Home జాతీయ వార్తలు 9 లక్షలు దాటిన కరోనా కేసులు

9 లక్షలు దాటిన కరోనా కేసులు

India reached 9 Lakhs Corona Cases 

వరసగా మూడో రోజూ 28 వేలకు పైగా పాజిటివ్ కేసులు
మృత్యువాత పడిన 553 మంది బాధితులు
మూడు రోజుల్లోనే లక్ష కొత్త కేసులు
కోలుకున్న వారు 5,71,459 మంది
మహారాష్ట్రలో 2.6 లక్షలకు పైగా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి రోజురోజుకు పెరిగిపోతోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో 26 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో 28,498 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 9,06,752కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తెలియజేసింది. నిన్న ఒక్కరోజే 553 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 23,727కు చేరుకుంది. దేశంలో కరోనా కేసులు 8 లక్షలనుంచి 9 లక్షలకు పెరగడానికి కేవలం మూడు రోజులే పట్టిందంటే వైరస్ తీవ్రత ఎంతగా ఉందో అర్థమవుతుంది. ఇక దేశంలో మొత్తం కరోనా బాధితుల్లో 5,71,459 మంది కోలుకుని డిశ్చార్జి కాగా,3,11,565 మంది చికిత్స పొందుతున్నారు. అంటే ఇప్పటివరకు 63.02 శాతం రోగులు కోలుకున్నారని ఓ అధికారి చెప్పారు. గత అయిదు రోజులుగా వరసగా ప్రతి రోజూ 26 వేలకు పైగా కేసులు నమోదవుతుండడం దేశంలో కరోనా బాధితుల సంఖ్య శరవేగంగాపెరగడానికి కారణమైంది.

దేశంలో కరోనా కేసులు లక్ష స్థాయికి చేరుకోవడానికి 110 రోజులు పడితే అక్కడినుంచి 9 లక్షలకు చేరుకోవడానికి కేవలం 56 రోజులే పట్టడం గమనార్హం. ఈ నెల 1వ తేదీనుంచి ఇప్పటివరకు దాదాపు 3,21,259 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన రెండు వారాల్లోనే దేశవ్యాప్తంగా 6,327 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర అటు కేసులు, ఇటు మరణాల విషయంలో ప్రథమ స్థానంలో ఉంది. మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే ఆరువేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 2,60,924కు చేరుకుంది. కాగా తాజాగా మృతి చెందిన 193 మందితో కలుపుకొని ఇప్పటివరకు రాష్ట్రంలో 10,482 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు తమిళనాడులో నమోదవుతున్నాయి. ఇక్కడ మొత్తం కేసులు సంఖ్య 1,42,798గా ఉంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 66 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇక్కడ మృతుల సంఖ్య 2,032కు చేరుకుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో నిన్న ఒక్క రోజే 1246 మంది కరోనా బారిన పడగా మొత్తం కేసుల సంఖ్య 1,13,740కి చేరుకుంది. తాజాగా మరణించిన 40 మందితో కలుపుకొని మృతుల సంఖ్య 3,411కు చేరుకుంది.

ఢిల్లీలో రెండో ప్లాస్మా సెంటర్

దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్19 బాధితుల కోసం రెండో ప్లాస్మా సెంటర్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం ఈ ప్లాస్మా సెంటర్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ ఆధ్యర్యంలో పని చేస్తున్న లోక్‌నాయక్ ఆస్పత్రిలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.

బెంగళూరులో సంపూర్ణ లాక్‌డౌన్

కర్నాటకలో లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులతో పాటుగా మరణాలు కూడా గణనీయంగా పెరుగుతండడంతో రాష్ట్ర రాజధాని బెంగళూరుతో పాటుగా చుట్టుపక్కల జిలాల్లో మంగళవారం సాయంత్రంనుంచి వారం రోజులు పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించాలని నిర్ణయించింది. నగరంలో బస్సు సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించినరాష్ట్రప్రభుత్వం ఐటి సంస్థలు 50 శాతం సిబ్బందితో మాత్రమే పని చేయాలని ఆదేశించింది. అయితే అత్యవసర సర్వీసులు, కిరాణా దుకాణాలను లాక్‌డౌన్‌నుంచి మినహాయించాలని నిర్ణయించింది.

బీహార్‌లో రేపటినుంచి 31 దాకా మళ్లీ లాక్‌డౌన్

బీహార్‌లో కరోనా కేసులు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతుండడంతో రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీనుంచి 31వ తేదీ వరకు మరోసారి లాక్‌డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

కశ్మీర్ బిజెపి చీఫ్‌కు కరోనా

జమ్మూ, కశ్మీర్ బిజెపి అధ్యక్షుడు రవీందర్ రైనాకు మంగళవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్టీ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్‌లు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ నెల 12వ తేదీన వీరిద్దరూ రైనాతో కలిసిశ్రీనగర్‌నుంచి ఢిల్లీకి వచ్చినందున ముందు జాగ్రత్తగా ఇద్దరూ సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లారు. జితేంద్ర సింగ్ ఒక ట్వీట్‌లో ఈ విషయం తెలియజేశారు. కాగా గత రెండు వారాల్లో తాను అయిదు సార్లు పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చినప్పటికీ ముందు జాగ్రతగా తానుకూడా స్వీయనిర్బంధంలోకి వెళ్లినట్లు రాంమాధవ్ మరోట్వీట్‌లో తెలిపారు.

India reached 9 Lakhs Corona Cases