Home జాతీయ వార్తలు విజయగీతికి 20 ఏళ్లు

విజయగీతికి 20 ఏళ్లు

President Kovind

 

కార్గిల్ వీరులకు జాతి నివాళి
సంస్మరించుకున్న ప్రముఖులు
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రుల జోహార్లు
అమర జవాన్లకు త్రివిధ దళాధిపతుల శ్రద్ధాంజలి
దేశం వివిధ ప్రాంతాల్లో కార్గిల్ సంస్మరణ కార్యక్రమాలు

న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో భారతదేశం పాకిస్థాన్‌పై విజయం సాధించి 20 ఏళ్లు అయిన సందర్భంగా దేశం ఆ నాటి ఘట్టాల్ని సంస్మరించుకుంటూ అమరవీరులకు శుక్రవారం నివాళులర్పించింది. వారి శౌర్యపరాక్రమాల్ని , అసమాన త్యాగాల్ని కొనియాడింది. ఆ యుద్ధంలో దాదాపు 500 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్‌లో పాక్ చొరబాటుదారులు ఆక్రమించుకున్న అనేక పర్వత ప్రాంతాల్ని ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో జరిపిన పోరాటంలో మన సేనలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ విజయ్‌కి గుర్తుగా ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ దివస్‌ను జరుపుకుంటున్నాం. 1999 జూలై 26న ఆపరేషన్ విజయ్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్టు మన ఆర్మీ ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కాంగ్రెస్ నాయకుడు ఆధిర్ రంజన్ చౌదరి శ్రద్ధాంజలి ఘటించారు.

ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోయా, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ జమ్మూ కశ్మీర్‌లోని డ్రాస్ లో ఉన్న కార్గిల్ యుద్ధస్మారక చిహ్నంవద్ద అమర జవాన్లకు జోహారులర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డ్రాస్‌లో జరిగిన కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడికి వెళ్లలేకపోయారు. రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ వెంటరాగా ఆయన కశ్మీర్ బదామీబాగ్ కంటోన్మెంట్‌లోని 15వ సైనిక బెటాలియన్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అంజలి ఘటించారు. ‘కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు మన దేశం తరఫున నివా ళి అర్పిస్తున్నాను. వారికి దేశం రుణపడి ఉంటుంది. వారి వీరోచిత పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్నాం. దేశసేవకు మనం పునరంకితమవుదాం’ అని సందర్శకుల పుస్తకంలో రాశారు. అనంతరం ట్వీట్ చేస్తూ …వారి త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది’ అని ట్వీట్ చేశారు.

రాజ్యసభలో..
రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు భారత సైనికులు శౌర్యపరాక్రమాల్ని ప్రశంసించారు. దేశం వారి త్యాగాల్ని ఎన్నటికీ మరచిపోదన్నారు. సభలో సభ్యులు నిలబిడి మౌనం పాటించి కార్గిల్ వీరులకు నివాళి అర్పించారు.

ప్రధాని మోడీ నివాళి
‘ఆ వీరులు దేశమాత గర్వించదగ్గ తనయులు. వారికి హృదయపూర్వకంగా నివాళి అర్పిస్తున్నాను. మాతృభూమిని రక్షించేందుకు వారు తమ ప్రాణాలనే ఫణంగా పెట్టారు. 1999లో కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు నేను మన సైనికుల్ని కలుసుకొని మాట్లాడాను. సంఘీభావం తెలిపాను. అది మరచిపోలేని జ్ఞాపకం’ అని ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. కార్గిల్ దివస్ సందర్భంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం దగ్గర అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

భారత సరిహద్దుల భద్రతను, పవిత్రతను కాపాడేందుకు సైనికులు అసమాన త్యాగాలు చేశారు. వారిని జాతి మరచిపోదు’ అన్నారు. ‘మన పొరుగుదేశం పాకిస్థాన్ మనతో పూర్తి స్థాయిలో ఎన్నటికీ యుద్ధం చేయలేదు’ ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ చెప్పారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో కార్గిల్ దినోత్సవం సందర్భంగా అమర వీరులను సంస్మరించుకుంటూ కార్యక్రమాలు జరిగాయి.1999 నాటి యుద్ధంలో ఘట్టాల్ని చూపించే ఒక ప్రత్యేక వీడియోను ప్రదర్శించి భారత వైమానిక దళం నివాళి అర్పించింది.

India President Kovind pays tribute to Kargil war heroes