Home ఎడిటోరియల్ మతతత్వంపై స్త్రీవాద పోరు

మతతత్వంపై స్త్రీవాద పోరు

India needs militant feminism

 

‘అణగారిన జీవుల నిట్టూర్పే మతం. హృదయరహిత ప్రపంచపు హృదయమది. జీవసారరహిత పరిస్థితుల సారమిది. ప్రజలు తీసుకునే మత్తు మందు అది. ప్రజల నిజ సంతోషం కోసం, భ్రమాత్మక సంతోషమైన మతాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయాలి.’ కారల్ మార్క్. ఈ దృక్కోణం నుంచి ‘శబరిమలై ఆలయంలోకి సంతానం కలిగే ప్రాయంలోని మహిళల ప్రవేశంపై సాగుతున్న పోరాటం స్త్రీలకు ఏ విధంగా న్యాయం చేస్తుందన్నది అనుమానమే. అయితే, రాజ్యాధికార రాజకీయాల ఎత్తులు జిత్తుల్లో భాగంగా ఆ పోరాటం సాగుతోంది. ప్రస్తుతం అణచివేత అనేది దానికదే రాజకీయాల మౌలిక ఉత్పత్తిగా తయారైంది. మతం పునాదిగా నడుస్తున్న రాజకీయాలు దళితులు, మహిళలు, బడుగుల అణచివేత రూపంలోనే సాగుతున్న విషయం విదితమే. అయ్యప్ప లేదా మరేయితర దేవుళ్లైనా సరే వారిని మరిచిపోండి. ఆ వివాదం పునాదిగా ఒకటి కంటే మించిన పార్టీలతో ఏర్పడే సంకీర్ణ కూటమి సాగించే రాజకీయాలపైనే దృష్టి పెట్టండి.

ఇండియాలోని స్త్రీల కోసం జరిగే స్పష్టమైన పోరాటంగా ఈ రోజు శబరిమలై వివాదం మారింది. అయితే అందుకు భిన్నంగా, ఒకానొక ప్రజా సమస్యను ఎలా ద్విముఖ ఆటగా ఒక రాజకీయ పార్టీ సులభంగా మలచిందనే విషయాన్ని మనం మరచిపోయాం. దేశ రాజకీయాల్లో నడుస్తున్న ఈ దృశ్యం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా ఇండియాను నిలబెడుతుంది. అధికారం నుంచి అణచివేతకు సాగే క్రమాన్ని రాజకీయాలు జన్మనిస్తాయి. శబరిమల వివాదంపై సాగుతున్న యుద్ధం ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు విభిన్న పార్టీల సంకీర్ణ కూటమికి మార్గం సుగమమం చేసింది. రాజ్యాంగం అనే ఆయుధంతో కమ్యూనిస్టు పార్టీ యుద్ధం చేస్తుంటే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మత విశ్వాసం, సంప్రదాయాల పేరుతో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. దేశం మత విశ్వాసాల చట్రంలో నడుస్తుండడం ఒక కఠోర వాస్తవమని మనకందరికీ తెలుసు. దేశంలో సాగుతున్న రాజకీయ, సామాజిక పరిణామాలకు అనుగుణంగా కేరళ రాజకీయ ముఖ చిత్రం కూడా వేగంగా మారుతోంది.

