Home ఎడిటోరియల్ సామాజిక అసమానతలే!

సామాజిక అసమానతలే!

Cartoon

 

దేశంలో స్త్రీలపై జరుగుతున్న హింసపై, అత్యాచారాలపై ఎన్నో ఉద్యమాలు, ఎన్నో చట్టాలు తెచ్చినప్పటికీ స్త్రీలపై ఘోరాలను అరికట్టలేకపోతున్నారు. ఈ తరుణంలో స్త్రీలపై ఇలాంటి అమానవీయ అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నట్లు? ఇలాంటి అత్యాచారాలకు కారణాలేంటో తెలుసుకోకుండా స్త్రీలకు రక్షణ ఇవ్వలేము. దేశంలో రోజు రోజుకు సంపన్నుల ఆస్తులు రెట్టింపై కోటీశ్వర్లుగా మారుతుంటే పేదలు మరింత పేదలై కూటి కోసం కోటి తిప్పలు పడుతున్నారు. ప్రజల మధ్య ఆర్ధిక అసమానతలతో పాటు సామాజిక, సాంఘిక అసమానతలు నానాటికీ పెరిగిపోతున్నాయి.

ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిశ్రామికీకరణ వల్ల పల్లెల్లో ఉపాధి కరువై బతుకు కోసం పేదలు పట్టణాలకు వలసలు పోతున్నారు. దాంతో పట్టణాలు విస్తరించి పట్టణాల్లో అసమానతల సమాజం ఏర్పడుతున్నది. బతుకు కోసం పట్టణాలకు వలస వచ్చిన ప్రజలకు పట్టణాల్లోని సంపన్నుల పోకడలు, వేష భాషలు ఈర్ష్యా ద్వేషాలను పెంచుతున్నాయి. పట్టణ నాగరిక పోకడలు పల్లె సంస్కృతి మధ్య విపరీత వైరుధ్యమే ఇలాంటి నేరాలకు హేతువు అవుతుంది. పట్టణాలకు విపరీత వలసల వల్ల స్త్రీలపై అత్యాచారాలే కాక మోసాలు, దోపిడీలు, వైట్ కాలర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి.

ప్రగతిశీల, ప్రజాస్వామిక ఉద్యమాలు సన్నగిల్లినప్పుడు ఇలాంటి అఘాయిత్యాలు పెరిగిపోతుంటాయి. ప్రగతిశీల ఉద్యమాలపై, ప్రశ్నించే గొంతుకులపై ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని కొనసాగించడం వల్ల ప్రజలకు సంఘటిత చైతన్యం కోల్పోయి నానాటికి ఒంటరి జీవితాలు ఎక్కువై స్త్రీలపై అఘాయిత్యాలు కారణం అవుతున్నాయి. ఇండియాలో గతంలో ఎన్నో ప్రగతిశీల ఉద్యమాలు, ప్రగతిశీల విద్యార్థి సంఘాలు, ప్రగతిశీల యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు ఉండేవి. ఈ సంఘాల వారు నిత్యం విద్యా సంస్థల్లో, యువతలో, కార్మికుల్లో మానవీయ విలువల బోధనలు, స్త్రీ సమానత్వం, స్త్రీలను గౌరవించడం గూర్చి బోధిస్తూ, ఆచరణాత్మకంగా జీవించేవారు. పాలకుల ఆధిపత్య పోకడలతో ప్రగతిశీల శక్తులు క్రమేనా కనుమరుగవుతుండడంతో మానవీయ విలువలకు దూరమైన ప్రజలు స్త్రీలపై, బలహీన వర్గాలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు.

