Home ఎడిటోరియల్ సాక్షర భారత్ సాకారమెప్పుడు?

సాక్షర భారత్ సాకారమెప్పుడు?

Worldwide 75.8 crore illiterate people

యునెస్కో గణాంకా ల ప్రకారం 15 యేళ్ళు దాటిన వారి లో ప్రపంచ వ్యాప్తం గా ఇంకా 75.8 కోట్ల మంది నిరక్షరాస్యులున్నారు. వీరిలో 47.9 కోట్ల మంది మహిళలు. యునెస్కో – 2015 నివేదిక ప్రకారం ప్రపంచం మొత్తం మీద 12.40 కోట్ల బడియీడు పిల్లలు పాఠశాలలకు దూరంగా ఉన్నారు. ఇందులో భారత్ వాటా 1.77 కోట్లు కాగా, అది 14 శాతానికి సమానం. విద్యా ప్రమాణాల ప్రాతిపదికన పరిశీలిస్తే అంతర్జాతీయంగా తొలి పది దేశాల్లో ఫిన్‌లాండ్‌దే అగ్రస్థానం. అమెరికా, జర్మనీ, యుకె, స్వీడన్‌లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎంతో చిన్నదేశాలైన ఎస్తోనియా, హంగేరి, సెర్బియా, క్యూబా, ఆర్మీనియాలు సైతం దాదాపుగా నూరు శాతం అక్షరాస్యతను సాధించాయి. అమెరికా, బ్రిటన్, రష్యా, జపాన్, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు 99 శాతం అక్షరాస్యత సాధించగా; దక్షిణ కొరియా 97.9 శాతానికి దగ్గ్గర్లో ఉంది. ఆప్ఘనిస్థాన్ వంటి ఆసియా దేశాలు, ఇంకా కొన్ని ఆఫ్రికా దేశాలు అక్షరాస్యతా సాధనలో వెనుకబాటుకు గురవుతున్నాయి. అంగోలా, బురుండి, సెంట్రల్ ఆఫ్రికా, సూడాన్, సోమాలియా, గాంబియా దేశాలలో యువతుల అక్షరాస్యత కనిష్ఠంగా(65 శాతం) ఉంది.
15 – 24 వయస్సు వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే చైనా 99.7, శ్రీలంక 98.8, మయన్మార్ 96.3 తర్వాత భారత్ 90.2 శాతంతో నాల్గవ స్థానంలో నిలిచాయి. దీన్ని బట్టి ఈ 35 ఏళ్ళ కాలంలో చైనా, శ్రీలంక, మయన్మార్‌ల వంటి పొరుగు దేశాలతో పోల్చితే మనం సాధించిన ప్రగతి తక్కువే. పేదరికాన్ని పరిమార్చగలిగే పదునైన ఆయుధం చదువేనని యునెస్కో అధ్యయన నివేదిక ఇటీవల పేర్కొంది. యునెస్కో అంచనా ప్రకారం వయోజనులంతా కనీసం మాధ్యమిక స్థాయి వరకు చదువుకున్నా ప్రపంచంలోని 42 కోట్ల మందికి పేదరికం నుండి విముక్తి లభిస్తుంది.
గ్లోబల్ మానిటరింగ్ రిపోర్టు – 2012 ‘అందరికీ విద్య’ పేరిట విడుదల చేసిన 120 దేశాల సూచీలో భారత్ అట్టడుగున 102 వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో నిరక్ష్యరాస్యులున్న దేశం నేటికి ఇండియానే. ప్రపంచ సగటు అక్షరాస్యత 86.3 కాగా, భారత్ ఇంకా 74 శాతం దగ్గరే ఉండిపోయింది. భారతదేశం ప్రపంచ దేశాలలో అక్షరాస్యత విషయంలో 124 వ స్థానంలో ఉంది. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తెలంగాణ 35 వ స్థానంలో; ఆంధ్రప్రదేశ్ 32 వ స్థానంలో ఉన్నాయి. అక్షరాస్యతలో కేరళ 93.91శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా బీహార్ 63.82 శాతంతో చిట్టచివరి స్థానంలో ఉంది. మిజోరం(91.6), త్రిపుర(87.8), గోవా(87.4), హిమాచల్ ప్రదేశ్ (83.8) శాతంగా నమోదయ్యాయి. ఈ రాష్ట్రాలూ కేరళ మార్గంలోనే పయనిస్తున్నాయి.
సంపూర్ణ అక్షరాస్యతా సాధనలో దేశంలోనే దూసుకుపోతున్న కేరళ వెనుక దశాబ్దాల కృషి ఉంది. నాటి ట్రావెన్‌కోర్ సంస్థానాధీశులతో పాటు, స్వాతంత్య్రానంతరం కేరళలో అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్ట్టులూ విద్యపట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచారు. నేటికి కేరళ సర్కారు తన బడ్జెట్‌లో 40 శాతం విద్య మీద వెచ్చిస్తుండటం ప్రశంసావహం. మన దేశంలో జాతీయ అక్షరాస్యతా కార్యక్రమాన్ని 1988 నుండి అమలుచేస్తున్నారు. 2010 నాటికి దేశంలో 6- 14 మధ్య వయస్కులందరినీ విద్యావంతులను చేయాలన్న లక్ష్యంతో సర్వశిక్షాఅభియాన్ 2000 సంవత్సరంలో నెలకొల్పబడింది.
బ్రిటీష్ పరిపాలనా కాలంలో సుమారు 2.5 కోట్లమంది బాలబాలికలు విద్యాగంధం లేక అజ్ఞానంలో మగ్గుతున్నారని దాదాబాయ్ నౌరోజీ లెక్కకట్టారు. స్వాతంత్య్రం పొంది ఏడు దశాబ్దాలు గడుస్తున్నా కూడా నేటికి 8 కోట్ల మంది బాలలు బడిమెట్లెక్కడం లేదన్న వాస్తవం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గడిచిన దశాబ్దంలో దేశంలో 5-19 మధ్య వయస్సున్న బాలల్లో 6.54 కోట్ల మంది పాఠశాల ముఖమే చూడలేదని; 4.49 కోట్ల మంది మధ్యలోనే బడిమానేశారని 2011 జనాభా లెక్కలు వెల్లడిస్తున్నాయి. స్వాతంత్య్రం పొందిన 5 ఏళ్ళలోనే 90 శాతం అక్షరాస్యతకు చేరువైన దేశాలు ఎన్నో ఉన్నాయి. దేశంలో మొత్తంగా సుమారు 20 కోట్ల మంది చిన్నారులు చదువుకుంటున్నారు. అయితే బడిలో చేరుతున్న పిల్లల్లో 20 శాతానికిపైగా మధ్యలోనే మానేస్తున్నారు. దాదాపు 15 లక్షల 17 వేల పాఠశాలలు, 38,500 కాలేజీలు, 760 విశ్వవిద్యాలయాలు, మరో 12 వేలకు పైగా శిక్షణా సంస్థలు భారత విద్యావ్యవస్థ విస్తృతిని కళ్లకు కడుతున్నాయి. అయినా ఆరున్నర కోట్ల మంది పిల్లలు సాధారణ విద్యకు నోచుకోవడం లేదు.
2017 మే లో నూతన విద్యావిధానంపై ఏర్పాటైన సుబ్రమణియన్ కమిటీ పలు సిఫారసులు చేసింది. ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఏర్పాటు, జి.డి.పి.లో కనీసం 6 శాతాన్ని విద్యారంగానికి కేటాయించాలన్నది వీటిలో ప్రధానమైనది. ఈ ప్రతిపాదనలు కొత్తవేమీ కాదు. 1966లోనే డి.ఎస్.కొఠారీ కమీషన్ చెప్పినవే. 50 ఏళ్ళుగా ఈ డిమాండ్ ఉన్నా నేటికీ మనదేశ జి.డి.పి.లో 0.5 శాతానికి మించకపోవడం విచారకరం. పాకిస్తాన్ 2.5 శాతం మేర; నిరుపేద ఆఫ్రికా దేశమైన ఘనా కూడా ఏకంగా 8.1 శాతం ఖర్చు చేస్తుంది. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ వార్షిక బడ్జెట్ మన కరెన్సీలో సుమారు 40 వేల కోట్లు. మన కేంద్ర ప్రభుత్వం దాదాపు అందులో సగం మాత్రమే దేశం మొత్తానికి విద్యా పద్దుగా నిర్ణయించిందంటే మన దేశంలో విద్యారంగానికి ఉన్న ప్రాధాన్యత అర్ధమవుతుంది.
