Home జాతీయ వార్తలు అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణ 15 నుంచి కాదు!

అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణ 15 నుంచి కాదు!

India likely to delay resumption of international flights

 

కొత్త తేదీని తర్వాత ప్రకటిస్తారు!!

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల షెడ్యూల్డ్ తేదీ డిసెంబర్ 15 నుంచి పునరుద్ధరించకూడదని ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. అంతర్జాతీయ విమానాలను పునరుద్ధరిస్తామని ప్రకటించిన వారం రోజులకే, కొవిడ్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ కారణంగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. తదుపరి షెడ్యూల్డ్ తేదీని తర్వాత ప్రకటిస్తామని విమానాల రాకపోకలను పర్యవేక్షించే పౌర వైమానిక డైరెక్టర్ జనరల్(డిజిసిఎ) తెలిపింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలను 2020 మార్చి 23 నుంచి కరోనా మహమ్మారి కారణంగా రద్దుచేశారు. ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనల నడుమ కూడా అంతర్జాతీయ ప్రయాణాల నియమాలను సరళం చేసే విధంగా సమీక్షించాలని ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 27న అధికారులకు సూచించారు.

అయితే ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ పరిస్థితిని గమనించాక డిజిసిఎ తన విమానాల రాకపోకల పునరుద్ధరణ విషయాన్ని పున్‌సమీక్షించుకుంది. ప్రధాని సూచన మేరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలను డిసెంబర్ 16 నుంచి పునరుద్ధరించనున్నామని డిజిసిఎ నవంబర్ 26న జారీ చేసిన సర్కూలర్‌లో పేర్కొంది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని నిలిపేసింది. ఇదిలావుండగా భారత్‌లో ఎలాంటి ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు. అధికారులు చాలా కట్టుదిట్టమైన నియమాలను అంతర్జాతీయ ప్రయాణికులకు విధించారు. ఒమిక్రాన్ వేరియంట్ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా నవంబర్ 29న ప్రకటించారు.

రాజ్యసభలో సిందియా ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ఊపందుకోవడం, మహమ్మారి స్వభావం మారడం, హెల్త్ ప్రొటోకాల్స్ పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. “అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ భయాందోళనల దృష్టా పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం, ఇతర మంత్రిత్వ శాఖలతో సంప్రదించి సమీక్షిస్తున్నాం. ఇక విమానాల పునరుద్ధరణ అంశంపై నిర్ణయం తర్వాత తీసుకుంటాం”అని మంత్రి తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలు ద్వైపాక్షిక బబుల్ ఏర్పాట్లు(బబుల్ ఎరేంజ్‌మెంట్స్) కింద వివిధ దేశాలకు నడుపుతున్నట్లు తెలిపారు. భారత్ నవంబర్ 24న దాదాపు 31 దేశాలతో బబుల్ ఏర్పాట్లను ఖరారు చేసుకుంది.

India likely to delay resumption of international flights