Home ఎడిటోరియల్ విదేశీ సాయం విషమా?

విదేశీ సాయం విషమా?

India refusing foreign aid for flooded Kerala

వంద సంవత్సరాల కాలంలో కనివిని ఎరుగని వరదలకు గురైన కేరళకు 700 కోట్ల రూపాయల సహాయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. (సహాయంపై తానింకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని తాజాగా యుఎఇ ప్రకటించింది) మాల్దీవ్స్ కూడా 35 లక్షల సహాయం ప్రకటించింది. కేరళకు 21,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. 10000 కి.మీ రహదారులు ధ్వంసమయ్యాయి. లక్షల హెక్టార్ల పంటపొలాలు దెబ్బతిన్నాయి. ఇంకా ఆస్తినష్టం, ఇన్ ఫ్రాస్టక్చర్ నష్టం ఎంతో ఉంది. కేరళ ప్రభుత్వం 2,600 కోట్ల రూపాయలు కోరింది. కేంద్రం 600 కోట్ల రూపాయలిచ్చింది. ఇతర రాష్ట్టాల నుంచి వచ్చిన సహాయం 200 కోట్ల వరకు ఉంటుంది. కేరళకు కావలసిన సహాయం పూర్తిగా కేంద్రం అందించడం లేదు. అడిగిన మొత్తంలో చాలా తక్కువ మాత్రమే ఇచ్చింది. మరొకరు ఇస్తామంటున్న సహాయాన్ని కూడా కాదంటోంది. ఇది సముచితమా అనే విమర్శలు వస్తున్నాయి.

2004 సునామీ తర్వాత భారతదేశం ఇండోనేషియా, శ్రీలంక, థాయ్ లాండ్ దేశాలకు 26.5 మిలియన్ డాలర్ల సహాయం చేసింది. 2005లో అమెరికాలో హరికేన్ కత్రినా తర్వాత భారతదేశం అమెరికన్ రెడ్ క్రాస్ కు 5 మిలియన్ డాలర్ల సహాయం ప్రకటించింది. సహాయం చేస్తున్న దేశం సహాయం తీసుకుంటే మన ప్రతిష్ఠ దెబ్బతింటుందని వాదిస్తున్నారు. అంతర్జాతీయ సంబంధాలు ఇలా నడుస్తాయా? భారతదేశం తన స్థాయిలో ఇతర దేశాలకు సహాయం చేస్తుంది కాబట్టి ఇక సహాయం తీసుకోరాదనడం అర్ధం కాని విషయం. ప్రపంచంలో అంతర్జాతీయ సహాయం అందించే అతిపెద్ద దేశం అమెరికా. అయినా అవసరమైనప్పుడు అంతర్జాతీయ సహాయాన్ని నిస్సంకోచంగా స్వీకరిస్తుంది. ప్రకృతి బీభత్సాల సమయంలో అంతర్జాతీయ సానుభూతిని తిరస్కరించడం దౌత్యపరంగా పొరబాటన్నది అమెరికాకు తెలుసు. మరో వాదన ఏమిటంటే ఒక దేశం నుంచి సహాయాన్ని తీసుకుంటే అన్ని దేశాల సహాయాన్ని తీసుకోవలసి వస్తుందని, ఇష్టంలేని దేశాలనుంచి సహాయం తిరస్కరించలేమని వాదించడం. విదేశాంగ విధానం అన్ని

దేశాలకు ఒకేమాదిరిగా ఉంటుందా?
మన్మోహన్ ప్రభుత్వం 2004లో తీసుకున్న నిర్ణయానికి, విధానానికి కట్టుబడి విదేశీ సహాయం తీసుకోవడం లేదని చెబుతున్నారు. మన్మోహన్ ప్రభుత్వం కట్టుబడిన అప్పటి విధానం చాలా గొప్పదని ఎన్డీయే భావిస్తుందా? మన్మోహన్ ప్రభుత్వ విధానాలను ప్రతిరోజు తూర్పారబట్టే ఎన్డీయే ప్రభుత్వం ఈ విధానం విషయంలో మాత్రం అత్యంత పవిత్రమైన మార్చరాని విధానంగా ఎందుకు మాట్లాడుతోంది. మాల్దీవ్స్ ప్రకటించిన 34 లక్షల సహాయం చాలా చిన్నదే కావచ్చు. కాని ఆ సహాయాన్ని తీసుకుంటే మాల్దీవ్స్ తో దౌత్యపరమైన సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందన్నది కూడా గమనించాలి.

విదేశీ ప్రభుత్వాల నుంచి వచ్చే సహాయం తీసుకోం, కాని విదేశీ స్వచ్ఛంద సంస్థల నుంచి సహాయం వస్తే తీసుకుంటామని చెప్పడం కూడా విచిత్రమైన వాదనే. ఎలా తీసుకున్నా అది విదేశీ సహాయమే. భారత ప్రతిష్ఠ గురించి మాట్లాడుతున్నప్పుడు రెండు రకాల విదేశీ సహాయాలను కూడా ఒకే గాటన కట్టవలసి ఉంటుంది. ఎలా తీసుకున్నా పుచ్చుకునే తరగతే కదా. మేం ఇచ్చేవాళ్ళమే కాని పుచ్చుకునే వాళ్ళం కాదని ఒకవైపు చెబుతూ, మరోవైపు విదేశీ ప్రభుత్వాలు కాదు, స్వచ్ఛంద సంస్థలు వగైరా నుంచి ఇస్తే పుచ్చుకుంటాం అన్నడంలో వైరుధ్యం హాస్యాస్పదంగా లేదా?
ప్రపంచంలో ఇప్పుడు ఒంటరిగా స్వయంసమృద్ధితో మనుగడ అనేది ఏ దేశానికికైనా సాధ్యం కాదు. ప్రతి దేశం మరో దేశంపై ఏదో ఒక రూపంలో ఆధారపడుతుంది. దేశ ప్రతిష్ఠ పేరు చెప్పి సానుభూతితో ప్రకటించిన సహాయాన్ని తిరస్కరించడం వల్ల దౌత్యపరమైన నష్టాలే తప్ప లాభాలు లేవు. అవసరమైనప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా ఇతర దేశాలకు ఎలా సహాయపడతామో అదేవిధంగా అవసరమైనప్పుడు ఎలాంటి సంకోచమూ లేకుండా సహాయాన్ని తీసుకోవడము కూడా జరగాలి. అప్పుడే ప్రపంచంలో విభిన్న దేశాల మధ్య సహకార భావన కొనసాగుతుంది.