స్త్రీలపై దాడులు, హత్యాచారాల్లో, హింసలో ఇండియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులకు రక్షణ కల్పించడంలో చూపిన శ్రద్ధ మహిళలకు రక్షణ ఇవ్వడంలో మన ప్రభుత్వాలు చూపించడం లేదు. జనాభాకు సరిపడా పోలీసులు లేరు. ఒక లక్ష జనాభాకు 130 మంది పోలీసులు మాత్రమే ఉండగా, ప్రజలకు సత్వర న్యాయం అందించి దోషులను శిక్షించే న్యాయస్థానాల్లో 50 శాతం ఖాళీలు ఉన్నాయి. మహిళలపై మానభంగాలు చేసినవారు చట్టసభల్లో కూర్చున్నారు. అలాంటి వారు మహిళా రక్షణకు ఏమి చట్టాలు తెస్తారు? ఒకవేళ ప్రజల ఆందోళనతో చట్టాలు తెచ్చిన వాటి అమలులో అలసత్వమే చూపిస్తారు. స్త్రీలపై హత్యాచారాలు జరిగినప్పుడు ప్రజలు వీధుల్లోకి వచ్చి వారి ఆవేశాన్ని వెళ్లగక్కి నిందితులను కఠినంగా శిక్షించాలి, ఎన్‌కౌంటర్ చేయాలి, ఉరిశిక్ష వేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. కోర్టులు ఉరి శిక్షలు వేయడంతో వారి పని అయిందనిపిస్తున్నారు.

ప్రజల డిమాండ్‌తో పాలకులు కొత్త చట్టాలను తెచ్చి ప్రజలను శాంత పరుస్తున్నారు తప్ప స్త్రీలపై దాడులను అరికట్టడంలేదు. పాలకులకు చిత్తశుద్ధి లేకుండా ఎన్ని చట్టాలు తెచ్చిన ఫలితమేముండదని తెలుస్తున్నది. కొత్త చట్టాలను తీసుకొచ్చి మేము సైతం స్త్రీల పక్షాన ఉన్నామని నమ్మబలుకుతూ ప్రజల ఆందోళనకు పాలకులు సమాధానం చెబుతుండడం పరిపాటయింది. నిర్భయ హత్యాచారం తో ప్రజల నుండి వచ్చిన ఆందోళనలతో ఏడేండ్ల కింద నిర్భయ చట్టం తీసుకొచ్చారు. చట్టాలు తెస్తున్న పాలకులు నగర సంస్కృతిలో పట్టణీకరణలో మహిళలపై జరుగుుతున్న అత్యాచారాలను పాలకులు అదుపు చేయడంలో విఫలమవుతున్నారు. సామాజిక అసమాతలను రూపుమాపి సమానత్వాన్ని సామాజిక సమతుల్యతను స్థాపించాల్సిన బాధ్యత రాజ్యంపై ఉంది. సామాజిక సమతుల్యతను కాపాడాలనే చొరవ పాలకులలో తగ్గిపోయినందునే ఇన్ని అసమానతలు ఏర్పడి స్త్రీలపై అఘాయిత్యాలకు కారణమవుతున్నాయి.

సమాజంలో సకల అసమానతలు పెరిగి ఎన్నో నష్టాలకు దారి తీస్తున్నాయి. తద్వారా కలిసి మెలిసి బతకాల్సిన ప్రజలు కలహించుకుంటున్నారు. స్త్రీ విద్యలో రాణించాలని ప్రచారం చేస్తున్న పాలకులు స్త్రీ మనోధైర్యంగా బతికే బోధనలు, విద్యా సంస్థల్లో స్త్రీ సమానత్వం గూర్చి విలువల బోధన చేయాల్సిన బాధ్యత కూడా పాలకులపైనే ఉంది. చట్టాలు చేసి సమాజాన్ని రక్షించాలనుకునే పాలకులు అందులో కాసింత శ్రద్ధ తీసుకొని అసమానాతలను తొలిగిస్తే ఇన్ని నేరాలు ఘోరాలు జరగవు. నిర్భయ సంఘటన జరిగిన తర్వాత నిర్భయ చట్టం తేవడమే కాకుండా బాధితుల సహాయ నిధి కింద రూ. వెయ్యి కోట్లు మంజూరు చేస్తే అవి ఇప్పుడు 3600 కోట్లు అయ్యాయి. అయినా నేరాలు ఆగడం లేదనే విషయం పాలకులు, ప్రజలు ఆలోచించాలి. నేరాల అదుపుకు సమానత్వం అవసరమనే విషయం గుర్తించాలి.

