Home జాతీయ వార్తలు పాక్ దౌత్య అధికారికి భారత్ సమన్లు

పాక్ దౌత్య అధికారికి భారత్ సమన్లు

India summons to Pakisthan high commission

 

పాక్ దౌత్య అధికారికి భారత్ సమన్లు
ఉగ్రవాదులకు మద్దతును తక్షణం ఆపేయాలని గట్టి హెచ్చరిక

న్యూఢిల్లీ: జమ్మూ,కశ్మీర్‌లోని నగ్రోటా ఎన్‌కౌంటర్‌లో నలుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను హతమార్చి భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన వ్యవహారంలో భారత విదేశాంగ శాఖ పాకిస్థాన్ హైకమిషన్‌లోని చార్జ్ డి అఫైర్స్‌కు శనివారం సమన్లు జారీ చేసింది. పాక్ తీరుపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇకనైనా దాయాది దేశం ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడాన్ని, తమ భూభాగంలో ఉగ్రముఠాలు నిర్వహించడాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేసినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. సరిహద్దు ఉగ్రవాదం పాక్‌లో బలంగా ఉందని, దానిపై ఆ దేశం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. కశ్మీర్‌లో ప్రశాంతంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు ఇలాంటటి పథకాలు రచించి దాడులకు పాల్పడుతోందని ఆరోపించింది.

దాడులకోసం పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రిని ఉపయోగించి భారత్‌ను అస్థిర పరిచేందుకు పాక్ ప్రణాళికలు రచిస్తోందని దుయ్యబట్టింది. భారత్‌తో చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలను పాకిస్థాన్ ఏమాత్రం అమలు చేయడం లేదని ఆరోపించింది. ఈ సందర్భంగా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను ఐక్యరాజ్య సమితి నిషేధించిన విషయాన్ని విదేశాంగ శాఖ ప్రస్తావించింది. ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి పాక్ అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం నడుచుకోవాలని స్పష్టం చేసింది. పాక్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేయడం వారంరోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ నెల 14న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి భారత జవాన్లపై కాల్పులు జరిపిన ఘటనలో పాక్ దౌత్యవేత్తకు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.

మసూద్ అజర్ సోదరుడినుంచి ఆదేశాలు
జమ్మూ, కశ్మీర్‌లోని నగ్రోటా ప్రాంతంలో గత గురువారం నాడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు నలుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. గురువారం తెల్లవారుజామున జమ్మూనుంచి శ్రీనగర్ వైపు వెళ్తున్న ట్రక్కును నగ్రోటా టోల్‌ప్లాజా వద్ద తనిఖీ నిమిత్తం ఆపగా, అందులోనొ ముష్కరులు భద్రతాదళాలపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన దళాలు ఎదురు కాల్పులు జరిపి ముష్కరులను హతమార్చాయి. ఈ ఉగ్రవాదులు భారత్‌లో ముంబయి పేలుళ్ల తరహా భారీ విధ్వంసానికి కుట్రపన్నినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కాగా ఉగ్రవాదులు ఉపయోగించిన వైర్‌లెస్ సెట్, ఇతర ఆయుధాలు పాక్‌లో తయారైనవని దర్యాప్తులో తేలినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అంతేకాదు నలుగురు జైషే మహ్మద్‌ఉగ్రవాదులకు పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్ ఆపరేషనల్ కమాండర్లు ముఫ్తీ రౌఫ్ అస్గర్, కారీ జరార్‌లతో కశ్మీర్ లోయలో విధ్వంసం సృష్టించాలనే లక్షంతో ఆదేశాలు అందినట్లు కూడా వాహనంలోని జిపిఎస్ వ్యవస్థ, నలుగురు ఉగ్రవాదుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లనుంచి సేకరించిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలిసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. ముఫ్తీ అస్గర్ జైషే మహమ్మద్ చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజర్ తమ్ముడు కావడం గమనార్హం. సరిహద్దుల గుండా ఆత్మాహుతి బాంబర్లను పంపించడం ద్వారా భారత్‌లో విధ్వసం సృష్టించడానికి పాకిస్థాన్ జైషే మహమ్మద్ లాంటి అంతర్జాతీయ ఇస్లామిస్టు జిహాదీ గ్రూపులను ఉపయోగిస్తున్నట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి.

అంతేకాదు బాలాకోట్‌లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని జైషే మహ్మద్‌కు అప్పగించాలని కూడా పాక్ భద్రతా ఏజన్సీలు నిర్ణయించినట్లు కూడా తెలుస్తోంది. బాలాకోట్ ఉగ్రవాద శిక్షణా శిబిరంపై ఏడాదిన్నర క్రితం భారత వైమానిక దళ యుద్ధ విమానాలు మెరుపు దాడి చేసి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి కూడా ఈ శిబిరాన్ని పాక్ పూర్తిగా మూసి వేయలేదు కానీ ఉగ్రవాద శిక్షణా కార్యకలాపాలు తక్కువ మోతాదులో జరుగుతూ ఉన్నాయి. కాగా ఇప్పుడు ఈ శిబిరాన్ని జైషే మహమ్మద్‌కు అప్పగించడం ద్వారా మరోసారి దీన్ని యాక్టివ్ చేయాలని పాక్ భద్రతా ఏజన్సీలు యోచిస్తుండడం గమనార్హం.

India summons to Pakisthan high commission