కేరళకు విదేశాల నుంచి వచ్చే సహాయాన్ని తిరస్కరించడం పై ఇంత చర్చ జరగడానికి మరో ముఖ్యమైన కారణం సోషల్ మీడియాలో కేరళ వరదబాధితులకు వ్యతిరేకంగా పోటెత్తుతున్న విద్వేష ప్రచారం. కేరళలో లక్షలాది నిరాశ్రయులై తినడానికి తిండి, తాగడానికి నీరు లేక అలమటిస్తున్న వరదబీభత్సంలో సానుభూతి చూపించే బదులు తగిన శాస్తి జరిగిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కేరళ ప్రజలు గొడ్డుమాంసం తింటారు కాబట్టి వారికి తగిన శాస్తి జరిగిందని, ఉత్తరాది వారెవ్వరూ కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలివ్వరాదని, వరదల్లో చిక్కుకున్న వారి కోసం ప్రార్థించరాదని ట్వీట్లు వచ్చాయి. కేరళ ప్రభుత్వం గొడ్డుమాంసాన్ని నిషేధించలేదు కాబట్టే ఈ విపత్తు వచ్చిందని కొందరు ట్వీట్ చేశారు.

కష్టసమయంలో ఆదుకోవడం మానవత్వం. కాని ఇటీవల రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కు ఒక డైరెక్టరుగా కేంద్రప్రభుత్వం నియమించిన యస్.గురుమూర్తి ఈ ప్రకృతి విపత్తుకు దైవాగ్రహం కారణమన్నట్లు ట్వీట్ చేశాడు. శబరిమల అయ్యప్ప గుడిలో మహిళలను సుప్రీంకోర్టు అనుమతించడం వల్లనే అయ్యప్ప స్వామికి ఆగ్రహం వచ్చిందన్నట్లు రాశాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గమనించాలని, చట్టం దేవుడికన్నా ఎక్కువ కాదు మీరు అందరినీ అనుమతిస్తే, దేవుడు ఎవరినీ అనుమతించడంటూ ట్వీట్ చేశాడు.గొడ్డుమాంసం తినేవాళ్ళు కేరళవాళ్ళంటూ, కమ్యునిస్టులకు, కాంగ్రేసుకు మద్దతుదారులు కేరళవాళ్ళంటూ వారికి సహాయం చేయరాదంటూ వచ్చిన ఈ ట్వీట్ల వెనుక రాజకీయ కోణం కూడా గమనించక తప్పదు. రిజర్వు బ్యాంకు డైరెక్టరు గురుమూర్తి సంఘపరివార్ సన్నిహితుడన్నది అందరికీ తెలిసిన విషయమే. కేరళ వరదబాధితులకు వ్యతిరేకంగా మతోన్మాదంతో, రాజకీయదురుద్దేశాలతో చేస్తున్న ప్రచారానికి జవాబుగా సిపిఎం పోలీట్ బ్యూరో సభ్యురాలు బృంద కరాత్ గట్టిగా జవాబిచ్చారు.

విద్వేషం ఎంతగా వేళ్ళూనుకుందంటే మస్కట్ లో లులు హైపర్ మార్కెటులో క్యాషియరుగా పనిచేసే రాహుల్ పలాయట్టు అనే వ్యక్తి అత్యంత అసభ్యమైన ట్వీట్ చేశాడు. కేరళ వరదబాధితుల్లో మహిళలకు శానిటరీ నాప్కిన్స్ కూడా పంపించడం అవసరమన్న ట్వీటుకు జవాబిస్తూ కండోములు కూడా పంపండి వారికి అన్నాడు. వెంటనే లులు గ్రూపు అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. తాను మద్యం మత్తులో అలా అన్నానని క్షమించమని తర్వాత వేడుకున్నప్పటికీ ఉద్యోగం దక్కలేదు. ఇప్పుడు ఆలోచించవలసిన విషయమేమంటే, ఇక్కడ రిజర్వు బ్యాంకులో డైరెక్టరుగా ఉన్న గురుమూర్తిపై చర్యలేమైనా తీసుకుంటారా? అలాంటి సూచనలేమీ కనబడడం లేదు. ఈ విద్వేష ప్రచారం నేపథ్యంలో విదేశీ సహాయం తీసుకోమంటూ కేంద్రప్రభుత్వం చెబుతున్న మాటలు కేరళపై అక్కసుతో చెబుతున్న మాటలుగా కేరళ ప్రజలకు వినిపిస్తున్నాయి. కేరళ పట్ల కేంద్రం సవతిప్రేమ చూపిస్తుందన్న అభిప్రాయం బలపడుతుంది.