సమాజాన్ని చక్కదిద్ది చట్ట ప్రకారం పాలన చేయాల్సిన పాలకులు చట్ట సభల్లో సామాన్యులు మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు. పార్లమెంట్, అసెంబ్లీలోని నాయకులు సమాజంలోని ఇలాంటి రుగ్మతలను రూపుమాపడానికి చర్చలు చేయడం లేదు. ఏపాటికి చట్టాలు, శిక్షలపైనే మాట్లాడుతున్నారు. ఏ భావజాలం వల్ల స్త్రీలపై దారుణాలు ఎక్కువవుతున్నాయో ఆ భావాజాలానికి సంబంధించిన సంఘాలు, విద్యార్థి సంఘాలు, పాలకవర్గాలు విద్యార్థుల చేత ర్యాలీలు చేయిస్తుండడం దుర్మార్గం. కట్టుకున్న భార్యను, కన్న తల్లిని కడతేర్చే సమాజం ఎందుకు నిర్మితమవుతుందో మన పాలకులు ఆలోచించాలి.

ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే రోడ్ల పైకి వచ్చి నిరసనలు, ర్యాలీలు, ఆందోళనలు చేసే వారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి పాలన అవసరమో అందుకోసం కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. స్త్రీని అందరూ నమ్మించి నట్టేట ముంచుతున్నారు. స్త్రీకి మనసుంటుదని, వారి శరీరంపై వారికి ప్రత్యేక గౌరవం ఉంటుందని ఈ సమాజానికి తెలియ చెప్పాలి. విద్యకు దూరమవుతున్న పేదలకు సినిమాలు, మద్యం తోడై మృగాలుగా మారుతున్నారు. మానవులు మృగాలుగా మారుతున్న విషయాలపై ఇంట బయట చర్చ జరగాలి. ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలి. అప్పుడే ఇలాంటి ఘటనలకు మరొకరు బలి కాకుండా చూడవచ్చును.

ఎన్‌కౌంటర్, ఉరి శిక్షలతో స్త్రీలపై అత్యాచారాలు ఆగవని పెరుగుతున్న నేరాలు రుజువు చేస్తున్నాయి. 10 ఏళ్ల క్రితం వరంగల్ లో జరిగిన యాసిడ్ దాడిలో ముగ్గురిని ఎన్‌కౌంటర్ చేశారు. ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో నిర్బయ ఘటన జరిగింది. నిర్భయ నిందితులకు ఉరి శిక్ష ఖరారు చేశారు. వరంగల్ లో మరొక కేసులో ఉరిశిక్ష విధించిన కొద్ది రోజుల్లోనే తొమ్మిదవ తరగతి అమ్మాయిని చంపారు. దిశ ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుండగానే స్త్రీలపై హత్యాచారాలు జరుగుతున్నాయంటే కఠినమైన శిక్షలతో నేరాలు ఆగవని తెలుసుకోవాలి. సామాజిక అసమానతల వల్ల ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని అర్ధం చేసుకోవాలి. ఏ పరిస్థితుల్లో, ఏ నేపథ్యంలో ఇలాంటి దురాఘతాలకు పాల్పడుతున్నారో పరిశోధించాలి. మెజారిటీ ప్రజలను చదువుకు ఉపాధికి దూరం చేసి, సంస్కారవంతమైన జీవితాలకు దూరం చేసి మంచి చెడులు తెలియని వింత పశువులను చేసి మానవ మృగాలుగా తయారు చేసి ఇవ్వాలా మనం ఎంత మొత్తుకున్నా, ఎన్ని శిక్షలు వేసినా, ఎన్‌కౌంటర్లు చేసినా ఇలాంటి నేరాలు, ఘోరాలు అదుపు చేయలేము. ఆర్ధిక అసమానతలు, సామాజిక అసమానతలు రూపమాపకుంటే రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని ఘటనలు జరుగుతాయని సమాజం అర్ధం చేసుకోవాలి.

India most dangerous country for women