Home లైఫ్ స్టైల్ లక్షల మందిని పీడిస్తున్న మధుమేహం

లక్షల మందిని పీడిస్తున్న మధుమేహం

మధుమేహ రోగులు అత్యధికంగా ఉండే 10 దేశాల్లో భారత్ ఒకటి. ఇటీవల జరిపిన అనేక సర్వేలు అధ్యయనాల బట్టి భారతదేశంలో 150 మిలియన్ ప్రజలు మధుమేహ పీడితులని బయటపడింది. ఈ 150 మిలియన్ మందిలో 75 మిలియన్ల మంది పూర్తిగా  మధుమేహ రోగులు  కాగా మిగతా వారిలో ప్రారంభదశలో మధుమేహం ఉంది. అయితే వీరిలో సగానికి సగం మందికి  తమకు మధుమేహం ఉందన్న సంగతి తెలియకపోవడం విశేషం.

hlt

మధుమేహం ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడే డాక్టర్లను ఆశ్ర యించి తెలుసుకోగలు గుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్, డయాబెటిస్ అన్నవి ఇప్పుడు సర్వసాధారణం అయ్యాయి. ఆధునిక జీవనశైలిలో కొన్ని అలవాట్లు వల్ల మధుమేహం కొత్తకేసులు కొన్ని వస్తున్నాయి. 40ఏళ్లు దాటినవారు తప్పనిసరిగా ‘బ్లడ్‌షుగర్’ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 3540 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు డయబెటిస్ ప్రారంభంలో ఉందా? అన్న అనుమానం నివృత్తి చేసుకోవడానికి రక్తపరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. దీనివల్ల రోగ నియంత్రణ చర్యలు పాటించడానికి వీలవుతుంది. జీవన విధానాన్ని మార్చుకోవడం, 150 నిముషాలపాటు యోగా, వ్యాయామం చేయడం, తొందరగా నడవడం ఇవన్నీ మధుమేహ నియంత్రణలో తోడ్పడతాయి. గర్భిణులు డయాబెటిస్‌తో ఉంటే కడుపులో ఉన్న బిడ్డకు డయాబెటిక్ ప్రభావం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో గర్భిణులు బరువు పెరుగుతుందా?తగ్గుతుందా? అన్నది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి.
ఆగ్నేయాసియా దేశాల్లో ప్రస్తుతం 469,03,000 మధుమేహ రోగులుండగా 2030 నాటికి 119,54,1000 మంది వరకు మధుమేహ రోగులు పెరగవచ్చని ఇది చాలా విపత్కర పరిస్థితి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వెలిబుచ్చింది. భారతదేశంలో ఏటా దాదాపు ఒక మిలియన్ భారతీయులు మధుమేహం వల్లనే చనిపోతున్నారు. 2030 నాటికి భారతదేశంలో 101 మిలియన్ వరకు ఈ రోగుల సంఖ్య పెరగవచ్చని గతంలో అంచనా వేయగా అంచనాలన్నీ తారుమారవుతున్నాయి. 2000 సంవత్సరం నాటికి 32 మిలియన్ మధుమేహ రోగులుండగా, 2013 నాటికి 63 మిలియన్ వరకు ఈ రోగులు సంఖ్య పెరగడం గమనించదగ్గ విషయం. అంటే 13 ఏళ్లలో మధుమేహ రోగుల సంఖ్య అమాంతంగా రెండింతలుపెరిగింది. భారతదేశంలో కేరళ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో అత్యధికశాతం మంది మధుమేహరోగులున్నారు. పురుషుల్లో 8.2శాతం, మహిళల్లో 6.8శాతం మంది మధుమేహరోగులే అని తేలింది. 30 నుండి 69 సంవత్సరాల వారిలో ఏటా 75,900 మంది, మహిళల్లో అదే వయస్సు వారిలో 51,700 మంది ప్రాణాలు కోల్పోతున్నారని అధ్యయనాల్లో బయటపడింది. 2005లో 2లక్షల 24 వేలమందిని, 2015లో 3లక్షల 46వేలమందిని మధుమేహం కబళించిందని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. మరణానికి కారణమయ్యే వ్యాధుల జాబితాలో గతంలో 13వ స్థానంలో ఉండే మధుమేహం ప్రస్తుతం పదో స్థానానికి చేరడం ఆందోళన కలిగించే విషయమని భారతీయ వైద్య పరిశోధన మండలి హెచ్చరించింది. చైనాలో 8కోట్లమంది మధుమేహ రోగులుండగా, భారత్‌లో కూడా అదే స్థాయిలో అంటే 7 కోట్లమంది మధుమేహ రోగులున్నారు.
