Home జాతీయ వార్తలు బాలాకోట్‌పై వైమానిక దాడిలో 18మంది జైషే కమాండర్లు హతం!

బాలాకోట్‌పై వైమానిక దాడిలో 18మంది జైషే కమాండర్లు హతం!

Balakot Terror Camp

న్యూఢిల్లీ : పాక్‌లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ శిక్షణ శిబిరంపై భారత్ జరిపిన వైమానిక దాడులకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. దాడిలో హతమైన ఉగ్రవాదుల మృతదేహాలను శిబిరానికి సమీపంలో పాక్ ఆర్మీ ఖననం చేసినట్లు తెలుస్తోంది. అందుకు అక్కడి వాహనాల్లోని పెట్రోల్‌ను వాడినట్లు సమాచారం. భారత్ దాడుల్లో జైషేకు చెందిన 18మంది సీనియర్ కమాండర్లు మృత్యువాత పడినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. వీరంతా 200మందికిపైగా ఉగ్రవాదుకు శిక్షణ ఇచ్చేందుకు అక్కడికి వివిధ ప్రాంతాల నుంచి చేరుకున్నారని వెల్లడవుతోంది. అదే సమయంలో బాలాకోట్ శిబిరంలో గాయాలపాలైన ఉగ్రవాదులను వజీరిస్థాన్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి పాక్ ఆర్మీ చికిత్స అందించిందని తెలుస్తోంది. శిబిరంలోకి వైద్యులను రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారని స్థానికులు పలువురు చెబుతున్నారు. తాజాగా బాలాకోట్ దాడులకు సంబంధించిన ఆడియో ఒకటి బయటపడింది.

అందులో పాక్ ఆర్మీకి చెందిన ఇరువురు మాట్లాడుకుంటున్నట్లు అందులో ఉంది. చనిపోయిన వారి పేర్లను కూడా వారిద్దరు రహస్యంగా పంచుకున్నట్లు అందులో అర్థమవుంతోంది. మొత్తానికి భారత్ వైమానిక దాడుల్లో 263 మంది ఉగ్రవాదులు మరణించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. మృతుల్లో దాదాపు 18 నుంచి 20 మంది ఉగ్రవాదులకు సాయం అందించేందుకు వచ్చిన క్షురకులున్నారని సమాచారం. ఉగ్రవాదుల కదలికలను ఐదు రోజుల పాటు గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ద్వారా పసిగట్టిన తర్వాత ఫిబ్రవరి 26న తెల్లవారుజామున మెరుపు దాడులతో విరుచుకుపడినట్టు వైమానిక దళ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బాలాకోట్‌లో ఏం జరిగిందన్నదానిపై నిజానిజాలు వెలికితీసేందుకు అక్కడికి వెళ్లాలని మీడియా చేస్తున్న ప్రయత్నాలను పాక్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. అక్కడికి ఎవరికీ వెళ్లేందుకు అనుమతినివ్వడం లేదు.
నాలుగు భవనాల్లో తిష్ట…
బాలకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్ర శిబిరంలో నాలుగు భవనాల్లో సమావేశమైన టెర్రరిస్టుల సంఖ్యపై ఇంటెలిజెన్స్ వర్గాలు వివరాలు వెల్లడించాయి. దౌరా ఈ మౌలాత్ అనే భవనంలో 30 మంది టెర్రరిస్టులు సమావేశమయ్యారని, ఫిబ్రవరి 25న బాలకోట్‌లో ఉగ్రవాదులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైనట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. దౌరా ఈ ఖాస్ అనే భవనంలో ఫిబ్రవరి 26న 91 మంది ఉగ్రవాదుల సమావేశం భారత్‌లో ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు 25 మంది ఉగ్రవాదులకు ఈ శిబిరంలో శిక్షణ కోసం ఎంపిక చేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఇక ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఐదు రోజుల్లో ఫిబ్రవరి 19న తిరిగి బాలకోట్‌లోని ఉగ్ర స్థ్ధావరానికి టెర్రరిస్టులు చేరుకున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఇదే స్ధావరంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు 18 మంది సీనియర్ కమాండర్‌లను ఈ శిబిరానికి జైషే చీఫ్ పంపినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల పసిగట్టాయి. పక్కా సమాచారం ఆధారంగా భారత్ వైమానిక దళం విరుచుకుపడిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

India IAF Air Strikes On Balakot Terror Camp