Home తాజా వార్తలు ఆత్మవిశ్వాసంతో భారత్

ఆత్మవిశ్వాసంతో భారత్

India-New zealand first test from today

న్యూజిలాండ్‌కు పరీక్ష, నేటి నుంచి తొలి టెస్టు

కాన్పూర్: భారత్‌-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం నుంచి కాన్పూర్‌లోని చారిత్రక గ్రీన్‌పార్క్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇటీవలే ముగిసిన ట్వంటీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా ఆత్మవిశ్వాసంతో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. అయితే టి20లలో ఆడిన కొద్ది మంది ఆటగాళ్లు మాత్రమే టెస్టులకు అందుబాటులో ఉన్నారు. అయితే రాహుల్ ద్రవిడ్ రూపంలో భారత్‌కు దిగ్గజ కోచ్ ఉందనే విషయాన్ని మరువకూడదు. ద్రవిడ్ పర్యవేక్షణలో టీమిండియా సమరోత్సాహంతో సిరీస్ బరిలోకి దిగుతోంది.

ఈ మ్యాచ్‌లో రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతి కల్పించారు. దీంతో జట్టు సారథ్య బాధ్యతలను అజింక్య రహానె నిర్వర్తించనున్నాడు. అతనికి డిప్యూటీగా మరో సీనియర్ చటేశ్వర్ పుజారాను నియమించారు. విరాట్, రోహిత్, రిషబ్, బుమ్రా, షమి, రాహుల్ వంటి సీనియర్లు లేకుండానే భారత్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. దీంతో పుజారా, రహానెలు జట్టుకు చాలా కీలకంగా మారారు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత వీరిపై నెలకొంది. అయితే సొంత గడ్డపై అసాధారణ రికార్డును కలిగిన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మల రూపంలో భారత్‌కు మ్యాన్ విన్నర్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు. వీరితో పాటు రహానె, పుజారా, సాహాలు ఉండడంతో భారత్‌కు గెలుపు అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి.

బ్యాటింగే సమస్య..

ఈ మ్యాచ్‌లో భారత్‌కు బ్యాటింగ్ కీలకంగా మారింది. విరాట్‌తో పాటు రోహిత్, రాహుల్, పంత్ తదితరులు బరిలోకి దిగడం లేదు. రాహుల్ గాయం బారిన పడడంతో టెస్టు సిరీస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. రోహిత్, విరాట్, పంత్‌లకు కూడా విశ్రాంతి ఇచ్చారు. దీంతో కీలక ఆటగాళ్లు లేకుండానే భారత్ ఈ మ్యాచ్‌లో తలపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్‌లు జట్టుకు చాలా కీలకంగా మారారు. జట్టుకు శుభారంభం అందించాల్సిన బాధ్యత వీరిపై నెలకొంది. వీరిద్దరూ అందించే శుభారంభంపైనే జట్టు భారీ స్కోరు ఆధారపడి ఉంది.

ఆ ఇద్దరే కీలకం..

కాగా ఈ పోరులో భారత్‌కు రహానె, పుజారాలు చాలా కీలకంగా మారారు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత వీరిపై ఉంది. టెస్టుల్లో అసాధారణ రికార్డులు కలిగిన వీరిద్దరూ కొంతకాలంగా ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. అయితే ఈసారి మాత్రం మెరుగైన ప్రదర్శన చేయక తప్పదు. పలువురు సీనియర్లు అందుబాటులో లేకుండా పోయిన సమయంలో వీరిద్దరి బాధ్యత మరింత పెరిగింది. కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ భారీ స్కోరు నమోదు చేయక తప్పదు. అంతేగాక శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహాలు కూడా తమ పాత్రను సమర్థంగా నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు బౌలింగ్‌లో మాత్రం భారత్ బలంగా ఉంది. అశ్విన్, ఇషాంత్, అక్షర్, జడేజాలతో బౌలింగ్ చాలా పటిష్టంగా మారింది. వీరికి తోడు ప్రసిద్ధ్ కృష్ణ, జయంత్ యాదవ్, సిరాజ్ వంటి యువ బౌలర్లు ఉండనే ఉన్నారు. దీంతో భారత్‌కు బౌలింగ్‌లో ఎదురు లేదనే చెప్పాలి.

సవాల్ వంటిదే..

మరోవైపు పర్యాటక న్యూజిలాండ్‌కు సిరీస్ సవాల్‌గా మారింది. ఇప్పటికే ట్వంటీ20లలో చిత్తుగా ఓడింది. కనీసం టెస్టుల్లోనైనా మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం జట్టుపై నెలకొంది. అయితే టెస్టుల్లో కేన్ విలియమ్సన్, లాథమ్, వాగ్నర్, జేమిసన్, ఎజాజ్ పటేల్ వంటి మ్యాచ్ విన్నర్లు బరిలోకి దిగుతున్నారు. ఇది కివీస్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే రాస్ టెలర్ ఉండనే ఉన్నాడు. అతనికి ఉన్న అపార అనుభవం జట్టుకు కలిసి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక విలియమ్సన్ రూపంలో మరో మెరుగైన అస్త్రం కివీస్‌కు ఉండనే ఉంది. దీంతో న్యూజిలాండ్ కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది.

జట్ల వివరాలు:

భారత్: అజింక్య రహానె (కెప్టెన్), చటేశ్వర్ పుజారా, మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, సిరాజ్, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ, జయంత్ యాదవ్.

న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టెలర్, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, మిఛెల్ సాంట్నర్, విలియమ్ సోమర్‌విల్లే, డారిల్ మిఛెల్, టామ్ బ్లుండెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సౌథి, జేమిసన్, నీల్ వాగ్నర్, ఎజాజ్ పటేల్.