Home జాతీయ వార్తలు ఒమిక్రాన్ కేసులు @21

ఒమిక్రాన్ కేసులు @21

India records 21 omicron variant cases

 

ఒక్క రోజే వెలుగు చూసిన 17 కొత్త కేసులు
జైపూర్‌లో ఒకే కుటుంబంలో 9 మందికి పాజిటివ్
మహారాష్ట్రలో వైరస్ బారిన పడిన ఏడుగురు, ఢిల్లీలో ఒకరు

న్యూఢిల్లీ: భారత్‌లోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విలయం సృష్టిస్తోంది. ఆదివారం ఒక్క రోజే 17 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఇందులో 9 కేసులు రాజస్థాన్‌లోని జైపూర్ ఆదర్శ నగర్‌లో వెలుగు చూశాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మరో ఏడు మహారాష్ట్రలోని పుణెలో నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒక వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదయిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరుకుంది. జైపూర్‌లో వెలుగు చూసిన తొమ్మిది కేసులు ఒకే కుటుంబానికి చెందినవారు. వీరంతా ఇటీవల దక్షిణాఫ్రికానుంచి వచ్చారు. అనంతరం వారికి నిర్వహించిన పరీక్షల్లో ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. ఒక్క సారిగా భారీ సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు బయటపడిన నేపథ్యంలో నాగౌర్‌లోని రోహిసా ప్రాంతంలో రాజస్థాన్ ప్రభుత్వం కర్ఫూ విధించింది.

అలాగే నైజీరియా నుంచి వచ్చిన మహారాష్ట్రలోని పింప్రిచించ్వాడ్‌కు చెందిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆమె సోదరుడు,అతడి ఇద్దరు కుమార్తెల్లో ఈ వేరియంట్ వెలుగు చూసింది. కాగా మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెల్లో ఒకరు, మహిళ సోదరుడు పూర్తి టీకా తీసుకున్న వారు కావడం గమనార్హం. వీరిని కలిసిన 13 మందిని గుర్తించడం జరిగిందని, వారికి కూడా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మహిళకు మాత్రం స్వల్ప లక్షణాలుండగా, మిగతా వారిలో ఎలాంటి లక్షణాలు లేవని కూడా వారు చెప్పారు. వీరంతా నవంబర్ 24న నైజీరియాలోని లాగోస్‌నుంచి వచ్చారు. అందరికీ పింప్రి చించ్వాడాలోని జిజామాత ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు, అందరూ నిలకడగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.. అలాగే ఫిన్లాండ్‌నుంచి పుణె వచ్చిన మరోవ్యక్తిలోనూ ఈ వైరస్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

మరో వైపు టాంజానియానుంచి ఢిల్లీ వచ్చిన 37 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. రాంచీలో నివసిస్తున్న ఈ వ్యక్తి వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొని ఉండడం గమనార్హం. ఢిల్లీ చేరుకున్న తర్వాత రాంచీకి కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాల్సి ఉన్న ఆ వ్యక్తి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శాంపిల్స్ ఇచ్చినందున అతడ్ని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఇప్పటివరకు 17 మంది కొవిడ్19 పేషెంట్లు, వారిని కలిసిన ఆరుగురిని ఈ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ చెప్పారు. కాగా ఇప్పటికే కర్నాటకలో రెండు, గుజరాత్‌లో ఒకటి, ముంబయిలో మరో కేసు చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయిన విషయం తెలిసిందే.

దేశంలో ఇప్పటివరకు నమోదయిన కేసులు
రాజస్థాన్     9
మహారాష్ట్ర    8
కర్నాటక     2
గుజరాత్     1
ఢిల్లీ          1
మొత్తం      21

India records 21 omicron variant cases