దేశ ప్రజల ఆయుష్షు ప్రమాణం పెరిగింది. కానీ ఆరోగ్య భద్రతపై శ్రద్ధ పెరగడం లేదు. గ్రామాల దగ్గర నుండి పట్టణాలు, నగరాల వరకు ప్రజల జీవన విధానంలో అధునాతన మార్పులు వచ్చాయి. దానికి అనుగుణంగానే ఆహార విహారాల్లో మార్పులు రోజురోజుకూ అనేక రీతుల్లో సాగుతున్నాయి. శారీరక శ్రమ తగ్గింది. పొగాకు, మద్యం వినియోగం విపరీతంగా పెరిగింది. దీనికి తోడు కాలుష్య వాతావరణం కమ్ముకు వస్తోంది. ఎక్కడబడితే అక్కడ బార్లు, పబ్బులు పుట్టుకొచ్చి తాగనివారి సంఖ్య రోజురోజుకూ మితిమీరుతోంది.
పొగాకు వినియోగం వల్ల అనేక రకాల కేన్సర్లు వస్తున్నాయి. కూల్‌డ్రింక్స్, పిజ్జాలు, బిరియానీలు, విందులు రేయింబవళ్ళు విచ్చలవిడి విహారాలు, ఉద్యోగాల్లో, చదువుల్లో ఒత్తిడులు, యువతను మత్తు వ్యసనాలకు దారితీస్తున్నాయి. ఈ వ్యాధుల్లో మధుమేహానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధ్యయనం చేయగా ప్రజల్లో 22 శాతం ఊబకాయులు కావడమేకాక మధుమేహ పీడితులవుతున్నారని తేలింది. తెలంగాణ రాష్ట్రంలో సుధీర్ కమిషన్ నిర్వహించిన అధ్యయనంలో కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల్లోని వయోజనుల్లో 10శాతం కన్నా ఎక్కువమంది బ్లడ్‌షుగర్‌తో బాధపడుతున్నారని బయటపడింది.
డయాబెటిస్‌ను నిరోధించే కొత్త గోధుమ రకం ః
టైప్2 డయాబెటిస్‌తో పోరాడే పటిమతోపాటు కేన్సర్‌ను లొంగదీసే కొత్తరకం గోధుమను పరిశోధకులు కనుగొన్నారు. పీచువంటి పదార్థం (ఫైబర్) గోధుమల్లో సమృద్ధిగా ఉంటుంది. జీర్ణశక్తిని ప్రేరేపించే ప్రతిఘటన పిండి పదార్థం ఎక్కువ అమలోజ్ గోధుమల్లో ఉత్పత్తి అవుతుంది. సాధారణ గోధుమరకం కన్నా ఈ అమలోజ్ గోధుమల్లో పదిరెట్లు ఎక్కువగా ప్రతిఘటన పిండిపదార్థం ఉత్పత్తి అవుతుంది. జీర్ణప్రక్రియ ఆహార్యాన్ని పెంపొందించే శక్తి ప్రతిఘటన పిండి పదార్థంలో ఉంది. కేన్సర్‌కు దారితీసే జన్యు వినాశనాన్ని ఇది నివారించి కాపాడగలుగుతుంది. ఇదే టైప్2 డయాబెటిస్ నివారించడానికి సహకరిస్తుంది.
ఇప్పుడు టైప్ 2 డయాబెటిస్ ప్రపంచ ఆరోగ్య సవాలుగా మారింది. భారత్ వంటి వర్థమాన దేశాలు అన్నిటికీ ఇదో సమస్యగా నిలిచిందని కామన్‌వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి ఆర్గనైజేషన్ ప్రధాన పరిశోధక శాస్త్రవేత్త రెజినా అహ్మద్ పేర్కొన్నారు.
పొడపత్రి ఔషధ మొక్క ః గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో ముళ్ల పొదలపై పెరిగే పొడపత్రి మొక్క మధుమేహ నివారిణిగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ మొక్క విశేషాలను ‘వస్తుగుణ దీపిక’ అనే ఆయుర్వేద గ్రంథంలో వివరించారు. ఈ మొక్కలను జపాన్‌తోపాటు మరికొన్ని దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. అతిమూత్రం, కంటిజబ్బులకు నివారిడానికి గిరిజనులు, ఆదివాసీలు ఈ మొక్కలను వాడుతుంటారు.