Friday, April 26, 2024

ఆకలి భారతం

- Advertisement -
- Advertisement -

India ranks 94th in Global Hunger Index

 

గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 94వ స్థానంలో నిలిచిన భారత దేశం

దేశంలో 14 శాతం మందికి పోషకాహార లోపం

ఐదేళ్ల వయసులోపు బాలల్లో 37.4 శాతం స్టంటింగ్ రేటు

పెద్ద రాష్ట్రాల్లో పథకాల అమలులో వైఫల్యాలే ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయం

 

న్యూఢిల్లీ: ప్రపంచ క్షుద్బాధ సూచీ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్) 2020లో భారత దేశం 94వ స్థానంలో నిలిచింది. 107 దేశాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. తీవ్రమైన క్షుద్బాధ ఉన్న దేశాల కేటగిరీలో స్థానం పొందింది. భారత దేశంలో 14 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం మన దేశంలో ఐదేళ్ల వయసులోపు బాలల్లో 37.4 శాతం స్టంటింగ్ రేటు (ఐదేళ్లలోపు బాలలు తమ ఎత్తుకన్నా తక్కువ బరువు కలిగి ఉండడం) ఉంది. ఐదేళ్ల లోపు బాలల్లో మరణాల రేటు 3.7 శాతంగా ఉంది. అంతర్జాతీయ, ప్రాంతీయ, జాతీయ స్థాయిలలో ఆకలి గురించి సమగ్రంగా తెలుసుకోవడానికి ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఉపయోగపడుతుంది. పోషకాహార లోపం, ఐదేళ్ల లోపు బాలలు తమ ఎత్తుకన్నా తక్కువ బరువు ఉండడం, వయసుకన్నా తక్కు వ ఎత్తు ఉండడం, మరణాల రేటు ఆధారంగా ఈ సూచీ ని రూపొందిస్తారు. 100 పాయిట్ల స్కేలుపై ఈ సూచీని రూపొందిస్తారు.

సున్నా వస్తే ఆ దేశంలో ఆకలి బాధ లేనట్లుగా పేర్కొంటారు. 100 వస్తే ఆ దేశంలో ఆకలి బాధ తీవ్రంగా ఉందని పరిగణిస్తారు. కన్సర్న్ వరల్డ్, వెల్త్ హంగర్ హిల్పే సంయుక్తంగా విడుదల చేసిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 132 దేశాల సమాచారాన్ని సేకరించారు. 107 దేశాలకు ర్యాంకులు ఇవ్వడానికి అవసరమైన సమాచారం లభించింది. సమగ్ర సమాచారం లేకపోవడంవల్ల 25 దేశాల స్కోరు లెక్కించడం సాధ్యం కాలేదు.

మన పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, మైన్మార్, పాకిసాన్‌లు కూడా మనలాగే ‘సీరియస్’ కేటగిరీలోనే ఉన్నప్పటికీ మనకన్నా మెరుగైన ఎక్కువ ర్యాకింగ్‌లో ఉన్నాయి. బంగ్లాదేశ్ 75వ ర్యాంక్‌లో ఉండగా, మైన్మార్ 78, పాకిస్థాన్ 88వ ర్యాంక్‌లో ఉన్నాయి. నేపాల్ 73, శ్రీలంక 64 స్థానాలతో ‘ ఓ మోస్తరు ఆకలి (మోడరేట్ హంగర్) కేటగిరీలో ఉన్నాయి. పథకాల అమలు సక్రమంగా లేకపోవడం, పర్యవేక్షణ కొరవడడం, ఉదాసీన ధోరణి, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో సమస్య పట్ల నిర్లిప్తత భారత్ తక్కువ ర్యాకింగ్‌లో ఉండడానికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

భారత్‌తో పాటుగా బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్‌లలో ఐదేళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం ఎక్కువగా అట్టడుగు వర్గాల కుటుంబాల్లో కనిపిస్తోందని 1991నుంచి 2014 దాకా సేకరించిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో మన దేశంలో ఐదేళ్లలోపు పిల్లలో మరణాల రేటు తగ్గినప్పటికీ, పూర్తిగా పోషకాహార లోపాన్ని తొలగించడానికి జరగాల్సినంత స్థాయిలో ప్రభుత్వాల కృషి లేదని వారు అభిప్రాయపడుతున్నారు. మన దేశంలో కాగితాలపై పథకాలు చాలా అద్భుతంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి అమలు, సరయిన పర్యవేక్షణ కొరవడ్డాయని న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో సీనియర్ ఫెలోగా పని చేస్తున్న పూర్ణిమా మీనన్ అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News