శబరిమలలో జరుగుతున్న పోట్లాట మార్పుకు ఒక సాధనంగా నిలువబోతోందని స్త్రీ వాదులు గుర్తించాలి. మహిళలపై వివిధ రూపాల్లో సాగుతున్న అకృత్యాల నేపథ్యంలో భారత్‌కు మిలిటెంట్ స్త్రీ వాదం అవసరం. స్త్రీ వాదాన్ని సమర్థించే రాజకీయ పక్షాలకు నేడు ప్రోత్సాహం అవసరం. అయితే స్త్రీల అణచివేతకు మతమే ప్రధాన కారణంగా నిలిచిన నేపథ్యంలో స్త్రీ వాదం మతంపై ఎందుకు కేంద్రీకరించాలి? శబరిమల వివాదం వంటి మత విషయాల్లో స్త్రీ వాదం జోక్యం చేసుకోవడం అర్థరహితంగా అనిపిస్తోంది. విశ్వవ్యాప్తంగా మత సంప్రదాయాల రీత్యా మహిళల పట్ల వివక్ష కొనసాగుతుండడం అత్యంత స్పష్టమైన విషయం. మత అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీవాదం నిరంతరాయంగా పోరాటం చేస్తున్న విషయాన్ని మనం గుర్తించాలి. మతాలన్నిటికీ కేంద్ర బిందువు మహిళలను, పేదలను అణచివేయడమే. బ్రాహ్మణవాద అణచివేత దృక్పథాన్ని కలిగిన హిందూయిజం మహిళలపై అనేక రూపాల్లో అణచివేతను కొనసాగిస్తోంది. స్త్రీ పురుషుల విభజన ప్రాతిపదికగా సాగే దైవ ధిక్కారానికి మూల కారకురాలంటూ క్రైస్తవం స్త్రీ వ్యతిరేక వైఖరిని చేపట్టింది.

రోమన్ చట్టం ప్రకారం మహిళలకు పౌరులుగా గుర్తింపు లేదు. ఎలాంటి చట్టబద్ధ హక్కులు ఉండవు. ఆ వ్యవస్థలో స్త్రీ పురుష అసమానత్వం అన్ని రంగాల్లో కొనసాగుతుండడం కద్దు. ఉదాహరణకు రోమన్ చట్టం ప్రకారం పురుషుల వ్యభిచారం సమ్మతమైతే, అదే కారణంగా స్త్రీలకు మరణ శిక్ష విధిస్తారు. ఈ నేపథ్యంలో తొలి క్రైస్తవ మతం స్త్రీ, పురుషుల సమానత్వాన్ని సూత్రప్రాయంగా, ఆధ్యాత్మికంగా ప్రతిపాదించింది. ఆ తర్వాత అధికార మతంగా మారిన నాటి నుంచి పురుషాధిక్యత సంప్రదాయాన్ని ముందుకు తెచ్చింది. ఇప్పటికీ కొనసాగుతున్న మహిళలను కొట్టడం, హక్కుల నిరాకరణ, తీవ్ర శ్రమ అనే పురుషాధిక్య సంప్రదాయానికి ఇస్లాం జన్మనిచ్చింది. దైవ ధిక్కారాన్ని, మత అణచివేతను అర్థం చేసుకున్న మహిళలున్న కొన్ని ప్రాంతాల్లో తప్ప పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్నిటిలోనూ స్త్రీ అణచివేత కొనసాగుతున్నట్లు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. 70 శాతం నిరక్షరాస్యత కొనసాగుతున్న దేశంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, కాంగ్రెస్‌లు మత విశ్వాసం పేరిట స్త్రీ, పురుష భక్తులందర్నీ ఒకటి చేసి దేశ వ్యాప్తంగా ఉద్రిక్తతలను రెచ్చగొట్టడాన్ని, మత విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని చదువుకున్న మేధావులు ఎలా నిర్లక్షం చేస్తున్నారో అర్థం కావడం లేదు.

