Saturday, April 20, 2024

హోరాహోరీ ఖాయం

- Advertisement -
- Advertisement -

అందరి కళ్లు భారత్‌ఆసీస్ సిరీస్ పైనే..

మన తెలంగాణ/క్రీడా విభాగం : ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్‌ఆస్ట్రేలియా క్రికెట్ సిరీస్‌కు త్వరలోనే తెరలేవనుంది. ఇరు జట్లలోనూ స్టార్ క్రికెటర్లు ఉండడంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. కరోనా బయట పడిన తర్వాత ప్రపంచ క్రికెట్‌లో జరుగుతున్న అతి పెద్ద సిరీస్ ఇదే కావడంతో అందరి దృష్టి దీనిపైనే నిలిచింది. భారత్ చివరి సారిగా దక్షిణాఫ్రికాతో అంతర్జాతీయ సిరీస్ ఆడింది. కరోనా కారణంగా సిరీస్ మధ్యలోనే రద్దయ్యింది. అప్పటి నుంచి టీమిండియా ఒక్క అంతర్జాతీయ సిరీస్‌ను కూడా ఆడనే లేదు. అయితే యూఎఇ వేదికగా జరిగిన ఐపిఎల్‌లో పలువురు టీమిండియా క్రికెటర్లు ఆడారు. దీంతో వీరికి కావాల్సినంత ప్రాక్టీస్ లభించింది. కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్‌లో ఇది కలిసి వస్తుందనే నమ్మకంతో భారత క్రికెటర్లు ఉన్నారు. ఇక ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ఆటగాళ్లు సయితం ఐపిఎల్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్, కమిన్స్, డేవిడ్ వార్నర్, మాక్స్‌వేల్, పాటిన్సన్, స్టోయినిస్ తదితరులు ఐపిఎల్‌లో ఆడడం కంగారూలకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఇదిలావుండగా ఇరు జట్ల మధ్య పూర్తి ఫార్మాట్‌లో సిరీస్ జరుగనుంది. మూడు వన్డేలు, మరో మూడు ట్వంటీ20 మ్యాచ్‌లతో పాటు నాలుగు టెస్టుల్లో ఇరు జట్లు తలపడనున్నాయి. దాదాపు రెండున్నర నెలలకు పైగా సిరీస్ సాగనుంది. కిందటి సిరీస్‌తో పోల్చితే ఈసారి పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం. గతంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. అప్పట్లో స్టీవ్ స్మిత్, వార్నర్‌లు జట్టులో లేరు. ఈసారి వీరితో పాటు లబూషేన్ జట్టులో ఉన్నాడు. అంతేగాక ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ బౌలర్లుగా పేరు తెచ్చుకున్న కమిన్స్, స్టార్క్, హాజిల్‌వుడ్, లియాన్ తదితరులు ఉండనే ఉన్నారు. దీంతో ఈసారి ఆస్ట్రేలియాను ఓడించడం టీమిండియాకు అనుకున్నంత తేలిక కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండడం లేదు. కేవలం ఒక టెస్టు మ్యాచ్ మాత్రమే కోహ్లి ఆడనున్నాడు. మిగతా మ్యాచ్‌లకు అతను జట్టుకు దూరం కానున్నాడు. అయితే కోహ్లి లేకున్నా భారత్ బలంగానే కనిపిస్తోంది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్‌కే మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపిఎల్‌లో ఆడిన అనుభవం భారత్‌కు బలంగా మారనుంది. ఐపిఎల్‌లో లోకేశ్ రాహుల్, శిఖర్ ధావన్, అయ్యర్, హార్దిక్ నిలకడగా రాణించారు. అంతేగాక బుమ్రా, సైని, షమి, చాహల్ బౌలంగ్‌లో సత్తా చాటారు. దీంతో ఈసారి భారత్ భారీ ఆశలతో సిరీస్‌కు సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News