Home జాతీయ వార్తలు కొనసాగుతున్న కరోనా ఉగ్రరూపం

కొనసాగుతున్న కరోనా ఉగ్రరూపం

India records 19,459 new covid-19 cases in 24 hours

 

తాజాగా మరో 19,459 పాజిటివ్ కేసులు నమోదు
380 మంది మృత్యువాత
5,48,318కి చేరిన పాజిటివ్ కేసులు, మరణాలు 16,475
రోజురోజుకు పెరుగుతున్న రికవరీలు
ఒక్క రోజే 12,010 మంది డిశ్చార్జి

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 15,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 19,459 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా మరో 380 మంది వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో సోమవారం నాటికి దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 5,48,318కి చేరుకోగా 16,475 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో 15,000కు పైగా కేసులు నమోదు కావడం వరసగా ఇది ఆరో రోజు. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 3, 21,722 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 2,10,120 మంది చికిత్స పొందుతున్నారు.

ఓ వైపు కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ రికవరీలు పైతం పెరుగుతుండడం ఊరట కలిగిస్తోంది. రికవరీలకు, యాక్టివ్ కేసులకు మధ్య అంతరం క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 1,11,602కు చేరుకుంది. అంటే రికవరీ రేటు 58.67గా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా గడచిన 24 గంటల్లో మొత్తం 12,010 మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా కట్టడికి రాష్ట్రాల సహకారంతో కేంద్రం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని ఆ శాఖ పేర్కొంది. కాగా మహారాష్ట్ర, ఢిల్లీలలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా 1,64,626 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటివరకు 7,429 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా ఆ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 156 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసుల సంఖ్య83,077కు చేరుకోగా,2623 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో అక్కడ 65 మంది చనిపోయారు. తమిళనాడులో మొత్త కేసుల సంఖ్య 82,275గా ఉండగా, మృతుల సంఖ్య 1079గా ఉంది. గుజరాత్ (31,320 కేసులు,1808 మరణాలు), యుపి (22,147 కేసులు,660 మరణాలు), పశ్చిమ బెంగాల్ (17,283 కేసులు,639 మరణాలు), రాజస్థాన్(17,271 కేసులు, 339 మరణాలు)లలో కూడా కరోనా ఉధృతి ఎక్కువగానే ఉంది.

మహారాష్ట్రలో అతిపెద్ద ప్లాస్మా థెరపీ ప్రాజెక్టు
కాగా దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కరోనా బారిన పడి అత్యవసర చికిత్స అవసరమైన బాధితుల ప్రాణాలు కాపాడడం కోసం భారీ ఎత్తున ప్లాస్మా థెరపీ కమ్ ట్రయల్ ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సోమవారం ప్రారంభించారు.‘ ప్లాటినా’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్మా థెరపీ ప్రాజెక్టు అని రాష్ట్ర వైద్య విద్యా శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఈ శాఖ పరిధిలోని 17 వైద్య కళాశాలలతో పాటుగా ముంబయిలోని నగర మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని నాలుగు మెడికల్ కాలేజిల్లో ట్రయల్స్ నిర్వహిస్తారు. దీని ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న కనీసం 500 మంది బాధితుల ప్రాణాలను కాపాడాలన్నది తమ లక్షమని ఆయన చెప్పారు. బాధితులందరికీ 200 మిల్లీలీటర్ల ప్లాస్మా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని కూడా ఆ అధికారి చెపప్పారు.

పుదుచ్చేరి సిఎంకు నెగటివ్
పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణ స్వామి కార్యాలయంలో క్లర్క్ కరోనా బారిన పడడడంతో అప్రమత్తమైన అధికారులు ముఖ్యమంత్రితో పాటుగా ఆయన నివాసంలోని సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజాగా వచ్చిన రిపోర్టుల్లో ముఖ్యమంత్రికి నెగటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ వారం రోజులు ఐసొలేషన్‌లో ఉండాలని అధికారులు ఆయనకు సూచించారు.

హర్యానా బిజెపి ఎంఎల్‌ఎకు కరోనా
హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా థానేసర్ నియోజకవర్గం బిజెపి ఎంఎల్‌ఎ సుభాష్ సుధా కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండడంతో గురుగ్రామ్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన మీడియా సహాయకుడు వెల్లడించారు. దీంతో సుభాష్ సుధా కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌కు తరలించారు. కాగా ఈ నెల 21న సూర్య గ్రహణం రోజున బ్రహ్మ సరోవర్ ఒడ్డున నిర్వహించిన మతపరమైన కార్యక్రమంలో ఎంఎల్‌ఎ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో సాధువులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు సహా దాదాపు 200 మంది పాల్గొన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో వీరందరినీ గుర్తించే పనిలో అధికారులు పడ్డారు.

India records 19,459 new covid-19 cases in 24 hours