Saturday, April 20, 2024

సొంత యాప్‌లతో అదరగొట్టాలి!

- Advertisement -
- Advertisement -

India has banned 59 Chinese mobile applications

డ్రాగన్‌పై భారత్ సర్కారు డిజిటల్ స్ట్రైక్ ప్రారంభించింది. చైనాకు చెందిన అతి ముఖ్యమైన 59 మొబైల్ యాప్స్‌ను నిషేధించింది. ఈ జాబితాలో టిక్‌టాక్, షేర్-ఇట్, వీచాట్, వీ-మీట్, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్, ఇఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్, డియు బ్యాటరీ సేవర్, హెలో, లైకీ, ఎంఐ కమ్యూనిటీ, క్లబ్ ఫ్యాక్టరీ, యూ వీడియో వంటి ప్రజాదరణ కలిగిన యాప్స్ ఉన్నాయి. భారతదేశ సార్వభౌమాధికారం, జాతీయ భద్రత, రక్షణ శాఖ రహస్యాలు, దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఐటి చట్టం- 2000లోని సెక్షన్ 69ఎ ప్రకారం ఈ యాప్స్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఐటి శాఖ సోమవారం ఉత్తర్వులు విడుదల చేసి, చైనాతో డిజిటల్ యుద్ధానికి సిద్ధమైంది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 (ఐటి యాక్ట్, 2020)లోని సెక్షన్ 69 ఎ కింద ఈ 59 చైనీస్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ విభాగంలో కేంద్ర ప్రభుత్వం లేదా అధీకృత అధికారి దేశ సమగ్రత, సమగ్రత లేదా భద్రతకు ముప్పు ఉందని భావిస్తే, వాటిని నిషేధించవచ్చని ఒక నిబంధన ఉంది. ఈ నిషేధం గురించి సమాచార సాంకేతిక నిపుణుడు బాలేండు శర్మ దాదిచ్ మాట్లాడుతూ దేశ భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని, ఈ నిర్ణయాన్ని స్వాగతించాలన్నారు. ఈ యాప్‌ల వాడకాన్ని ఆపడానికి ప్రభుత్వం సర్వీసు ప్రొవైడర్లకు సూచనలు జారీ చేసే అవకాశం ఉంది.

చైనా యాప్‌లపై నిషేధం విధించడంతో భారతీయ యాప్ మార్కెట్ విస్తరించే అవకాశం ఉంది. టిక్‌టాక్ వంటి యాప్‌లకు పోటీగా ఇప్పటికే చింగారీ వంటి స్వదేశీ యాప్ నిలదొక్కుకుంటోంది. అలాగే న్యూస్ డాగ్, హెలో వంటి న్యూస్ అగ్రిగేటర్లకు దీటైన స్వదేశీ యాప్స్ నిలదొక్కుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. చైనా దుందుడుకు చర్యలకు తగిన సమాధానంగానే యాప్‌లపై నిషేధం విధించినట్లు అవగతమవుతోంది.

చైనా భారత్‌లోకి సరిహద్దుల్లోంచే కాదు.. డిజిటల్ మార్గంలోనూ చొరబడాలని చూస్తోంది. అందుకే చైనాకు డిజిటల్‌గా చెక్ పెట్టే పనిని భారత్ తాజాగా చేసింది. సరిహద్దుల్లో చైనా దూకుడుకు గట్టిగా బుద్ధి చెప్పాలంటే చైనా వస్తువులను నిషేధించాల్సిందేనని పలు వర్గాల నుంచి ఇటీవల కాలంలో డిమాండ్లు ఊపందుకున్నా యి. అయితే వస్తువులను నిషేధించడం కన్నా యాప్‌లను నిషేధిస్తేనే భారత ఆర్థిక వ్యవస్థకు మేలు అని కొంత మంది నిపుణులు చెబుతూ వస్తున్నారు. వస్తువులను నిషేధిస్తే మన ఎగుమతులపైనా ప్రభావం పడుతుంది. యాప్‌లను నిషేధిస్తే సమాచార తస్కరణ ఆగిపోవడంతో పాటు చైనా ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం ఉంటుంది.

