ని పూర్తి స్థాయిలో పట్టించుకోకుండా ఉండలేం. దేశ ఆర్థిక సగటును చూడాలంటే జిడిపి ఒక ముఖ్యమైన సూచిక అని మాత్రం చెప్పవచ్చు. ఆర్థిక వ్యవస్థకు సాయపడటానికి అవసరమైన విధానాలను రూపొందించటానికి విధానకర్తలు జిడిపి గణాంకాలను ఉపయోగించుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలను నిర్ణయించటానికి ఒక కొలమానంగా జిడిపి గణాంకాలు ఉపయోగపడతాయి. అయితే జిడిపి దాస్తున్న విషయాలను తెలుసుకోవాలంటే ఇతర సూచికలపై కూడా ఆధారపడాల్సిన అవసరముంది. ఆకలి, శాంతి, పర్యావరణ పనితీరు, వాయు కాలుష్యం, లింగ అసమానత, మానవ అభివృద్ధి తదితర సూచికలను పరిగణనలోకి తీసుకుంటేనే నిజమైన అభివృద్ధిని లెక్కించవచ్చు. అప్పుడే దేశ ప్రగతిని పూర్తిస్థాయిలో తెలుసుకునే అవకాశముంటుంది.

ప్రభుత్వ వ్యయం పెరగాల్సిన అవసరం..

జిడిపి వృద్ధిని పెంచాలంటే, సామాన్య, పేద ప్రజలకు సహాయ పడాలంటే ప్రభుత్వాలు తమ వ్యయాలను పెంచాల్సిన అవసరముంది. సెంట్రల్ విస్టా లాంటి ప్రాజెక్టులపై కాకుండా.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకు వచ్చేలా ప్రభుత్వ వ్యయం ప్రస్తుతం అవసరమని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రభుత్వానికి సూచించారు. కరోనా మహమ్మారి సమయంలో కేంద్రం తీసుకున్న చర్యల వల్ల సరఫరా వ్యవస్థ కాస్త మెరుగుపడిందని చెప్పవచ్చు. తయారీ రంగం కొంతైనా పుంజుకున్నట్టు పన్నుల వసూళ్లను బట్టి తెలుస్తోంది. కానీ ఆ తయారైన ఉత్పత్తులను కొనేవారు కరువయ్యారు. అమెరికాతో పాటు పలు దేశాలు చేసిన విధంగా తమ పౌరులకు నేరుగా నగదు బదిలీ చేసి ఆదుకుంటే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశముంటుంది. ప్రజల చేతుల్లోకి డబ్బు వస్తే ఖర్చు పెరిగి, జిడిపి వృద్ధి అయ్యే అవకాశాలున్నాయి. కరోనా టీకాలు కూడా సాధ్యమైనంత త్వరగా అందరికీ అందుబాటులోకొస్తే ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగి, అన్నీ రంగాలూ క్రమేపీ పుంజుకునే అవకాశాలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News