Home అంతర్జాతీయ వార్తలు 17.5 మిలియన్ల ప్రవాస భారతీయులు

17.5 మిలియన్ల ప్రవాస భారతీయులు

Migrants

 

వలసదారుల్లో అగ్రస్థానంలో ఇండియా
వెల్లడించిన సమితి నివేదిక

యునైటెడ్ నేషన్స్: ఇతర దేశాలకు వలసవెళ్లేవారి విషయంలో భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో అగ్రస్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి 2019కి విడుదల చేసిన సరికొత్త అంచనాలు చెబుతున్నాయి. 17.5 మిలియన్ల ప్రవాస భారతీయులు ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నారు. అన్ని దేశాల నుంచి వలస వెళ్లిన వారు మొత్తం 272 మిలియన్లున్నారు. ఆర్థిక, సామాజిక వ్యవహారాల ఐక్యరాజ్య సమితి డిపార్ట్‌మెంట్ (డిఇఎస్‌ఎ)కి చెందిన జనాభా విభాగం విడుదల చేసిన ‘ఇంటర్నేషనల్ మైగ్రెంట్ స్టాక్ 2019’ డాటా ఈ వివరాల్ని అందించింది. ప్రపంచంలో అన్ని దేశాలు, ప్రాంతాల నుంచి వయసు, లింగభేదం, సంతతి పరంగా అంతర్జాతీయ వలసదారుల తాజా గణాంకాలను ఇందులో పొందుపరిచారు.

విదేశాల్లో పుట్టిన లేదా జనాభా లెక్కల వల్ల తెలిసిన విదేశీ జనాభా, జనాభా నమోదు పట్టికలు లేదా జాతీయ ప్రాతినిధ్య సర్వేల ఆధారంగా రూపొందించిన అధికారిక జాతీయ గణాంకాల ప్రకారం ఈ తాజా అంచనాల్ని రూపొందించారు. అంతర్జాతీయంగా వలసదారుల సంఖ్యను పరిశీలిస్తే మొత్తం వలసదారుల సంఖ్యలో మూడింట ఒక వంతు మంది కేవలం పది దేశాల వారే ఉన్నారు. ప్రవాసుల విషయంలో అంతర్జాతీయంగా 2019లో 17.5 మిలియన్ల మంది వలసదారులతో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. అలాగే ఇండియాలో కూడా 5.1 మిలియన్లమంది ప్రవాసులున్నారు. ఇతర దేశాల వలస గణాంకాలు ఇలా ఉన్నాయి. 11.8 మిలియన్ల వలసదారులతో మెక్సికో రెండో స్థానంలో నిలిచింది.

చైనా (10.7 మిలియన్లు), రష్యా (10.5), సిరియా (8.2), బంగ్లాదేశ్ (7.8), పాకిస్థాన్ (6.3), ఉక్రెయిన్ (5.9), ఆఫ్ఘనిస్థాన్ : 5.1 మిలియన్లు.పెరిగిన శరణార్థులు 2010 2017 మధ్యకాలంలో శరణార్థులు, ఆశ్రయం కోరినవారి సంఖ్య 13 మిలియన్లు పెరిగింది. ప్రపంచంలో శరణార్థులు, ఆశ్రయం కోరిన వారి మొత్తం సంఖ్యలో ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియాల్లోనే ఎక్కువ మంది అంటే 46 శాతం ఉన్నారు. వయసుపరంగా చూస్తే ప్రతి ఏడుగురు అంతర్జాతీయ వలసదారుల్లో ఒకరు 20 ఏళ్ల లోపువారే.

India tops list of migrants living abroad