భారత్‌లో ప్రధానంగా నాలుగు రకాల చైనా యాప్‌లు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నాయి. ఎకనమిక్ యాప్‌లు, వ్యానిటీ యాప్‌లు, న్యూసెన్స్ యాప్‌లు, చైనా గురించి ఊదరగొట్టే యాప్‌లు- ఈ నాలుగు రకాల్లో కనీసం మూడు రకాలను నిషేధించాలని కొంతమంది నిపుణులు కొన్నాళ్లుగా చెబుతున్నారు. బైదూ లాంటి యాప్‌లు.. చైనాకు డిజిటల్ సిల్క్ రూట్‌లాంటివి. భారత మార్కెట్‌లో వాటిపై ఎలాంటి ప్రభావం పడినా ఆ కంపెనీల విలువపై ప్రభావం పడుతుంది. టిక్‌టాక్ యాప్‌నే తీసుకుంటే దాదాపు 30శాతం వినియోగదారులు భారత్ నుంచే ఉన్నారు. పది శాతం ఆదాయం ఇక్కడి నుంచే వస్తోంది. ఈ ఆదాయమంతా టిక్‌టాక్ కోల్పోక తప్పదు. అది అంతిమంగా చైనా ఆర్థిక వ్యవస్థకు ఎంతోకొంత నష్టం కలిగిస్తుంది.భారత్ అనుసరించిన ఈ మార్గాన్ని మరికొన్ని దేశాలు కూడా అనుసరించే అవకాశం ఉంది. దీంతో చైనాకు మరింత నష్టం కలగక తప్పదు. ఈ యాప్‌లను యాక్సెస్ చేసే అవకాశాన్ని నిలిపేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశిస్తూ సూచనలు వెలువడతాయి. ఇంటర్నెట్ అవసరం లేని క్యామ్ స్కానర్‌లాంటి యాప్‌లు ఇప్పటికే డౌన్‌లోడ్ అయి ఉంటే పని చేసే అవకాశం ఉంది. అయితే కొత్తగా వాటిని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉండదు. ఇప్పటికే డౌన్‌లోడ్ అయి ఉన్నా.. ఇంటర్నెట్ అవసరమయ్యే టిక్‌టాక్, యూసీ న్యూస్ వంటి యాప్‌లు పని చేయవు.

డిజిటల్ యుద్ధం ప్రకటించే పరిస్థితి భారత దేశానికి లేదు. ఈ యాప్‌లకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లో మన భాగం పరిమితం మాత్రమే కావచ్చు… కానీ ఈ చర్య చాలా అవసరం. మన ఆదాయంతోనే మన మీద చైనా వాడు యుద్ధం చేయకుండా ఆపటానికి ఉపయోగపడుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది కూడా టిక్‌టాక్‌ను భారతదేశంలో కొన్ని రోజులు నిషేధించారు, కాని కోర్టు ఆ నిషేధాన్ని ఉపసంహరించింది. ఈ సారి మాత్రం ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య చాలా కఠినమైనది. భారతదేశంలో చైనా కంపెనీల వ్యాపారంపై ఈ నిషేధం ద్వారా ప్రభుత్వం బలమైన సందేశం ఇచ్చిందని అంతా నమ్ముతున్నారు.

