Home జాతీయ వార్తలు ఆకలి సూచీలో అథమం

ఆకలి సూచీలో అథమం

Global Hunger Report

 

ప్రపంచ ఆకలి నివేదికలో 103 నుంచి 102వ స్థానానికి చేరిన భారత్
పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే వెనుకబాటు

న్యూఢిల్లీ: ఆకలితో యుద్ధంలో పాకిస్థాన్‌తో పోలిస్తే భారతదేశం వెనకబడిపోయింది. ప్రపంచ ఆకలి సూచీలో 2019 (జిహెచ్‌ఐ)లో భారతదేశం స్థానం ఇప్పుడు 102. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 117 దేశాలను తీసుకుని ఆయా దేశాలలో ఆకలి సమస్య నిర్మూలనకు చేపట్టిన చర్యల ప్రతిపదికన ఈ సూచీలో ర్యాంకులు ఖరారు చేస్తారు. ఇప్పటి ర్యాంకింగ్‌లో భారతదేశం ఇరుగుపొరుగుదేశాలైన నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల కన్నా వెనుకబడింది. భారతదేశంలో ఆకలి స్థాయి హెచ్చుగా ఉండటం ఆందోళనకర పరిణామం అని సర్వే జరిపిన సంస్థల వారు తెలిపారు. ఐరిష్ సహాయ సంస్థ కన్సర్న్ వరల్డ్‌వైడ్, జర్మనీకి చెందిన వెల్ట్ హంగర్ హిల్ఫే సంస్థలు సంయుక్తంగా అధ్యయనం జరిపి ఈ ఆకలి ర్యాంక్‌లను రూపొందించారు.గత ఏడాదితో పోలిస్తే భారతదేశం ర్యాంక్ ఈసారి మరింత దిగజారింది.

 

 

2018 సంవత్సరంలో మొత్తం 119 దేశాల పరిస్థితిపై ఆరాతీయగా భారత్ స్థానం 103గా ఉండేది. ఇక 2000 సంవత్సరంలో భారతదేశ స్థానం మొత్తం 113 దేశాలతో పోలిస్తే 83గా నిలిచింది. ఇప్పుడు 117 దేశాలతో సరిపోల్చగా భారతదేశం పరిస్థితి దిగజారింది. మన పొరుగునే ఉన్న పాకిస్థాన్ ర్యాంక్ ఈసారి 8 స్థానాలు మెరుగుపడింది. పాకిస్థాన్ 94, ఇక బంగ్లాదేశ్ 88, శ్రీలంక 66 స్థానాలతో నిలిచాయి. ఇక ఆకలి సమస్యలతో తీవ్ర స్థాయిలో సతమతమవుతున్న 45 దేశాలలో భారతదేశం కూడా ఉండటం పట్ల అధ్యయన సంస్థల విస్మయాన్ని అంతకు మించి ఆందోళనను వ్యక్తం చేశాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే జిహెచ్‌ఐ ర్యాంకింగ్‌లు పతనమవుతూ వస్తున్నాయని, ఆకలి నిర్మూలన విషయంలో 2005లో ర్యాంకు సగటున 38.9గా ఉంది.

ఇక 2010లో ఇది 32కి చేరింది. ఇప్పుడు 2010 నుంచి 2019 వరకూ 30.3 పాయింట్ల మధ్యలో ఉంది. దీనిని బట్టి ఆకలి లేకుండా చేయడంలో వివిధ దేశాల ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో సరైన విధంగా వ్యవహించడం లేదనే విషయం స్పష్టం అవుతోంది. ఇప్పటి జిహెచ్‌ఐలో అగ్రస్థానంలో బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్‌లు నిలిచాయి. వీటి ర్యాంకులు ఐదు కన్నా తక్కువ స్థానంలో ఉన్నాయని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెబ్‌సైట్ ద్వారా వెల్లడైంది. భారతదేశంలో 6 నుంచి 23 నెలల వయస్సున శిశువులలో కేవలం 9.6 శాతం మందికే సరిపడా ఆహారం అందుతోంది. ఇక ఈ పసికందులలో అత్యధిక శాతం సరైన పోషకాలు దక్కని స్థితిలోనే ఉన్నారని నిర్థారించారు. భారతదేశంలో ఇటువంటి పరిణామం పట్ల ప్రపంచ స్థాయిలో ఆందోళన వ్యక్తం అయింది.

