Home Default ఇక ధనాధన్ సమరం

ఇక ధనాధన్ సమరం

 బోణీ కోసం కోహ్లిసేన
 ప్రతీకారం కోసం కివీస్
 నేడు తొలి టి-20

NZన్యూఢిల్లీ: న్యూజిలాండ్‌పై ఇప్పటి వరకు ఒక్క ట్వంటీ20లో కూడా విజయం సాధించని టీమిండియా ఈసారి ఆ లోటును పూడ్చుకోవాలనే పట్టుదలతో ఉంది. బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగే తొలి టి20 మ్యాచ్‌కు భారత్ సమరోత్సాహంతో సిద్ధమైంది. వన్డే సిరీస్‌ను గెలిచిన టీమిండియా మూడు మ్యాచ్‌ల టి20ను సైతం దక్కించుకోవాలనే లక్షంతో ఉంది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకున్న భారత్ టి20 మ్యాచుల్లో మాత్రం ఒక్కసారి కూడా కివీస్‌ను ఓడించలేదు. ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదింటిలో భారత్ ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయ్యింది. టెస్టు క్రికెట్ ఆడే అన్ని జట్లను ఓడించిన టీమిండియా ఒక్క కివీస్‌పై మాత్రమే టి20ల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. ఇది వినేందుకే అనూహ్యమే అయినా కాదనలేని సత్యం. కానీ, ఈసారి భారత్ నిరీక్షణకు తెరపడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్‌లో జయకేతనం ఎగుర వేయాలనే పట్టుదలతో కోహ్లి సేన ఉంది. ఇటీవల కాలంలో వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియాను ఓడించి సిరీస్‌ను దక్కించుకోవడం ఈసారి న్యూజిలాండ్‌కు కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. అయితే కివీస్ జట్టులో టి20 స్పెషలిస్ట్‌లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఎంతో మంది టి20 స్పెషలిస్ట్‌లు జట్టులో ఉన్నారు. దీంతో భారత్‌కు ఈ సిరీస్‌లో కూడా గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది.
జోరుమీదున్నారు..
వన్డే సిరీస్‌లో మెరుపులు మెరిపించిన ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లిలు టి20ల్లోనూ అదే జోరును కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారు. చివరి వన్డేలో వీరిద్దరు సెంచరీలతో కదంతొక్కారు. కోహ్లి సిరీస్‌లో రెండు శతకాలతో అదరగొట్టాడు. టి20ల్లోనూ చెలరేగేందుకు తహతహలాడుతున్నాడు. అతను విజృంభిస్తే అడ్డుకోవడం కివీస్ బౌలర్లకు అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. టి20లలో అద్భుత రికార్డును కలిగిన కోహ్లి చెలరేగితే కివీస్‌పై బోణి కొట్టడంతో భారత్‌కు కష్టమేమి కాదు. ఇప్పటికే ఈ ఫార్మాట్‌లో విరాట్ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. దీంతో అతనితో న్యూజిలాండ్ బౌలర్లకు ప్రమాదం పొంచిఉందని చెప్పక తప్పదు. ఇక, రోహిత్‌ను కూడా తక్కువ అంచనా వేసే ప్రసక్తే లేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా రోహి సొంతం. అతన్ని కట్టడి చేయాలంటే ప్రత్యర్థి బౌలర్లు తీవ్రంగా శ్రమించక తప్పదు. మరోవైపు శిఖర్ ధావన్ కూడా ప్రమాదకర ఆటగాడే. చివరి వన్డేలో విఫలమైన ధావన్ టి20ల్లో మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ ముగ్గరిలో ఏ ఇద్దరు రాణించినా టీమిండియాకు భారీ స్కోరు నల్లేరుపై నడకే. ఇక, కెఎల్.రాహుల్, కొత్త ఆటగాడు శ్రేయస్ అయ్యర్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యలను కూడా తక్కువ అంచన వేసే ప్రసక్తేలేదు. టి20ల్లో వీరికి అద్భుత రికార్డు ఉన్న విషయం తెలిసిందే. తమదైన రోజు ఎంతటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా వీరికుంది.
అందరికళ్లు సిరాజ్‌పైనే..
మరోవైపు టీమిండియాలో తొలిసారి చోటు దక్కించుకున్న తెలుగుతేజం, హైదరాబాద్ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ సిరీస్‌కు పెద్ద ఆకర్షణగా మారాడు. తొలి మ్యాచ్‌లో అతన్ని ఆడిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఐపిఎల్‌లో, దేశవాళి క్రికెట్‌లో, భారత్‌ఎ తరపున నిలకడైన ఆటను కనబరచడంతో సిరాజ్‌ను టీమిండియాలోకి తీసుకున్నారు. అయితే జస్‌ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ వంటి స్టార్లు ఉండడంతో తుది జట్టులో సిరాజ్‌కు చోటు లభించడం కష్టమేనని చెప్పాలి. అంతేగాక, వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా ఈ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. దీంతో హార్ధిక్ పాండ్యను, లేదా స్పిన్నర్లలో ఒకరిని తప్పించి అతనికి చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే సిరాజ్ టీమిండియాకు ఆడడం తొలి మ్యాచ్‌లో దాదాపు అసాధ్యమేనని చెప్పాలి. అతనితో పోల్చితే శ్రేయస్ అయ్యర్‌కు తుది జట్టులో ఆడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. టి20లో మెరుగైన రికార్డు కలిగిన అతనికి తొలి మ్యాచ్‌లో చాన్స్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా కూడా ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. చాలా కాలంగా టీమిండియాకు సేవలు అందించిన నెహ్రా ఈ మ్యాచ్ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. దీంతో అతనికి చివరి మ్యాచ్‌లో చోటు దక్కడం ఖాయమనే చెప్పాలి.
ఈసారి కూడా..
మరోవైపు వన్డే సిరీస్‌లో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చిన న్యూజిలాండ్ తమకు అచ్చివచ్చే టి20ల్లో మరింత మెరుగైన ఆటను కనబరిచేందుకు తహతహలాడుతోంది. చివరి వన్డేలో భారత్‌ను దాదాపు ఓడించినంత పని చేసిన కివీస్ టి20 సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. భారత్‌పై ఉన్న అజేయమైన రికార్డును ఈసారి కూడా కాపాడు కోవాలని తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కివీస్ సమతూకంగా ఉంది. వన్డేల్లో రాణించిన రాస్‌కు టి20ల్లోనూ చోటు కల్పించారు. తొలుత అతన్ని సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అయితే వన్డేల్లో నిలకడగా రాణించడంతో టి20కు ఎంపిక చేశారు. కిందటి మ్యాచ్‌లు కెప్టెన్ కానె విలియమ్సన్ ఫాంలో వచ్చాడు. వికెట్ కీపర్ టామ్ లాథమ్ కూ డా జోరుమీదున్నాడు. మున్నో కూడా గాడిలో పడ్డాడు. మా ర్టిన్ గుప్టిల్ కూడా చెలరేగితే కివీస్ ఈ సిరీస్‌లోనూ సంచలనాలు సాధించడం ఖాయం. మాట్ హెన్రీ, నికోలస్‌లు కూడా బ్యాట్‌తో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్‌లో కూడా న్యూజిలాండ్ బలంగానే ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. సౌథి, బౌల్ట్, సాంట్నర్, ఆడమ్ మిల్నె తదితరులు టి20లలో మెరుగైన బౌలర్లుగా పేరు తెచ్చుకున్నారు. భారత్‌పై కూడా రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో సిరీస్‌లో భారత్‌కు గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది.