Home తాజా వార్తలు ఇక బౌలర్ల చేతిలోనే..

ఇక బౌలర్ల చేతిలోనే..

India second innings tied for 198 runs

 

రిషబ్ ఒంటరి పోరాటం.. భారత్ 198 ఆలౌట్
సౌతాఫ్రికా లక్షం 212
ప్రస్తుతం 101/2

కేప్‌టౌన్: సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలనే టీమిండియా కోరిక ఈసారి కూడా నెరవేరడం కష్టంగా కనిపిస్తోంది. న్యూలాండ్స్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో, చివరి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. రిషబ్ పంత్ 100 (నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేశా డు. మిగతావారు విఫలం కావడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 67.3 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. దీంతో సౌతాఫ్రికాకు విజయం కోసం 212 పరుగులు మాత్రమే అవసరమయ్యారు. ఇక లక్షఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే సౌతాఫ్రికా మరో 111 పరుగులు చేయాలి. భారత బౌ లర్లు అసాధారణ రీతిలో చెలరేగితే తప్ప ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టుకే గెలుపు అవకాశాలు అ ధికంగా కనిపిస్తున్నాయి. నాలుగో రోజు టీమిండియా బౌలర్లు ఎలా రాణిస్తారనే దానిపైనే జట్టు గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.

పీటర్సన్ దూకుడు..
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఆశించిన స్థాయిలో శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఐడెన్ మార్‌క్రామ్ 4 ఫోర్లతో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా 23 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన కీగన్ పీటర్సన్ దూకుడైన బ్యాటింగ్‌తో భారత బౌలర్లను హడలెత్తించాడు. అతను ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. మరోవైపు కెప్టెన్ డీన్ ఎల్గర్ కుదురుగా ఆడి అతనికి సహకారం అందించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఎల్గర్ 3 ఫోర్లతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన పీటర్సన్ 61 బంతుల్లో ఏడు ఫోర్లతో 48 చేసి అజేయంగా నిలిచాడు.

రిషబ్ ఒంటరి పోరాటం..
అంతకుముందు 57/2 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. పుజారా (9)ను జాన్‌సెన్ వెనక్కి పంపాడు. ఆ వెంటనే రహానె (1) కూడా ఔటయ్యాడు. దీంతో భారత్ 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెప్టెన్ విరాట్ కోహ్లి, వికెట్ కీపర్ రిషబ్ పంత్ తమపై వేసుకున్నారు. ఇద్దరు సౌతాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ జోడీని విడగొట్టేందుకు సౌతాఫ్రికా బౌలర్లు చాలా సేపటి వరకు నిరీక్షించాల్సి వచ్చింది. కోమ్లి డిఫెన్స్‌కే పరిమితం కాగా, రిషబ్ ధాటిగా ఆడాడు.

ఇద్దరు కలిసి లంచ్ విరాట్ సమయానికి భారత్ స్కోరును 4 వికెట్లకు 130 పరుగులకు చేరింది. అయితే ఆ తర్వాత సౌతాఫ్రికా బౌలర్లు విజృంభించారు. కెప్టెన్ కోహ్లి 143 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. జట్టును ఆదుకుంటారని భావించిన అశ్విన్ (7), ఠాకూర్ (5), ఉమేశ్ (౦), షమి (0), బుమ్రా (౦) నిరాశ పరిచారు. ఇక ఒంటరి పోరాటం చేసిన రిషబ్ 139 బంతుల్లో 6 ఫోర్లు, మరో నాలుగు సిక్సర్లతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ స్కోరు 198 పరుగులకు చేరింది. సౌతాఫ్రికా బౌలరల్లో జాన్‌సెన్ నాలుగు, రబాడ, ఎంగిడి మూడేసి వికెట్లు పడగొట్టారు.