నాలుగు విధాలుగా ఆకలి స్థాయి నిర్థారణ
అంతర్జాతీయ సంస్థలు శాస్త్రీయ దృక్పథంతో ప్రపంచ ఆకలి సూచీని నాలుగు అంశాల వారిగా వారీగా నిర్థారిస్తాయి. ఆ నాలుగు అంశాలు ఇవే 1) పోషకాహార లోపం2) వయస్సుకు తగ్గ బరువు ఎత్తు ఉండకపోవడం లేదా శారీరక ఎదుగుదల లోపించడం. 3) శిశుప్రాయం దాటి ఎదుగుతున్న దశలో పౌష్టికాహార లోపం. 4) శిశు మరణాలు. ఈ అంశాలను సరైన విధంగా ప్రతిపాదికగా తీసుకుని ఆయా అంశాల్లో చర్యలు వాటి ఫలితాలను తీసుకుని ఆకలిపై పడుతున్న ప్రభావాన్ని విశ్లేసించుకుని ఈ జిహెచ్‌ఐని రూపొందించడం జరుగుతోంది. ఐదేళ్ల లోపు పిల్లల మరణాల రేటు నివారణలో భారతదేశం కొంత పురోగతిని సాధించింది.

ఏది ఏమైనా వయస్సుకు తగ్గ ఎదుగుదల ఆరోగ్యం లేకపోవడం సరైన పోషణలేకపోవడం వల్ల జరిగే పరిణామం కావడంతో భారతదేశం ఈ విషయంలో వైఫల్యాన్ని మూటగట్టుకుంది. ఈ విషయంలో 20.8 శాతం రేటుతో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది.తరచూ ఘర్షణలు, ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లే యెమెన్, జిబౌటీ వంటి దేశాలతో పోలిస్తే కూడా ఇండియా ఈ విషయంలో వెనుకబడిపోయిందని అధ్యయన నివేదికలో తెలిపారు. భారత్ ఇరుగుపొరుగుదేశాలైన నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లు కూడా ఆకలి సూచీలో ఇప్పటికీ తీవ్రస్థాయి వరుసలోనే ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. అయితే ఇండియాతో పోలిస్తే ఈ దేశాలు ఆకలిని తీర్చడంలో మెరుగుదల కనబర్చాయని వెల్లడైంది. ఇక ఆకలి సూచీలో చైనా ర్యాంకు ఇప్పుడు 25కు చేరింది. తక్కువ స్థాయి ర్యాంకు దశకు వచ్చింది. ఇక శ్రీలంక ఓ మోస్తరు స్థాయి తీవ్రత కేటగిరిలో ఉంది.

ఆరుబయట విసర్జన ఇప్పటికీ ఉంది
స్వచ్ఛ భారత్‌పై ప్రస్తావన
భారతదేశంలో ఇప్పటికీ బహిరంగ మల మూత్ర విసర్జన ఉందని నివేదికలో తెలిపారు. భారత కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం గురించి సర్వే సంస్థలు ప్రస్తావింంచాయి. ప్రధాని మోడీ ఇటీవలే భారతదేశం బహిరంగ విసర్జన రహిత (ఒడిఎఫ్) దేశంగా భారతదేశం ఘనత దక్కించుకుందని తెలిపారు. అయితే భారతదేశంలో నూతనంగా మరుగుదొడ్డు నిర్మిస్తూ వస్తున్నా, అక్కడ బహిరంగ విసర్జన ఉండనే ఉందని సర్వే సంస్థలు తెలిపాయి. ఈ పరిస్థితితో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, ప్రత్యేకించి పిల్లలు సరైన రీతిలో ఎదిగేందుకు సరైన పోషకాలను తీసుకోలేరు. వాటిని జీర్ణించుకోలేరని నివేదికలో తెలిపారు.

India slips to 102nd rank in Global Hunger Report 2019