Home జాతీయ వార్తలు అమ్మో! పాజిటివ్‌లు

అమ్మో! పాజిటివ్‌లు

India recorded 9304 COVID-19 cases in 24 hours

 

దేశంలో ఎన్నడూ లేని స్థాయికి కరోనా వ్యాప్తి, ఒక్కరోజులోనే 9304 కేసులు నమోదు

మరి 260 మరణాలు

4 రోజుల వ్యవధిలో వెయ్యి మంది మృతి
మరణాల్లో 12వ స్థానంలో భారత్
మహారాష్ట్రలో ఒకేరోజున 162 మంది బలి
ఢిల్లీ ఎయిమ్స్‌లో 480 పాజిటివ్‌లు
రక్షణ శాఖ ఉన్నతాధికారికి కూడా సోకిన వైరస్
తమిళనాడులో బుధవారం నాడు 1384 పాజిటివ్‌లు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ ఊహించనంత వేగంగా విస్తరిస్తోంది. గత రొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9,304 పాజిటివ్ కేసులు బైటపడ్డాయి. దేశంలో కరోనా కేసులు వెలుగు చూసిన తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో గురువారం ఉదయానికి దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 2,16,919కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మరణా సంఖ్య కూడా రోజురోజుకు గణనీయంగా పెరుగుతూ ఉంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 200కు పైగా మరణాలు నమోదవుతూ వస్తున్నాయి.

గడచిన 24 గంటల్లో దేశంలో 260 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటి సారి. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 6,075కు చేరుకుంది. దీంతో కరోనా మరణాల విషయంలో ప్రపంచంలో ఇప్పటివరకు 13వ స్థానంలో ఉన్న భారత్ 12వ స్థానానికి ఎగబాకింది. ఇక దేశంలో ఇప్పటివరకు కోవిడ్19 బారిన పడిన వారిలో 1,04,106 మంది కోలుకుని డిశ్చార్జి కాగా 1,06,737 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా కారణంగా మరణాల సంఖ్య గత కొన్ని రోజులుగా పెరుగుతూ ఉంది. కేవలం గత నాలుగు రోజుల్లోనే దాదాపు వెయ్యి మరణాలు సంభవించాయి.

దేశంలో కరోనా కేసులు గత 15 రోజుల్లో రెట్టింపు కాగా మరణాలు సైతం 17 రోజుల్లో రెట్టింపు అయ్యాయి. మే 18న 3,029 మరణాలు ఉండగా, జూన్ 4వ తేదీకి 6,075కు చేరుకుంది. ప్రపంచంలో 7,400 మరణాలతో కెనడా 11వ స్థానంలో ఉండగా, భారత్ తర్వాతి స్థానంలో ఉంది. కాగా కోవిడ్ 19 కేసులు అధికంగా ఉన్న దేశాల్లో మాత్రం మన దేశం ఏడో స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 122 మంది ప్రాణాలు కోల్పోగా రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2,587కు చేరుకుంది. కేసుల సంఖ్య 74,860కి పెరిగింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో మూడో వంతు ముంబయిలోనే నమోదు కావడం విషాదకరం. కాగా గడచిన 24 గంటల్లో 996 మంది కోవిడ్ బారినుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 32,329కి చేరుకుంది.

ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో 480 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలకు కరోనా పోకింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో 19 మంది వైద్యులు,38 మంది నర్సులున్నారు. కాగా కరోనా సోకిన వారిలో ముగ్గురు చనిపోయారు. ఢిల్లీలోని రక్షణ శాఖ ఉన్నతాధికారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.ఆయన ఇప్పటివరకు కోవిడ్19 కట్టడి విధుల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ అధికారి జూన్ 1 వరకు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను ప్రజలకు వివరిస్తున్నారు. తమిళనాడులోను భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్క రోజే 1384 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.12 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు వెలుగు చూసిన కేసుల సంఖ్య 27,256కు చేరుకుంది.

India recorded 9304 COVID-19 cases in 24 hours