Home జాతీయ వార్తలు ఆగని కరోనా మహమ్మారి విజృంభణ

ఆగని కరోనా మహమ్మారి విజృంభణ

India records 55,078 Corona positive cases

 

గడచిన 24 గంటల్లో 55,078 పాజిటివ్ కేసులు
మొత్తం కేసుల సంఖ్య 16,38,870కు చేరిక
వైరస్ కాటుకు మరో 779 మంది బలి
మరణాల్లో ఇటలీని దాటేసిన భారత్
మరింత మెరుగుపడిన రికవరీ రేటు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం దాదాపు 50 వేల కేసులు కొత్తగా నమోదవుతూ ఉన్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో 55,078 పాజిటివ్ కేసులు నమోదైనాయి. వరసగా రెండో రోజు కూడా 50 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూడడం గమనార్హం. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 16,38,870కి చేరుకుంది. దేశంలో కరోనా కేసులు 15 లక్షలకు చేరుకున్న రెండు రోజుల్లోనే 16 లక్షలను దాటిపోవడం వైరస్ ఉధృతి ఏ స్థాయిలో ఉందో అద్దం పడుతోంది. మరోవైపు మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ దాదాపు 700 మంది కోవిడ్ బాధితులు మృత్యువాత పడుతున్నారు.

తాజాగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 779మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 35,747కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో వైపు దేశంలో కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 10,57,805 మందికోలుకుని ఇళ్లకు చేరుకోగా, 5,45,318 మంది చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 64.54 శాతానికి పెరగ్గా మరణాల రేటు మరికాస్త తగ్గి 2.18 శాతానికి చేరుకుంది. కాగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 1,88,32,970 శాంపిల్స్‌ను పరీక్షించడం జరిగిందని. గురువారం ఒక్క రోజే 6,42,588 శాంపిల్స్‌ను పరీక్షించారని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) తెలిపింది. తాజాగా సంభవించిన మరణాల్లో మహారాష్ట్రలో 266 చోటు చేసుకోగా, తమిళనాడులో 97 మంది, కర్నాటకలో 83 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 68 మంది, ఉత్తరప్రదేశ్‌లో 57 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 14,728 మంది మృతి చెందగా ఢిల్లీలో 3,936 మంది, తమిళనాడులో 3,838మంది, గుజరాత్‌లో 2,418 మంది, కర్నాటకలో 2,230 మంది, ఉత్తరప్రదేశ్‌లో1,587 మంది, పశ్చిమ బెంగాల్‌లో 1,536 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 1,281 మంది, మధ్యప్రదేశ్‌లో 857 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కరోనా మరణాలు సంభవించిన దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానానికి చేరుకుంది.35,152 మరణాలతో ఇప్పటివరకు ఐదో స్థానంలో ఉన్న ఇటలీ ఆరోస్థానానికి చేరుకుంది. అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, మెక్సికోలు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. జాన్స్‌హాప్కిన్స్‌యూనివర్సిటీ అంచనా ప్రకారం అమెరికాలో మరణాల సంఖ్య 1.52,040గా ఉండగా,బ్రెజిల్‌లో 91,263, బ్రిటన్‌లో 46,084,మెక్సికోలో 46,000 మరణాలు సంభవించాయి.

India records 55,078 Corona positive cases