Home తాజా వార్తలు ఆశల పల్లకిలో భారత క్రీడారంగం

ఆశల పల్లకిలో భారత క్రీడారంగం

sprrs

కొత్త దారి చూపిన కామన్వెల్త్ క్రీడలు

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరం వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అసాధారణ ఆటతో ఆకట్టుకుంది. పెద్దగా ఆశలు లేకుండానే బరిలోకి దిగిన భారత్ ఊహించని విధంగా పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచి పెను సంచలనమే సృష్టించింది. కిందటిసారి స్కాట్లాండ్‌లోని గ్లాస్గొ నగరంలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కేవలం 15 స్వర్ణాలు మాత్రమే సాధించి నిరాశ పరిచిన భారత్ ఈసారి పసిడి వర్షం కురిపించింది. పెద్దగా అంచనాలు లేకున్నా ఏకంగా 26 పసిడి పతకాలు గెలుచుకొని సత్తా చాటింది. రియో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచారు. ఒలింపిక్స్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగిన భారత్ కేవలం రెండు పతకాలతోనే సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా భారత్ సత్తా చాటుతుందా లేదా అనే దానిపై సందేహం నెలకొంది. కిందటి గేమ్స్‌లో భారత్‌పై భారీ ఆశలే పెట్టుకున్నా పేలవమైన ప్రదర్శనతో నిరాశే మిగిలింది. దీంతో ఈసారి ఆస్ట్రేలియాలో జరిగిన గేమ్స్‌పై ఎవరూ కూడా అంతగా ఆసక్తి కనబరచలేదు. ప్రభుత్వం కూడా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న క్రీడాకారులను అంతగా పట్టించుకోలేదు. దీంతో పోటీలకు క్రీడాకారులు కూడా అంత సన్నద్ధం అయినట్టు కనిపించలేదు. అంతేగాక షూటింగ్‌ను గేమ్స్ నుంచి తొలగించాలని తొలుత నిర్ణయించడంతో భారత్ పతక ఆశలు మరింత అడుగంటాయి. రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్ అంశాలను కూడా క్రీడల నుంచి తొలగించాలని క్రీడల నిర్వాహకులు నిర్ణయించారు. అయితే అన్ని దేశాల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో షూటింగ్‌తో సహా అన్ని క్రీడలకు గేమ్స్‌లో చోటు కల్పించారు. దీంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.
ఎదురులేని వెయిట్ లిఫ్టర్లు…
ఇక, వెయిట్ లిఫ్టర్లు కూడా స్వర్ణాల పంట పండించారు. తమపై దేశ ప్రజలు పెట్టుకున్న ఆశలను వీరు నిలబెట్టారు. తొలి రోజే మీరాబాయి చాను స్వర్ణం గెలిచి భారత పతకాల వేటకు శ్రీకారం చుట్టింది. సంజిత చాను, పూనమ్ యాదవ్, తెలుగుతేజం రాహుల్, తమిళస్టార్ సతీష్ శివలింగం స్వర్ణాలతో త్రివర్ణ పతకాన్ని రెపరెపలాండించారు. ఈ పతకాలతో భవిష్యత్తులో జరిగే క్రీడలపై కొత్త ఆశలు చిగురింప చేశారు. బాక్సింగ్‌లో కూడా భారత్ మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. ఊహించినట్టే దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ మహిళల 45 కిలోల విభాగంలో పసిడి పతకం గెలుచుకొని సత్తా చాటింది. పురుషుల బాక్సింగ్‌లో వికాస్ కృష్ణన్, గౌరవ్ సోలంకిలు పసిడి పతకాలతో ప్రకంపనలు సృష్టించారు. స్వర్ణాలతో పాటు రజతాలు, కాంస్య పతకాలతో తమకు ఎదురులేదని భారత బాక్సర్లు నిరూపించారు.
రెజ్లింగ్‌లోనూ జోరు…
భారత రెజ్లర్లు కూడా తమపై ఉంచిన అంచనాలను నిలబెడుతూ పతకాలు సాధించారు. దిగ్గజ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ ఈసారి కూడా స్వర్ణంతో మెరిశాడు. ఎన్నో అవమానాలు ఎదురైనా తట్టుకొని సుశీల్ పసిడి పతకాన్ని సొంతం చేసుకోవడం విశేషం. ఈ స్వర్ణంతో రానున్న ఒలింపిక్స్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యే మార్గాన్ని సుగమం చేసుకున్నాడు. యువ రెజ్లర్ రాహుల్ అవారె కూడా పసిడితో రాణించాడు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ అవారె పసిడి పతకాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. సుమిత్, భజరంగ్ పూనియాలు కూడా స్వర్ణాలు గెలిచి తమకు ఎదురులేదని చాటారు. మహిళల విభాగంలో స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్ స్వర్ణం దక్కించుకుంది.
టిటిలో సంచలనం..
టిటిలో ఎవరూ ఊహించని రీతిలో భారత్ ఏకంగా మూడు స్వర్ణాలు గెలుచుకొని సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. గతంలో రజతాలు, కాంస్యాలకు మాత్రమే పరిమితమైన భారత్ ఈసారి మూడు పసిడి పతకాలు సాధించి సత్తా చాటింది. మహిళల సింగిల్స్ టిటిలో మనిక బత్రా స్వర్ణం గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ టిటిలో భారత మహిళా క్రీడాకారిణి సింగిల్స్‌లో స్వర్ణం సాధించడం ఇదే ప్రథమం. పురుషుల టీమ్ విభాగంలో కూడా భారత్ పసిడి గెలుచుకొని కొత్త రికార్డు నెలకొల్పింది. అంతేగాక మహిళల టీమ్ విభాగంలో కూడా భారత్‌కు స్వర్ణం దక్కింది. కామన్వెల్త్ క్రీడల చరిత్రలోనే టిటిలో మూడు స్వర్ణాలు దక్కడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇక, అథ్లెటిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు. పురుషుల జావెలిన్‌త్రో విభాగంలో నీరజ్ పసిడి పతకం గెలిచి చరిత్ర సృష్టించాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన నీరజ్ ఏకంగా స్వర్ణం గెలిచి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
మెరిసిన షట్లర్లు…
బ్యాడ్మింటన్‌లో కూడా భారత్ రెండు స్వర్ణాలు గెలుచుకుంది. మహిళల సింగిల్స్‌లో తెలుగుతేజం సైనా నెహ్వాల్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కూడా భారత్ పసిడి పతకం సొంతం చేసుకుంది. ఇక, పివి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు రజతాలు సాధించారు. సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప, సాత్విక్ రెడ్డిలకు కూడా పతకాలు లభించాయి. ఇదిలావుండగా హాకీలో మాత్రం భారత్‌కు నిరాశే మిగిలింది. మహిళలు, పురుషుల జట్లు రెండు కూడా పతకాలు సాధించడంలో విఫలమయ్యాయి. అథ్లెటిక్స్‌లోనూ భారత్‌కు ఆశించిన విధంగా పతకాలు రాలేదు. కానీ, గతంతో పోల్చితే ఈసారి
భారత స్వర్ణాల సంఖ్య పెరగడం ఊరట కలిగించే అంశమే. కెనడా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాలను వెనక్కి నెడుతూ భారత్ పతకాల పట్టికలో మూడో స్థానం సాధించడం గొప్ప విషయమే. ఈ క్రీడల్లో భారత్ 26 స్వర్ణాలు, 20 రజతాలు, మరో 20 కాంస్యాలతో సహా మొత్తం 66 పతకాలు తన ఖాతాలో వేసుకుంది. దీంతో పతకాల పట్టికలో మూడో స్థానం దక్కించుకుంది.