ప్రత్యామ్నాయాలు ఉన్నాయి

ప్రభుత్వం నిషేధించిన ఈ 59 యాప్‌లలో ముఖ్యంగా టిక్ టాక్, కామ్‌స్కానర్, షేరైట్, లైకీ, బిగో లైవ్ వంటివి భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. కేంద్ర ప్రభుత్వం సడెన్‌గా 59 చైనా యాప్స్‌ని నిషేధించినా దేశ ప్రజలెవ్వరూ వ్యతిరేకించట్లేదు. తమకు ఆ యాప్స్ లేకపోయినా పర్వాలేదంటున్నారు. ఐతే… చైనా యాప్స్ చేసే పనిని చేసేందుకు ఇంకా చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇన్నాళ్లూ వాటిని మనం పట్టించుకో లేదు. ఇప్పుడు బ్యాన్ విధించడంతో… కొత్త యాప్స్ వైపు దృష్టి సారిస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే… కేంద్ర ప్రభుత్వం నిషేధించిన యాప్స్‌ని మన మొబైళ్ల నుంచి అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వాటి బదులుగా… కొత్తవి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మరి నిషేధించిన యాప్స్ చేసే పనిని ఏ యాప్స్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రౌజింగ్ : ఇన్నాళ్లూ మీరు బ్రౌజింగ్ కోసం… యూసీ బ్రౌజర్ వాడుతున్నట్లైతే… ఇకపై అది ఉండదు కాబట్టి… దాని బదులు గూగుల్ క్రోమ్, మోజిల్లా ఫైర్ ఫాక్స్, ఒపేరా వంటివి వాడొచ్చు.
సెక్యూరిటీ : మొబైల్‌లో వైరస్ చేరకుండా… అవాస్తా, ఏవీజీ, నార్తన్ యాంటీ వైరస్ వంటి యాప్‌లు బాగా ఉపయోగపడు తున్నాయి. ఫైల్స్ షేరింగ్ : షేర్‌ఇట్ బదులుగా షేర్ ఫైల్స్, ఫైల్స్ బై వంటి యాప్స్ వాడొచ్చు.
ఫొటో ఎడిటింగ్ : అడోబ్ ఫొటోషాప్, గూగుల్ స్నాప్‌సీడ్, పిక్స్ ఆర్ట్, లైట్ రూమ్, బీ 612 వంటి వాటితో చక్కగా ఫొటోలు ఎడిటింగ్ చేసుకోవచ్చు.
స్కాన్ : ఫొటోలు, ఫైళ్లను స్కాన్ చేసేందుకు ఇప్పుడు డాక్ స్కానర్-పీడీఎఫ్ క్రియేటర్, డాక్యుమెంట్ స్కానర్-పీడీఎఫ్ క్రియేటర్, అడోబ్ స్కాన్, ఫొటో స్కాన్ బై గూగుల్, మైక్రోసాఫ్ట్ లెన్స్ వంటివి వాడొచ్చు.
వీడియో ఎడిటింగ్ : వీడియోలను ఎడిట్ చెయ్యడానికి చాలా ఆప్షన్లున్నాయి. అడోబ్ ప్రిమియర్ క్లిప్, మ్యాజిస్టో, కైన్ మాస్టర్ యాప్స్ బాగా ఉపయోగపడతాయి.వీడియో షేరింగ్ : టిక్‌టాక్ బదులుగా… రోపోసో, డబ్ స్మాష్, పెరిస్కోప్, యూట్యూబ్ లాంటి వాటిని వాడొచ్చు.
రెండు అకౌంట్లు : ఒకే ఫోన్‌లో రెండు వేర్వేరు అకౌంట్లతో యాప్‌లను వాడాలంటే క్లోన్ యాప్, సూపర్ క్లోన్ వంటివి యాప్స్ ఉపయోగపడుతున్నాయి.
మొబైల్ లాక్ : ఇందుకు చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. లాక్ యాప్ – స్మార్ట్ యాప్ లాకర్, లాక్ యాప్ – ఫింగర్‌ప్రింట్, కీప్ సేఫ్, నొర్టన్ యాప్ లాక్, లాక్ మై పిక్స్ సీక్రెట్ ఫొటో వాల్ట్ వంటివి వాడితే… చైనాకి చెక్ పెట్టినట్లే.
వీడియో కాన్ఫరెన్స్ : ప్రస్తుతం అందరూ వాడుతున్న జూమ్‌పై కేంద్రం నిషేధం విధించకపోయినా… దానికి ఆల్టర్నేట్‌గా గూగుల్ మీట్, స్కైప్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ డుయో, వాట్సాప్ కాల్, సే నమస్తే వంటి యాప్స్ వాడుకోవచ్చు.
టైపింగ్ : డీఫాల్ట్ టైపింగ్ కీబోర్డు నచ్చకపోతే… గూగుల్ ఇండిక్ కీబోర్డు , జీ బోర్డ్, గింగర్ కీబోర్డు, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ కీబోర్డు వంటివి ట్రై చెయ్యవచ్చు.
ఆఫీస్ వర్క్ : వర్డ్ ఎక్సెల్ షీట్ల వంటి వాటి కోసం మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఓన్లీ ఆఫీస్ వంటివి వాడొచ్చు.
పైన చెప్పిన యాప్స్ చాలా కాలం నుంచి ఉన్నా… ఎక్కువ మంది వాడకపోవడం వల్ల అవి ఫేమస్ కాలేదు. ఇప్పుడు చైనా యాప్స్‌పై నిషేధం అమల్లోకి వచ్చింది కాబట్టి… ఇక ఈ యాప్స్‌కి డిమాండ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మన దేశంలో అలాంటి యాప్‌లు తయారు చేయడానికి యువత సిద్ధంగా ఉంది. మన కోసం మన యాప్‌లే వాడుదాం అనే నినాదమే కావాలిప్పుడు.

మిగిలిన వస్తువులపై మన అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిషేధమా, సుంకాలను పెంచటమా ఆలోచించాలి. దీర్ఘకాలంలో ఇది మనకు ప్రయోజనకారి కావడం భారతీయ పారిశ్రామిక వేత్తల మీద ఆధారపడి ఉంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రపంచం ప్రమాణాలకు తగ్గని వస్తువుల, యాప్ ల తయారీ చేయగల్గాలి. అప్పుడు మన దేశంలో ఉపాధి పెరుగుతుంది. ఉత్పత్తులు పెరుగుతాయి. ఈ రకంగా మన వ్యవస్థ ఆర్థికంగా బలోపేతం అవ్వడం ఖాయం.

ఎం నరసింహ స్వామి- 9949839699

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News