Friday, March 29, 2024

రోజు రోజుకూ కరోనా ఉగ్రరూపం..

- Advertisement -
- Advertisement -

దేశంలో ఒక్క రోజే 28,637 పాజిటివ్ కేసులు, 551 మరణాలు
మహారాష్ట్రలో 10 వేలు దాటిన మరణాలు
మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో 16మందికి వైరస్
బిగ్ బి ఫ్యామిలీతోపాటు అనుపమ్ ఖేర్ తల్లి, కుటుంబ సభ్యులకూ పాజిటివ్
కర్నాటక మంత్రికీ కరోనా

న్యూఢిల్లీ: దేశంలో కరోనామహమ్మారి రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తూ ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 25 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 28,637 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 8,49,553కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా శనివారం 551 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 22,674కు చేరుకుంది. దేశంలో కరోనా బారిన పడిన మొత్తం బాధితుల్లో 5,34,620 మంది కోలుకోగా, 2,92,258 మంది చికిత్స పొందుతున్నారు. శనివారం ఒక్క రోజే 19,235 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 62.93 శాతం మంది రోగులు కోలుకున్నారని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. దేశంలో కరోనా కేసులు 26,000కు పైగా నమోదు కావడం వరసగా ఇది మూడో రోజు. ఈ నెల 11వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 1,15,87,153 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్)తెలియజేసింది. నిన్న ఒక్క రోజే 2,80,151 శాంపిల్స్‌ను పరీక్షించారు. గత కొన్ని రోజులుగా దేశంలో అనేక నగరాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో ఆయా రాష్ట్రప్రభుత్వాలు తిరిగి పూర్తి లాక్‌డౌన్‌ను విధిస్తున్నాయి. తాజాగా బెంగళూరులో ఈ నెల 14నుంచి వారం రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించారు.

మహారాష్ట్రలోనూ అదే తీవ్రత
మరో వైపు మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. అత్యధిక కేసులు, మరణాలతో అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది.నిత్యం రాష్ట్రంలో 7,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా శనివారం ఒక్క రోజే 8,139 పాజిటివ్ కేసులు, 228 మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్త ం కేసుల సంఖ్య 2,46,600కు చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు 10,116కు చేరుకుంది. దేశవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో 34 శాతం ఒక్క మహారాష్ట్రలోనే చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అటు తమిళనాడు, ఢిల్లీలో కూడా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. తమిళనాడులో శనివారం తాజాగా 3965 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 1.34,226కు చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు 1898 మంది మృత్యువాత పడ్డారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలోను తాజాగా 1781 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1.10,921గా ఉంది. వీరిలో ఇప్పటివరకు3,334 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ (40,941 కేసులు,2,032 మరణాలు), యుపి(35,092 కేసులు, 913 మరణాలు) కర్నాటక (36,216 కేసులు,613 మరణాలు), పశ్చిమ బెంగాల్ (27,235 కేసులు,906 మరణాలు)లలో కూడా కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగానే ఉంది.

రాజ్‌భవన్‌కూ కరోనా సెగ
మహారాష్ట్ర రాజ్‌భవన్‌కూ కరోనా సెగ సోకింది. రాజ్‌భవన్ సిబ్బందిలో 16 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో గవర్నర్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఖండించారు. తాను బాగానే ఉన్నానని, స్వీయ నిర్బంధంలోకి వెళ్లలేదని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. కరోనాకు సంబంధించిన పరీక్షలు జరిపించుకోగా నెగెటివ్ వచ్చినట్లు, కోవిడ్ లక్షణాలు కూడా లేవని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. తాను సామాజిక దూరం, మాస్క్ ధరించడం లాంటి కరోనా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ విధులు నిర్వర్తిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. కాగా పాజిటివ్ వచ్చిన సిబ్బందిని రాజ్‌భవన్ ఆవరణలోనే ఉన్న వారి నివాసాల్లో క్వారంటైన్‌లో ఉంచినట్లు ఒక అధికారి తెలిపారు. రాజ్‌భవన్‌లోని ఇద్దరికి ఇటీవల కరోనా సోకడంతో అధికారులు మిగతా సిబ్బందికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. వంద మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 14 మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో రాజ్‌భవన్‌లోని సీనియర్ సిబ్బంది కూడా ఉన్నారని ఆ అధికారి చెప్పారు.

అనుపమ్ ఖేర్ కుటుంబ సభ్యులకు పాజిటివ్
కాగా మరో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తల్లితో పాటుగా మిగతా కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే తనకు మాత్రం నెగెటివ్ వచ్చిందని ఖేర్ స్వయంగా ఓ ట్వీట్‌లో తెలియజేశారు. తన తల్లి దులారీ, సోదరుడు రాజు, ఇతర కుటుంబ సభ్యులకు స్వల్పంగా కరోనా లక్షణాలున్నాయని, తల్లిని ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నట్లు ఖేర్ తెలిపారు. మిగతా వారంతా హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు.

మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్‌కూ వైరస్
మాజీ టెస్ట్ క్రికెటర్ చేతన్ చౌహాన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయనను లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆస్పత్రిలో చేర్చారు. 72 ఏళ్ల చౌహాన్ శుక్రవారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. కాగా ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

కర్నాటక మంత్రికి కరోనా
కర్నాటక పర్యాటక శాఖ మంత్రి సి.టి రవికి కరోనా సోకింది. ఆయను ఆదివారం స్వయంగా ఈ విషయం తెలిపారు. గత వారం రోజుల్లో తాను రెండు సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నానని, మొదటి సారి నెగెటివ్ రాగా, రెండోసారి పాజిటివ్ వచ్చిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అయితే గతంలో చేసిన రెండు పరీక్షల్లో ఒకటి నెగెటివ్ వచ్చినందున మూడోసారి పరీక్ష చేయించుకోవడానికి మంత్రి సిద్ధమవుతున్నారు. కర్నాటకలో కరోనా సోకిన తొలి మంత్రి రవి కావడం గమనార్హం.

ఐశ్వర్య, ఆరాధ్యలకూ పాజిటివ్

బాలీవుడ్ సూపర్‌స్టార్ బిగ్‌బీ ఇంట్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. శనివారం అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు కరోనా నిర్ధారణ కాగా తాజాగా అమితాబ్ కోడలు ఐశ్వర్యా రాయ్, మనుమరాలు ఆరాధ్యలకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే ఆదివారం చెప్పారు. బిగ్ బీ కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా శనివారం అమితాబ్, అభిషేక్‌కు సంబంధించిన రిపోర్టులు మాత్రమే వచ్చాయి. మిగతా వాటిలో కొన్ని ఫలితాలు ఆదివారం రాగా ఐశ్వర్య, ఆమె కుమార్తె ఆరాధ్యలకు పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే జుహూలోని అమితాబ్ నివాసాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఇంటిలోని వారందరినీ 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచారు. మున్సిపల్ సిబ్బంది అమితాబ్ నివాసాన్ని, కార్యాలయాన్ని శానిటైజ్ చేస్తున్నారు. కాగా నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్‌లకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

India seen 28637 Record new corona cases in 24hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News