Saturday, April 20, 2024

చైనాకు దీటుగా ఎదగాలి

- Advertisement -
- Advertisement -

India should develop on par with China

 

ప్రపంచంలో రెండవ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా తనను ఎవరూ ఏమీ చేయలేరని, చేయదలిస్తే తన ఉక్కు గోడకు తల గుద్దుకోవలసి వస్తుందని ఇటీవల పాలక కమ్యూనిస్టు పార్టీ వందవ జయంతి సందర్భంగా చేసిన హెచ్చరిక ప్రధానంగా అమెరికానుద్దేశించిందే అయినప్పటికీ మన వంటి పొరుగు దేశానికి కూడా అది వర్తిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాన్ని గమనించిన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చైనా నుంచి ఈ బలగర్వ ప్రకటన వెలువడిన తర్వాత ఈ నెల 4న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జన్మదినం సందర్భంగా ఆయనకు మోడీ శుభాకాంక్షలు తెలియజేశాడు. టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా జన్మ దినోత్సవాలను పురస్కరించుకొని మొన్న మంగళవారం నాడు ఆయనను మోడీ అభినందించడం కూడా విశేష వార్త అయింది. తైవాన్‌ను కలుపుకొని ఒకే చైనాను అవతరింప చేస్తామని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, పార్టీ వందవ జయంతి సందర్భంగా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో తైవాన్‌తో ఆర్థిక సహకారాన్ని ఇండియా పెంపొందించుకోవాలనే సలహా వినవస్తున్నది. దేశాలు స్వతంత్రంగా ఎదిగే క్రమంలో ఎవరితో ఎటువంటి ఇచ్చిపుచ్చుకొనే సంబంధాలను పెంచుకున్నా అభ్యంతరముండనక్కర లేదు. చైనా శత్రువులుగా భావించే అమెరికా, దలైలామా, తైవాన్‌లతో సంబంధాలను మెరుగ్గా పెనవేసుకోడం ద్వారా దాని దూకుడుకు భారత్ అడ్డుకట్టవేయాలనడం సమంజసమే. అకారణంగా మన మీదికి కాలు దువ్వుతున్న పొరుగు దేశాన్ని మనం కూడా తగు రీతిలో ఇబ్బంది పెట్టవలసిందే. ఇందులో వేరే మాటకు తావు లేదు. అయితే అదే సందర్భంలో భారత్ కూడా చైనాకు దీటైన ఆర్థిక శక్తిగా తయారు కావలసి ఉంది. అందుకు అనువైన పటిష్ఠ వ్యూహ రచన జరగాలి. దానిని పకడ్బందీగా అమలు చేయాలి. మనం సగర్వంగా ప్రకటించుకున్న ‘మేకిన్ ఇండియా’ ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ అది ఆశించినంత త్వరితంగా ఫలితాలనిచ్చే జాడలు కనిపించడం లేదు.

మన జిడిపిలో ప్రస్తుతం 17 శాతంగా ఉన్న తయారీ రంగాన్ని 25 శాతానికి తీసుకు వెళ్లాలన్న లక్షాన్ని పట్టుదలతో సాధించుకోవలసి ఉంది. చైనా స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) విలువ 14.7 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లయితే మనది 2.71 ట్రిలియన్ డాలర్లేనని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో అసంఖ్యాకంగా ఉన్న నిరుద్యోగ యువతకు సరైన ఉద్యోగాలు కల్పించి వారి శ్రమను, మేధస్సును దేశ సంపద పెంపులో సద్వినియోగపరచుకోగలిగినప్పుడే చైనాకు దీటుగా మనం ఎదగగలుగుతాము. వచ్చే తొమ్మిదేళ్లలో వ్యవసాయేతర రంగంలో 9 కోట్ల ఉద్యోగాలు కల్పించవలసి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఒక వైపు ఎగుమతులు పడిపోతున్నాయి. ఇది దేశ తయారీ రంగాన్ని నిరుత్సాహపరిచే అంశం. అవి పెరగాలంటే మన సరకుల నాణ్యత కూడా ఆ స్థాయిలో మెరుగుపడాలి. అలాగే తక్కువ పెట్టుబడితో ఎగుమతి ప్రాధాన్యం గల సరకుల ఉత్పత్తిని సాధించగలగాలి.

అప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో చైనా సరకులతో పోటీ పడగలుగుతాము. ఆర్థిక రంగంలో ఇంతటి గురుతరమైన బాధ్యత మనపై ఉండగా, ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాల విషయంలోనూ చైనాతో పోల్చుకుంటే మనం వెనుకబడి ఉన్నామనిపిస్తున్నది. చైనా కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీలంక ప్రభుత్వం రెండు (బంగారు, వెండి) నాణేలను విడుదల చేసిందన్న వార్త గమనించదగినది. శ్రీలంకకు విశేషమైన ఆర్థిక సాయం చేయడం ద్వారా చైనా దానిని దగ్గరకు చేర్చుకోగలిగింది. శ్రీలంక ఇప్పటికే తనకు 5 బిలియన్ డాలర్లు అప్పుండగా మరొక బిలియన్ డాలర్ల రుణాన్ని దానికి చైనా మంజూరు చేసింది. నాణేలను విడుదల చేసిన సందర్భంలో శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స మాట్లాడుతూ చైనా తమకు అత్యంత నిజాయితీ గల స్నేహితుడని అన్నారు. అంతేగాక చైనా కమ్యూనిస్టు పార్టీ గత 70 ఏళ్లలో విదేశీ సంబంధాల విషయంలో ప్రపంచానికి అతి ముఖ్యమైన సందేశాన్నిచ్చిందని పేర్కొన్నారు.

చైనా విదేశాంగ విధాన వైఖరులే దాన్ని ప్రపంచ వేదిక మీద అతి ముఖ్యమైన దేశంగా చేశాయని కూడా రాజపక్స అన్నారు. అంటే అనేక దేశాలను చేరువ చేసుకొని వాటితో మైత్రీ బంధం పటిష్ఠ పరుచుకోడంలో చైనా నాయకత్వం విజయవంతమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక దేశం బలపడడానికి ఇతర దేశాలతో, ముఖ్యంగా పొరుగునున్న వాటితో అది పెంచుకునే సంబంధాలు కూడా దోహదపడతాయి. ఒక్క శ్రీలంకతోనే కాదు నేపాల్ వంటి దేశాలతో కూడా చైనా మనకంటే చేరువలో ఉండడం గమనించవచ్చు. అందుచేత సరిహద్దు వివాదంలో మనను ఇరకాటంలో పెడుతున్న చైనాను భయపెట్టాలంటే ఆర్థికంగా భారత్‌ను ఒక మహత్తర శక్తిగా తయారు చేయడంతో పాటు ఇరుగు పొరుగులు సహా ఇతర దేశాలు మన అవసరాన్ని గుర్తించేలా చేసుకోవలసిన బాధ్యత మన పాలకులపై ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News