రాజ్యాంగాన్ని ఎన్నడూ లేక్క చేయకుండా, మత మొక్కటే సత్యంగా భావిస్తున్న దేశంలో నిరక్షరాస్యత స్థాయిని తగ్గించడం అత్యంత కష్టతరమైన వ్యవహారంగా మారింది. శబరిమల వివాదం సంచలనం సృష్టించిన సందర్భంలోనే, ఒకే రాత్రి నలుగురు మహిళలు సామూహిక అత్యాచారానికి గురైన వార్త గుండెల్ని పిండేస్తుంది. మత్తు మందు లాంటి మత వివాదం కంటే సామూహిక అత్యాచార సంఘటనలు అధికంగా బాధిస్తున్నాయి. ‘శబరిమల ఆలయంలోకి అవంధ్య ప్రాయంలోని మహిళల ప్రవేశంపై నిషేధం ఎందుకు విధించాలి?’ అనే అంశం కంటే ‘మతానికి, రజస్వలకు ముడిపెడుతూ కొనసాగుతున్న రాజకీయాలేమిటి?’ అనే విషయం అత్యంత విషాదకరమైనదిగా నిలిచింది. సంప్రదాయాలు పాటిస్తే మోక్షప్రాప్తి ఉంటుందనే మత అమరత్వ భావన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు నాప్కిన్స్ వాడకుండా కట్టుబాటు చేసినవారే, అదే అణచివేత మత సంప్రదాయాలను అడ్డుపెట్టుకొని పెద్ద పోరాటం చేస్తుండడం హాస్యాస్పదం!

రజస్వల కావడం అశ్లీలమైనది, అపవిత్రమైనదేమీ కాదు. మానవ జన్మకారకమైన జీవ ప్రక్రియ అది. మహిళల రజస్వల వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ పార్టీలు సాగిస్తున్న వివాదాలు, పోరాటాలనే నిజమైన అపవిత్రత, అశ్లీలతలుగా పరిగణించాలి. నీచాతినీచంగా కొనసాగుతున్న రాజకీయ అశ్లీలత గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ‘లవ్ జీహాద్’, ‘మోరల్ పోలీసింగ్ (సదాచార పరిరక్షణ)’, వంటి ధోరణులతో అంటకాగుతున్న పార్టీలు నేడు అయ్యప్ప భక్తులను సంఘటితం చేసి ‘స్త్రీ వాదం’పై పోట్లాటకు దిగడం విచారకరం. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 17, 25, 26 ప్రకారం మత పవిత్ర స్థలాలన్నిటిలోకి మహిళల ప్రవేశ నిషేధాన్ని నిర్మూలించాలనే దేశ సర్వోన్నత న్యాయ స్థానం జారీ చేసిన ఆదేశాన్ని మనం పాటించాలా లేదా రజస్వలను రాజకీయం చేయడం ద్వారా దేశంలో పురుషాధిక్యతను, స్త్రీల అణచివేతను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్న రాజకీయ పక్షాల స్వార్థాన్ని, కుట్రలను తిప్పికొట్టాలా? తేల్చుకోవాల్సిన తరుణమిది.

చివరగా, శబరిమలలో రజస్వల కేంద్రంగా రాజకీయ పక్షాల మధ్య సాగుతున్న తీవ్రమైన పోట్లాట కేరళలోను, దేశంలోను తప్పుడు సామాజిక సంకేతాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. మానవ హక్కులకు విఘాతం కలిగించి, యుద్ధాన్ని ప్రేరేపించేందుకు దోహదం చేసే ‘మతం’ కేంద్రంగా సాగే రాజకీయ వివాదం కంటే హక్కుల ప్రాతిపదికన ‘స్త్రీ వాదం’ పునాదిగా సాగే పోరాటం నేటి తక్షణ అవసరం. రాజ్యాంగబద్ధమైన సమరం చట్టం పరిధిలో కొనసాగించాలి. అలా కాకుండా, ప్రజల పాలిట మత్తు మందును రాజ్యాధికార సాధనంగా వినియోగించే శక్తులకు సులభంగా అవకాశం కల్పించే వాటిని కదపకుండా ఉండవలసిన తరుణమిది. ‘స్త్రీ వాదం’ అనేది మతానికి వ్యతిరేకంగా స్థిరంగా నిలుస్తుంది, జెండర్ సమానత్వ సంస్కరణల కోసం కృషి చేస్తుంది.

India needs militant feminism