విద్యపై పెట్టే పెట్టుబడి ఎప్పటికీ సత్ఫలితాలనే ఇస్తుందని అమెరికా రాజ్యాంగ రూప శిల్పి బెంజిమన్ ఫ్రాంక్‌లిన్ అన్నాడు. స్ధూల దేశీయోత్పత్తిలో అధిక శాతాన్ని విద్యారంగంపై ఖర్చుపెడుతూ ఫిన్‌లాండ్ లాంటి చిన్న దేశాలు అక్షరాస్యతా విషయంలో ఎంతో ముందున్నాయి. స్విట్జర్‌లాండ్ 15.7, దక్షిణ కొరియా 16.5, బ్రెజిల్ 19.5, మెక్సికో 20.5, న్యూజిలాండ్ 21.5 శాతాన్ని తమ జి.డి.పి.లో ఖర్చుచేస్తున్నాయి. విద్యారంగంలో పురోగతి సాధిస్తున్న దేశాలన్నీ తమ బడ్జెట్‌లో 18-20 శాతం నిధులను విద్య కోసం వ్యయం చేస్తున్నాయి. మన విద్యావ్యవస్థను చక్కదిద్దాలంటే బడ్జెట్‌లో కనీసం 6 శాతం వాటా అయినా కేటాయింపులు జరగాలని ఎన్నో కమిషన్లు తేల్చిచెప్పాయి. కాని ఏనాడూ 1.5 శాతానికి మించి ఖర్చు చేసిన దాఖలాలు లేవు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం కేటాయిస్తున్న అత్తెసరు నిధులపై సుప్రీంకోర్టు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
విద్యకు పిల్లలు దూరమవుతున్నారంటే దాని దుష్పరిణామాలు అనేక రూపాల్లో కనిపిస్తాయి. బాలనేరస్థులుగా, అనాథలుగా, బాల కార్మికులుగా, వీధి బాలలుగా వారు మారుతుంటారు. ఆకలి, అవిద్య, అనారోగ్యం వంటి సవాళ్ళతో పాటు బాల్యవివాహాలు, అక్రమ రవాణా, లైంగిక వేధింపులు వంటి దుర్మార్గాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. యుక్తవయసు పిల్లల మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితులు క్షీణిస్తాయి. 2010 ఏప్రిల్ 1న అమలులోకి వచ్చిన ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఒనగూడాల్సి ఉంది. కాని చట్టంలోని ఆదర్శాలు వాస్తవికతకు దూరంగా ఉన్నాయన్నది నిష్ఠుర సత్యం. డిపెప్, లోక్‌జంబిక్, శిక్షాకర్మీ లాంటి పథకాలను కలగలిపి ప్రవేశపెట్టిన సర్వశిక్షాఅభియాన్ సైతం లక్ష్యానికి ఆమడదూరంలోనే ఉంది. పాఠ్యాంశాల కూర్పు, ప్రణాళికలలో దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్, హాంగ్‌కాంగ్ దేశాల అనుభవాలను తక్కిన దేశాలు ఆదర్శంగా గ్రహించాలి.
ప్రాథమిక స్థాయి నుండే విద్యావ్యవస్థను ఒక పిరమిడ్‌లాగా సుదృఢంగా నిర్మించుకోవడం వల్లే ఫిన్‌లాండ్, యురె, కెనడా, నెదర్లాండ్స్ వంటివి తమదైన శైలిలో రాణిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌లలో 80 -90 శాతం పిల్లలు ప్రభుత్వ బడులోనే చదువుతారు. కాని మన దేశంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఫ్రాన్స్, కెనడా, స్పెయిన్, జర్మనీ, బెల్జియం, నార్వే వంటి దేశాలు అత్యున్నత ప్రమాణాలతో ఉచిత విద్యను అందిస్తున్నాయి. ఆయా దేశాలు ప్రపంచానికంతటికీ ఆదర్శంగా నిలిచాయి. నిధుల కేటాయింపుతోపాటు ధృడసంకల్పం, చిత్తశుద్ధి, ప్రత్యేక శ్రద్ధ వహించే వ్యవస్థల నిర్మాణం జరిగినప్పుడే సాక్షర భారత్ కల సాకారమవుతుంది.