Friday, March 29, 2024

ఆసీస్ కు భారత్ దీటైన జవాబు..

- Advertisement -
- Advertisement -

భారత్ దీటైన జవాబు
గిల్ శతకం, రాణించిన విరాట్, పుజారా
టీమిండియా 289/3, ఆస్ట్రేలియాతో చివరి టెస్టు
అహ్మదాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో, చివరి టెస్టులో ఆతిథ్య టీమిండియా దీటైన జవాబిస్తోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగుల భారీ స్కోరుకు ఆలౌటౌంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 99 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. 36/0 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అండగా నిలిచారు. ఇద్దరు కుదురుగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. అయితే 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 35 పరుగులు చేసిన రోహిత్‌ను కుహ్నెమన్ ఔట్ చేశాడు. దీంతో 74 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.

పుజారాతో కలిసి..
తర్వాత వచ్చిన సీనియర్ బ్యాటర్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారాతో కలిసి శుభ్‌మన్ పోరాటం కొనసాగించాడు. గిల్ కాస్త దూకుడుగా బ్యాటింగ్ చేయగా పుజారా తన మార్క్ డిఫెన్స్‌తో అలరించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ఆస్ట్రేలియా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పుజారా, గిల్ సమన్వయంతో ఆడడంతో భారత్ స్కోరు 150 పరుగులు దాటింది. ఈ క్రమంలో 121 బంతుల్లో 3 బౌండరీలతో 42 పరుగులు చేసిన పుజారాను మర్ఫి వెనక్కి పంపాడు. అప్పటికే గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు పుజారా 113 పరుగులు జోడించాడు.

శుభ్‌మన్ సెంచరీ
పుజారా ఔటైనా గిల్ తన జోరును కొనసాగించాడు. విరాట్ కోహ్లితో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఇదే సమయంలో శుభ్‌మన్ టెస్టుల్లో తన రెండో సెంచరీని నమోదు చేశాడు. అయితే 235 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో 128 పరుగులు చేసిన గిల్‌ను నాథన్ లియాన్ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో 245 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్‌ను కోల్పోయింది. మరోవైపు అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన విరాట్ కోహ్లి 128 బంతుల్లో ఐదు ఫోర్లతో 59 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతనికి రవీంద్ర జడేజా 16 (బ్యాటింగ్) అండగా నిలిచాడు. ఇదిలావుంటే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే టీమిండియా మరో 191 పరుగులు చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News